Share

కార్మిక చట్టాల రద్దు నియంతృత్వ చర్య
– డా.ఎస్. తిరుపతయ్య.
కరోనా సంక్షోభ సమయమని కూడా చూడకుండా, ప్రజలమధ్య చర్చా లేకుండా మూడు బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ల పాలకులు బీదా బిక్కీ తినే అన్నంలో ఈ రోజు విషం కలుపుతున్నారు. ఈ మూడు రాష్ట్రాలే కాక మరిన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వీరితో కలుస్తున్నాయి. అంతా కూడబలుక్కున్నట్టు జరుగుతున్న ఈ కుట్ర కేంద్రంలో అధికారాన్ని వెలగబెట్టే వారి దర్శకత్వంలో నడుస్తున్నది. ఇప్పటివరకు కొంత అండగా ఉన్న మొత్తం 38 కార్మిక చట్టాలలో 35 చట్టాలను గంపగుత్తగా 3 సంవత్సరాల పాటు సస్పెన్షన్ పేరుతో రద్దుచేస్తూ కేంద్ర అనుమతికై వీరు తమ అధినాయకులకు పంపించారు.
ఒకవైపు కరోనా రోగం, దానితో పాటు రెప్పపాటులో పోయిన ఉపాధి, ఇళ్లకు చేరటమే జీవన్మరణ సమస్య అయ్యే స్థాయిలో వలస కార్మికుల జీవితాలున్నాయి. తమకు జీతాలు ఇవ్వక, పోషణ బాధ్యతా తీసుకోక రోడ్డున పడేసిన పెద్దమనుషుల సంస్కార హీనతకు చెంప పెట్టుగా వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. ఈపాటి నాగరికులను నమ్మి ఇక్కడిదాకా రావటంకంటే, పుట్టిన కాడ బలుసాకైనా తిని బ్రతకవచ్చని వారు వెళ్తున్నారని దేశంలోని ‘పెద్దమనుషుల’కర్థం అయ్యింది. ఇక స్థానిక శ్రామికవర్గాలైన అట్టడుగు సామాజిక,ఆర్థిక వర్గాలు స్థానిక బలంతో పాటు సంఘటితంగా ఉండటం, హక్కుల పట్ల అవగాహన, రాజకీయ చైతన్యం, కొంతకాలంగా పెరిగిన మోస్తరు ఆర్థిక భద్రతతో ఉన్నారు. వీరంతా ఇప్పుడిప్పుడే కొంత గౌరవప్రదమైన వృత్తులకు,పనులకు, జీవితానికి అలవాటు పడుతున్నారు. వీరి ఈ మాత్రపు హక్కులు, అభివృద్ధికే దేశపు ఆర్థిక,రాజకీయ పెద్ద మనుషులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కోట్లాది మంది వలస కార్మికుల శ్రమను తేరగా కొల్లగొట్టడానికి అలవాటుపడ్డ పారిశ్రామిక వర్గం అటువంటి దోపిడీకి అవకాశం నిరంతరంగా ఉండేటట్టు చట్టాలను మార్చుకోవాల నుకున్నారు. ఫలితమే ఈ కార్మిక చట్టాల రద్దు నిర్ణయాలు.
