మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన
15.06.2020.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి నలమాస కృష్ణ ను ఆదివారం, ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ఎన్ ఐ ఎ పోలీసులు అరెస్టు చేశారని కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణపై రాష్ట్ర పోలీసులు ఆరు కేసులు పెట్టారని , ఆరింట్లోను ఆయన బెయిలు పొందాడని కృష్ణ భార్య సంధ్య తెలిపింది. ఆయన కిడ్నీ ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఖమ్మం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా ఆదివారం నాడు ఎన్ ఐ ఎ పోలీసులు వారెంట్ కాగితం ఇచ్చి ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ ను, ఈ సమయంలో అరెస్టు చేయటం ఆయన ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా అని ఆమె ఆందోళన చెందుతున్నది.
వివిధ ప్రజా సంఘాలకు చెందిన 11 మంది కార్యకర్తలు ఇప్పటికే జైలులో ఉన్నారని, అందులో ముగ్గురికి బెయిల్ లభించిందని, మొత్తం 78 మంది పై కేసులు పెట్టడానికి రాష్ట్ర పోలీసులు జాబితా తయారు చేసి పెట్టుకున్నారని ప్రజా ఫ్రంట్ ప్రతినిధులు మా సంస్థకు తెలిపారు.
ప్రత్యామ్నాయ రాజకీయ అభిప్రాయాలు కలవారిపై , పాలకులకు రుచించని భావాలను ప్రకటిస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నది. ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్దమైన వైఖరిని మా సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వంలోని పెద్దలే కాదు, ప్రజా ప్రతినిధులందరూ బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రజా సంఘాల కార్యకర్తలకు బెయిల్ విషయంలో , వాళ్ళ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయించడంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయ పడాలని మేం కోరుతున్నాం. అరెస్టు చేసిన నలమాస కృష్ణను వెంటనే విడుదల చేయాలని, ప్రజాసంఘాల కార్యకర్తలు చట్టబద్దంగా పని చేసుకునే హక్కును అణచివేయవద్దని మా సంస్థ డిమాండ్ చేస్తున్నది.
1, ఎస్ జీవన్ కుమార్
( మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యులు)
2, గొర్రెపాటి మాధవరావు
( HRF రాష్ట్ర అధ్యక్షులు)
3, డాక్టర్ ఎస్ తిరుపతయ్య
(HRF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Recent Comments