గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు విద్యా శాఖ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారికి ,
విషయం :పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్ష హాజరు విషయంలో విన్నపం
ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. నగరంలో, జిల్లాలలో విద్యార్ధి విద్యార్థినులు చాలా దూరాల నుండి ప్రయాణం చేసి పరీక్షా కేంద్రాలకు వస్తుంటారు. ఒక నిమిషం ఆలస్యం అయినా గేట్లు మూసి వేసి పరీక్ష హాలులోకి అనుమతించక పోవడం వల్ల విద్యార్థి,విద్యార్థినులు తీవ్ర ఇబ్బందికి, మానసిక ఆవేదనకు గురౌతున్నారు. ఎంతో శ్రమపడి సంవత్సరం అంతా చదివి పరీక్షలకు సిద్దమైన తరువాత ఒక్క నిమిషం ఆలస్యం వల్ల వారు ఒక విద్యా సంవత్సరం నష్టపోవాల్సి రావడం దారుణం. దీని గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఈ ఆలస్యం వాళ్ల నిర్లక్ష్యం వల్ల జరగడం లేదు. ఎంత ముందుగా బయలుదేరినా ట్రాఫిక్ జామ్ ల వల్ల, మెట్రో రైలు పనులు అవుతుండటం వల్ల, నగరంలో చాలా రోడ్లు అస్తవ్యస్తంగ ఉండి అనుకున్న సమయానికి చేరుకోలేక పోతున్నారు. తాము చేయని తప్పుకు ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి రావడం ఎవరికైన తీవ్ర మనస్తాపం కలిగించే విషయమే. నిన్న మలక్ పేట దగ్గరి శంకర్ నగర్ పేదల బస్తీలో పరీక్షకు అనుమతింపబడని ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. బస్తీ వాసులు సమయస్ఫూర్తితో కాపాడబట్టి ఆ అమ్మాయి ఇవ్వాళ సజీవంగా ఉంది.
విద్యార్థులు స్కూళ్ల గేట్ల దగ్గర వాచ్ మాన్, ఉపాధ్యాయులను బ్రతిమాలుతూ కాళ్ళు మొక్కుతున్న సంఘటనలు, రోడ్డుపై పడుకొని ఆవేదనతో ఏడుస్తూ పొర్లుతున్న దృశ్యాలు టీవీ వార్తా ఛానెళ్లలో కూడా చూపెట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ ఒక నిమిషం నిబంధన సడలించడానికి ప్రభుత్వంతో మాట్లాడమని మా సంస్థకు విన్నపాలు కూడా వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా మీరు వెంటనే జోక్యం చేసుకొని పరీక్షా సమయం విషయంలో 15 నిమిషాలు మినహాయింపు ఇచ్చి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట కలిగించాలని కోరుతున్నాం.
గౌరవాలతో
జి .మాధవరావు, రాష్ట్ర అధ్యక్షుడు
జి . మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
యస్ .జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
Recent Comments