ఫలితంగా, పనిగంటలు 8 నుండి 12 గంటలకు పెంపు, కనీస వేతనాలకు హామీ లేకపోవటం ( ఉత్తర ప్రదేశ్ లో ఏకంగా కనీస వేతన చట్టాన్నే ఎత్తివేశారు), శ్రామికుల నియామకం, తొలగింపునకు యజమానులకు ఎటువంటి నిభంధనల్లేకపోవటం, పనిస్థలాల్లో శ్రామికుల కోసం ఉన్న కనీస వసతులను తొలగించటం, ప్రైవేటు సంఘటిత రంగంలోనూ ఇప్పటిదాకా అమలై కొంత శ్రామికుల భవిష్యత్తుకు,ఆరోగ్యానికి అండగా ఉన్న EPF, ESI చట్టాల తొలగింపు, పని పరిస్థితుల్లో యజమాన్యం చేపట్టాల్సిన కనీస వసతుల (ఉదాహరణకి ప్రాథమిక చికిత్సకు ఏర్పాటు, టాయిలెట్స్, మంచినీరు ,పని స్థలంలో గాలి వెలుతురు ఉండేలా చూడటం) నిబంధనలను సైతం తొలగించటం, యజమానులతో తలెత్తే వివాదాల పరిష్కారం కోసం ఇప్పుడున్న అన్ని చట్టబద్ధ అవకాశాలను ( లేబర్ కోర్టు, సివిల్ కోర్టులు, సంఘం పెట్టుకుని న్యాయం అడిగే అవకాశం ) తొలగించడం ఈ 35 కార్మిక చట్టాల రద్దు ద్వారా ప్రజలు కోల్పోతున్న ముఖ్యమైన హక్కులు. ఈ ఘన కార్యాలను సమర్ధించుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో పెట్టుబడులు, అభివృద్ధి పెరగటానికి, ఉపాధి కల్పనకే ఈ “సంస్కరణలు” అంటూ సిగ్గు లేని వాదనలు చేస్తున్నాయి. పనిగంటల పెంపుతో ముగ్గురు చేసే పనిని ఇద్దరి చేసిన తర్వాత కొత్త వారికి ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయి. కనీస వేతనానికే దిక్కులేక పోయిన తర్వాత కార్మికుల ఆర్థిక స్థితి ఎలా పెరుగుతుంది.
దేశ ఆర్థిక అభివృద్ధి అంటే దేశంలోని పౌరులందరి ఆర్థిక స్థితిగతులు పెరగటం కాదా! కేవలం బలిసిన వాళ్ళ సంపద పెరగటమేనా? దేశంలోకి పెట్టుబడులు వస్తే దేశంలో శ్రామికులకు డిమాండు పెరగాలి. ఫలితంగా కార్మికులకు వేతనాలు, సౌకర్యాలు, గౌరవం మరింత పెరగాలి. కానీ వీరు చేస్తున్న కార్మిక చట్టాల రద్దుతో అలా జరుగుతుందా! శ్రామికులకు అతి తక్కువ వేతనాలకు, అదీ హామీ లేని పరిస్థితులలో గొడ్డు చాకిరీ చేయటం, నిర్బంధంగా పని చేయాల్సిరావటం, హక్కులు లేని, చట్టబద్ధ నిరసనలకు కూడా అవకాశం లేని అంధకారం మాత్రమే మిగులుతాయి. దీంతో 200 ఏళ్ల కిందటి దారుణ పని పరిస్థితుల్లోకి దేశ ప్రజలు వెళ్లనున్నారు. ఈ చర్యలు ప్రజల ఆర్థిక స్థాయి,గౌరవాలు పెరుగు తాయని వాదించ టానికి మూర్ఖులు సైతం ముందుకు రారు. కేవలం బానిస యాజమానుల స్వభావం కలిగిన పాలకులు తప్ప ఇంకెవరూ ఈ క్రూరమైన, ప్రజావ్యతిరేక దుర్మార్ఘానికి పూనుకోరు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ కష్టకాలంలో కార్మికులకు అండగా నిలుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన యూరప్ దేశాలు, కెనడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా లతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలైన అర్జెంటీనా , బంగ్లాదేశ్ , మలేషియా ,ఫిలిప్పీన్స్ సౌతాఫ్రికా, థాయిలాండ్ వంటి దేశాలు సైతం సంపన్న వర్గాలకు కాక పేద, శ్రామిక వర్గాలకే అండగా