గాదె నరసయ్య మృతికి ఫారెస్ట్ సిబ్బందే కారణం

నిర్మల్ జిల్లా కడెం మండలం గండి గోపాలపురం గ్రామానికి చెందిన నరసయ్య మృతికి ఫారెస్ట్ సిబ్బంది కారణం అని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం విచారణ జరిపింది. మా విచారణలో నరసయ్య కుటుంబాన్ని, గ్రామస్తులను, ఫారెస్ట్ సిబ్బందిని కలిసి వివరాలు సేకరించాము.
60 సంవత్సరాల వయస్సు గల నాయకపోడు ఆదివాసి తెగకు చెందిన గాదె నరసయ్య మేకలు కాస్తూ జీవించేవాడు. రోజు మాదిరిగానే మే నెల 4వ తారీఖు సోమవారం కూడా ఉదయం 7 గంటలకే అతను, అతనితోపాటు చిన్న నరసయ్య కలిసి మేకలను తోలుకొని అడవికి వెళ్ళారు. ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బానోత్ రమేష్ ఆధ్వర్యంలో మరో ముగ్గురు సిబ్బంది కలిసి అతి చిన్న ఆరోపణపై నర్సయ్య మీద పడి, కొట్టి అదుపులోకి తీసుకున్నట్టు ప్రత్యక్షసాక్షి చిన్న నరసయ్య చెప్పాడు. సాయంత్రం ఆరున్నర గంటల వరకు నర్సయ్య ను ఆఫీస్ లోనే నిర్బంధించి ఉంచిన ఫారెస్ట్ సిబ్బంది ఆ తర్వాత నరసయ్యను అతని కుటుంబీకులకు, గ్రామస్తులకు అప్పగించారు. ఫారెస్ట్ ఆఫీసులోనే నరసయ్య నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఇంటికి చేరుకున్న నరసయ్య నొప్పులతో బాధపడుతూ ఫారెస్ట్ సిబ్బంది కొట్టిన గాయాలను తనకు చూపించి ఏడ్చినట్టు నరసయ్య భార్య చెప్పింది. రాత్రి నుండి క్రమంగా నరసయ్య కి సమస్యలు పెరిగి మూత్ర విసర్జనతో పాటు, కడుపునొప్పితో బాధపడ్డాడు. పరిస్థితి మరింత విషమంగా మారటంతో ఉదయం 5 గంటలకు ఆస్పత్రికి వెళ్లే ఏర్పాట్లు చేస్తుండగానే నర్సయ్య చనిపోయాడు.
నరసయ్య భార్య మరియు గ్రామస్తులు అందరూ అతని మృతికి ఫారెస్ట్ సిబ్బంది దెబ్బలే ప్రత్యక్ష కారణమని ఆరోపిస్తున్నారు.
ఫారెస్ట్ సిబ్బంది పై ప్రజలు తిరగబడటానికి నరసయ్య కి జరిగిన అన్యాయమే కాక ఏడాది కాలంగా ఫారెస్ట్ అధికారుల వేధింపులు స్థానికులపై బాగా పెరిగి పోయాయి. ప్రజల్ని బెదిరించడం, కొట్టడం డబ్బులు డిమాండ్ చేయడం అధికారుల కి నిత్యకృత్యంగా మారింది. అమాయక ఆదివాసీలను ఏం చేసినా చెల్లుతుంద నే అహంకారంతో ఎఫ్ఆర్వో సిబ్బంది విచక్షణా రహితంగా నరసయ్య ను కొట్టారు.
నర్సయ్యది సహజ మరణం కాదు. నర్సయ్య ఏదో ప్రమాదంలో చనిపోలేదు. నర్సయ్య ఆత్మహత్య చేసుకోలేదు. ఫారెస్టు అధికారులు కొట్టిన దెబ్బలకే మరణించాడు. అంటే నర్సయ్యది హోమిసైడల్ కిల్లింగ్, బలవన్మరణం. అందువల్ల
మానవ హక్కుల వేదిక ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతోంది.
1. నర్సయ్య చావు పై ఫిర్యాదు అందినా అందకపోయినా పోలీసులే తమకై తామే హత్య కేసు కింద ఎఫ్ ఐ ఆర్ జారీ చేయాలి. ఫారెస్టు రేంజి ఆఫీసర్, అతని సిబ్బందిని ఎఫ్ ఐ ఆర్ లో అనుమానితులుగా చూపించాలి. నరసయ్య మృతికి కారణమని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎఫ్ ఆర్ వో బానోత్ రమేష్ , సత్యపాల్, లచ్చి రామ్ , శంకర్ రాథోడ్ , ఊహ లను తక్షణమే ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలి. వారిపై హత్యా నేరం మోపి విచారణ జరపాలి. వారిని ప్రాసిక్యూట్ చెయ్యాలి.

2, నరసయ్య భార్య రాజవ్వ జీవనాధార నిమిత్తం ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా గా 20 లక్షల రూపాయలు, ఐదు ఎకరాల భూమి అందించాలి.

3, గిరిజన గూడాలపై చిన్న చిన్న కారణాలతో ఫారెస్ట్ సిబ్బంది చేస్తున్న వేధింపులను, దౌర్జన్యాలను తక్షణమే నిలిపివేయాలి. అటువంటి ఫిర్యాదులను ఎదుర్కొనే సిబ్బందిపై ఆలస్యం చేయకుండా శాఖాపరమైన చర్యలను చేపట్టాలి. క్రిమినల్ కేసులను నమోదు చేయాలి.
4, SC,ST commission ఈ విషయంలో జోక్యం చేసుకొని నరసయ్య కుటుంబానికి న్యాయం చేయడమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల హననాన్ని ఆపేలా విధాన రూపకల్పన చేయాలి.
5, ఇటువంటి సంఘటనలు పునరాృతం కాకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.

మానవ హక్కుల వేదిక వాస్తవ సేకరణ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాదావాత్ రాజు , ఆదిలాబాద్ జిల్లా యూనిట్ అధ్యక్షులు ఆత్రం సుగుణ , ఆసిఫాబాద్ యూనిట్ కార్యదర్శి కనకా వెంకటేష్ , ఎండి అన్వర్ లు పాల్గొన్నారు.