Share

నాగరాజు మరణంపై సమగ్ర విచారణ జరపాలి.
మానవ హక్కుల వేదిక డిమాండ్

కీసర తహసీల్దారు నాగరాజు మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. జైలు అధికారులు చెపుతున్నట్టు అది ‘ఆత్మహత్య’ అని నమ్మడానికి కుటుంబ సభ్యులే కాదు ప్రజలెవరూ కూడా సిద్ధంగా లేరు. మానవహక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం నాగరాజు కుటుంబ సభ్యులతో, లాయరుతో, జైలు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తో మాట్లాడి తెలుసుకున్న వివరాలు ఇవీ:
నాగరాజు మీద రెండు తీవ్రమైన అవినీతి కేసులు ఉన్నప్పటికీ త్వరలో బెయిల్ మీద బయటకు వస్తాడనే నమ్మకంలోనే అతనూ, అతని లాయరూ, కుటుంబ సభ్యులూ ఉన్నారు. చనిపోయిన రోజు ఉదయం కూడా నాగరాజు తన కుటుంబ సభ్యులతో మామూలుగానే మాట్లాడాడు. అతని మాటల్లో ఎక్కడా నిరాశా నిస్పృహలు ధ్వనించలేదు. అలాంటి పరిస్థితిలో ఎంతో హై సెక్యూరిటీ ఉండే చంచల్ గూడ జైలులో మరో ముగ్గురు ఖైదీలతో కలిసి ఉన్న వ్యక్తి గదిలోని ఎవరికీ మెలకువ రాని విధంగా కిటికీ ఊచలకు తుండుగుడ్డతో ఉరి వేసుకుని చనిపోయాడంటే ఎలా నమ్మడం?పైగా ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో అతని శవాన్ని చూసిన బంధువులకు అతని మెడ మీద ఉరి వేసుకున్న గుర్తులేమీ కనిపించలేదు. మేము కూడా మృతదేహం ఫోటోలు చూసాము. ఆ గుర్తులేమీ లేవు. అంతే కాదు – ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తాను అనుమానిస్తున్నట్టు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన భార్య స్వప్నను ఆ ప్రయత్నం నుండి విరమింప జేయడానికి దబీర్ పురా పోలీసు అధికారులు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చింది? ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్న విషయాలే.
జైలులో జరిగింది కాబట్టి కస్టడీ మరణంగా పరిగణించి మెజిస్టీరియల్ విచారణ ఎలాగూ జరుపుతారు కాని ఈ కేసులో అంతకన్నా పై స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నాగరాజు బెయిల్ మీద బయటకు వస్తే ఎవరి పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉందో, అవి ఎంత పెద్దవారివో, ఆ వ్యక్తులకు ఈ ‘ఆత్మహత్య’తో ఎలాంటి సంబంధం ఉందో నిష్పాక్షికమైన న్యాయవిచారణ జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది.
తీవ్ర అవినీతి ఆరోపణలున్న వ్యక్తి కాబట్టి ‘ఎలా చస్తేనేం’ అనుకోకుండా ప్రజలు ఈ సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ప్రభుత్వం కూడా మరిన్ని అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా సత్వరమే న్యాయవిచారణకు ఆదేశించాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.

వి. బాలరాజ్, జంటనగరాల కార్యదర్శి
ఎస్. జీవన్ కుమార్, వి. వసంత లక్ష్మి
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయ కమిటీసభ్యులు
మానవ హక్కుల వేదిక