ఉంటున్నాయి. బ్రిటన్ దేశం ప్రైవేటు యాజమాన్యం ఇవ్వాల్సిన జీతంలో దాదాపు 80 శాతం సొమ్మును ప్రభుత్వమే యాజమాన్యం ద్వారా ఉద్యోగులకు అందిస్తూ వారి ఉద్యోగ భద్రతను కాపాడుతున్నది. కెనడా 2.1 బిలియన్ డాలర్ల డబ్బును అల్పాదాయ, అత్యవసర కార్మికులకు జీతాల పైన అదనంగా ఇస్తున్నది. ఇంకా, ప్రతి కార్మికునికి, స్వయం ఉపాధిలో గల వ్యక్తులకూ నెలకు1400 డాలర్ల ఆర్థిక సహాయం అందిస్తున్నది. వియత్నాం దేశం ఈ సంక్షోభ కాలానికి ప్రైవేటు కంపెనీల్లో ని జీతాలు రాని ఉద్యోగులకు ప్రభుత్వమే నెలకు 70 డాలర్ల చొప్పున అందిస్తున్నది. ఇతర పేదలకు నెలకు నలభై డాలర్ల సహాయాన్ని అందిస్తున్నది. బంగ్లాదేశ్ సైతం ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ దాదాపు 90 మిలియన్ డాలర్ల మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నది. అంతేకానీ ప్రపంచం లోని ఏ దేశమూ ఇటువంటి వికృత చేష్టలకు దిగలేదు. భారతదేశం మాత్రం ఉన్న ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న పేదప్రజలను బానిసల కింద జమకట్టి , అంతులేని దోపిడీ చేసుకొమ్మని కార్పొరేట్లను ఊరిస్తున్నది. పైగా ఇవన్నీ ఉపాధి కల్పన కోసము, ఆర్థికాభివృద్ధి కోసమని చెప్తున్నారు. ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తు లు పోనీవండి, మనిషి రూపంలో ఉన్నవాడికి కొద్దిగా సిగ్గు,బిడియం లాంటివైనా ఉండాలికదా! ఈరోజు భారత దేశంలోని పాలకులకు దేశ అభివృద్ది అంటే దేశంలోని పౌరుల సంక్షేమము, అభివృద్ధి అనే సోయి కూడా ఉండటం లేదు. నిస్సిగ్గుగా కేవలం దేశాన్ని కొల్లగొట్టే దేశీయ, అంతర్జాతీయ దోపిడీ దొంగల ఆదేశాలు తప్ప వారికి మరొకటి కనిపించటం లేదు. కార్మికుల పట్ల ఎంతో హీనమైన భావన ఉంటే తప్ప ఇంత దుర్మార్గానికి ఎవరూ దిగలేరు. బహుశా మన దేశ పాలకుల ఈ భావనకు పునాది హైందవ మనుధర్మ నీతిలో ఉండవచ్చు.
కార్మికలోకం ఈ రోజు అనుభవిస్తున్న హక్కులు ఒక్క రోజులో వచ్చినవి కావు, ఒక్క వ్యక్తి దయతో ఇచ్చినవీ కాదు. శతాబ్దాల ప్రజా పోరాటాలు, కాలక్రమంలో ప్రజాస్వామ్య అభివృద్ధిలో భాగంగా వచ్చినవి. చారిత్రక హక్కులన్నీ ఇలా గంపగుత్తగా దిక్కులేకుండా రద్దు కాబడటం దేనికి సంకేతం. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా లేకపోయి అయినా ఉండాలి లేక పాలకుల్లో నియంతృత్వ లక్షణాలైన పెరుగుతూ ఉండాలి. ఈ పరిణామాలతో సమాజం ముందుకు నడుస్తున్నట్టా, వెనుకకా అనేది ప్రజలు, కార్మికులు(శారీరక, మేథో) , చైతన్యవంతులు ఆలోచించాలి. ప్రకృతి దృష్టిలో ఉన్నట్లు సమాజంలో కూడా ప్రతి మనిషికీ ఒకే విలువ ఉండాలని ప్రజాస్వామ్యం చెప్తుంది. దానిని మనదేశంలో డా. బి. ఆర్.అంబేడ్కర్, తెలుగు రాష్ట్రాల్లో డా.కె.బాలగోపాల్ గారు తాత్విక రంగంలో ముందుకు తీసుకుపోయారు.
పాలకుల ఈ దుర్మార్గాన్ని అడ్డుకుని ఆ సమానత్వపు విలువలను కాపాడుకుందామా!.
– డా.ఎస్. తిరుపతయ్య
( మానవ హక్కుల వేదిక).
12.05.2020.