Share

మన భూమి నివాస యోగ్యం కాకుండా పోతున్నదా!

మానవజాతి అంతరించి పోయిన జీవజాతుల్లో చేరనున్నదా!

రండి తెలుసుకుందాం. మన పిల్లలకు,  భవిష్యత్తరాలకు మనము,మన ముందు తరాలు అనుభవించిన స్వచ్ఛమైన, జీవ కళ ఉన్న నేలను,గాలిని,నీటిని ఆహారాన్ని వాగ్ధానం చేద్దాం. అన్నిటికీ మించి వారిని మానవ జాతి వారసులుగా బ్రతకనిద్దాం.

ఈ ఎండలు మామూలు ఎండలు కావు,ఇది మామూలు వేడి కాదు బాబోయ్ అనుకోవటం సర్వసాధారణం అయిపోయింది. ఎండలో బయట రెండడుగులు పెడితే అల్లాడి పోతున్నాం. ఇది కేవలం ఎండ వేడి మాత్రమే కాదు.అంతకు మించిన మార్పులేవో ఉన్నాయ్. రేడియేషన్ ప్రభావం కూడా పెరుగుతోంది.

” భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు, ఈ సంవత్సరం బాగా మండిపోతున్నాడు, ఆగ్రహిస్తున్నాడు” వంటి కవితా పంక్తులు ఎండాకాలం పేపర్ లలో చూస్తుంటాం. నిజానికి మనం అనుభవించే ఎండ వేడి తీవ్రతకి భానుడికి ఎటువంటి సంభంధం లేదు. భానుడు మొదటి నుండీ మార్పు లేకుండా తన వేడిని,కాంతిని భూమి పైకి ఒకే తీరుగా పంపుతున్నాడు. కేవలం ఋతువుల అమరిక వల్ల,భూ వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల మాత్రమే మనమే ఎండ తీవ్రత లో తేడాను అనుభవిస్తున్నాం. సహజంగా ఏర్పడ్డ ఋతువులు ఇంకా మారలేదు. కానీ సహజంగానే ఏర్పడ్డ భూ వాతవరణపు పొర అసహజంగా మారుతున్నది. ఫలితం అంతా విషపూరితం. జీవ జాల మనుగడే సంక్షోభ స్థాయికి చేరింది. ఒక యాభై ఏళ్ల కింద ఉన్న చాలా పక్షులు,జంతువులు ఇపుడు లేవు. అంతరించి పోయాయి. మనిషీ వాటి జాబితాలో చేరనున్నాడా?

అవుననే సమాధానం చెప్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యావరణ శాస్త్రవేత్తలు.

 ఏం జరుగుతోంది

భూ వాతావరణం చాలా వేగంగా వేడెక్కుతోంది. ఫలితంగా మంచు కొండలు వేగంగా కరుగుతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.

కొన్ని చోట్ల మాత్రం మామూలు కంటే చల్లబడుతోంది. ఊహించని వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. తరచూ తీవ్రమైన తుఫానులు, చలి,వర్షాకాలాల్లోనూ విపరీత ఎండలు చూస్తున్నాం. ఎండాకాలం బయట అడుగు పెడితే చర్మం కాలిపోయేంత వేడి.

కారణం

    భూ వాతావరణం లో ఉష్ణోగ్రత పెరుగుతోంది. సూర్యుని నుండి వచ్చే వేడి తీవ్రత ఎప్పటి స్థాయిలోనే ఉన్నా మనం ఎక్కువ వేడిని అనుభవించిటానికి గల కారణం గతం కంటే భూమి చుట్టూగల వాతావరణం లో గ్రీన్ హౌస్ వాయువులనబడే కార్బన్ డయాక్సైడ్, మీథేన్,నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్ లు పెరగటమే. ఇవి సూర్యుని నుండివచ్చే ఇన్ఫ్రా రెడ్ కిరణాలు భూమిని తాకినంక తిరిగి వెనక్కి వెళ్లకుండా నిలవరిస్తాయి. దీంతో భూ వాతావరణం లో వేడి, ఇన్ఫ్రా రెడ్ రేడియేషన్ పెరుగుతుంది. కాబట్టి ఈ వాయువులు వాతావరణం లో ఎంత పెరిగితే భూమి అంత వేడెక్కుతుంది,ఇంకా చాలా జరుగుతాయి. గ్రీన్ హౌస్ వాయువులు పెరగటానికి కారణం పర్యావరణంలో పెరిగే కాలుష్యమే. కాలుష్యం పెరగటానికి కారణం మనకు కొంత తెలుసు, పర్యవసానాలు కొన్ని మన అనుభవం లోకే వచ్చేశాయి. గాలి పీల్చుకునే లాగా లేదు,నీరు తాగే లాగా లేదు,ఆహారం తినేటట్లు లేదు. కానీ దాంతో వాతావరణంలో వస్తున్న  మార్పులు (CLIMATE CHANGES) మాత్రం పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయమై ఎన్నో పరిశోధనలు,అధ్యయనాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పర్యవసానాల్ని అంచనావేసే శాస్త్రవేత్తలెందరో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.

ఈ విషయాలు ప్రభుత్వాలకు, వారి వాస్తవ మిత్రులకు అంతగా రుచించవు. కాబట్టి వారు సామాన్య మానవులదాకా ఇట్లాంటివి రానీయరు. కానీ మామూలు మనుషుల్లోనూ అందరి క్షేమం కోరే వారున్నట్టు శాస్త్రవేత్తల్లోనూ ప్రజా శాస్త్రవేత్తలున్నారు. పర్యావరణ ఉద్యమకారులున్నారు. వారు మానవాళి క్షేమం కోరి శ్రమకోర్చి అనేక అధ్యయనాలు చేసి, వాటిని క్రోడీకరించి చర్చించి శాస్త్రీయ నిర్ధారణలను ప్రజలకు చెప్పి వారిని హెచ్చరించటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. వారిలో ఒకరే డా.బాబూరావు గారు. వారు ఈ సదస్సుకు  ప్రధాన వక్తగా వస్తున్నారు. మరో వక్త NTPC విశ్రాంత ఇంజినీర్ పర్యావరణ వేత్త ఉమా మహేశ్వర్ గారు. ఇంకా మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.

 

మేం కోరుకునేదల్లా ఈ ప్రాంత  బుద్ది జీవులు, సామాజిక ప్రభావ శీలురైన వ్యక్తులు, వివిధ వృత్తుల్లో ఉన్న విద్యాధికులు ముఖ్యంగా ప్రభుత్వ,ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యా సంస్థల భాద్యులు తప్పకుండా ఈ సదస్సుకు హాజరై వక్తలతో ఇంటరాక్ట్ అయి పర్యావరణ ఉద్యమాన్ని మీ పద్దతిలో ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  

 

 సదస్సులో మన ప్రాంత యువ పురా పరిశోధకుడు సముద్రాల శ్రీనివాస్ పాల్గొంటారు. విజ్ఞాన,సాహితీ ప్రియుల కోసం పుస్తక ప్రదర్శనలు ఉంటాయి.

    తేదీ:  24.04.2019; సమయం: 11am

    స్థలం: సాయిరాం డిగ్రీ కాలేజ్ (మొదటి అంతస్తు హాల్), పాత అంబేద్కర్ చౌరస్తా దగ్గర,జమ్మికుంట, కరీంనగర్ జిల్లా.

        సమావేశానంతరం లంచ్ ఏర్పాటు ఉంటుంది

           – మానవ హక్కుల వేదిక,కరీంనగర్ జిల్లా శాఖ.

 ప్రచురణ కర్తలు:1,డా.ఎస్.తిరుపతయ్య 2, ముక్క ఐలయ్య 3, జి. మధు 4, భువనగిరి రాజన్న, 5 జి. గణేష్,6, టి. బిక్షపతి.