Manifesto

మానవహక్కుల వేదిక ప్రణాళిక

(2005 మే 8వ తేదీన మిర్యాలగూడెంలో జరిగిన మొదటి రాష్ట్ర మహాసభలలో ఆమోదించినది)

ఒక విశాలమైన, స్వతంత్రమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించడం మానవహక్కుల వేదిక లక్ష్యం.
ప్రజా బాహుళ్ళంలోని ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనకు తోడ్పడడం హక్కుల ఉద్యమం కర్తవ్యం. తమ జీవితాలను మెరుగుపరచుకునే అవకాశాలు అన్ని కోణాలలోనూ అభివృద్ధి చెందాలనీ, పరిపాలనలో ప్రజాస్వామ్యం బాగుండాలనీ, పాలనా విధానాలు ప్రజల జీవితాలను బాగుపరిచే దిశగా సాగాలనీ, సమత, స్వేచ్ఛ, స్వతంత్రం, ఆత్మగౌరవం మొదలైన మానవతా విలువలకు సమాజంలోసముచిత స్థానం ఉండాలనీ, మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతి నెలకొనాలనీ ప్రజలు నిత్యజీవితంలో కోరుకుంటారు. ఈ కోర్కెల సాధనకు తన పద్ధతిలో తోడ్పడడం హక్కుల ఉద్యమం కార్యాచరణకు గీటురాయి.
ఈ కృషిలో కలిసిరాగల వారందరికీ చోటుకల్పించే విశాల స్వభావాన్నీ అవగాహననూ, నిర్మాణాన్నీ హక్కుల ఉద్యమం రూపొందించుకుంటుంది.
హక్కుల ఉద్యమం విశాల స్వభావాన్ని కలిగి ఉండాలంటే, ఏ ఒక్క రాజకీయ దృక్పథానికీ పరిమితం కాకుండా, హక్కులను అభివృద్ధి చేయగల అన్ని రాజకీయ దృక్పథాల నుండీ నేర్చుకుంటూ తనదైన ఒక హక్కుల ప్రాపంచిక దృక్చథాన్ని రూపొందించుకోవడం అవసరం. హక్కుల ఉద్యమం ఆ దిశగా కృషి చేస్తుంది. ప్రజాస్వామ్య స్వభావం గల రాజకీయ దృక్పథాలన్నిటిలోనూ స్థూలంగా ఒక హక్కుల పార్శ్వం, ఒక నిర్దిష్టమైన రాజకీయ పార్శ్వం ఉంటాయి. ఇందులో రెండవ పార్శ్వానికి సంబంధించిన తర్జన భర్జనలతో నిమిత్తం లేకుండా మొదటి పార్శ్వాన్ని హక్కుల ఉద్యమం స్వీకరిస్తుంది. తన ఆలోచనలలోనూ, అవగాహనలోనూ అంతర్లీనం చేసుకుంటుంది. విభిన్న ప్రజాస్వామిక దృక్పథాల సమాహారమైన హక్కుల దృక్పథాన్ని రూపొందించుకుంటుంది.
ప్రజాస్వామ్య స్వభావం గల అన్ని రాజకీయ దృక్పథాలూ ఒక విషయాన్ని నొక్కి చెప్తాయి. అణచివేత, అసమానత హక్కుల లేమికి మూలం అని చెప్తాయి. ఒక్కొక్క ప్రగతిశీల రాజకీయ దృక్పథం ఒక్కొక్క రూపంలోని అణచివేతకు, అసమానతకు తన అవగాహనలో కేంద్ర స్థానం ఇస్తుండవచ్చును గాక. కానీ అన్నీ చెప్పే సామాన్య సత్యం ఇది.
సమాజంలో వ్యవస్థీకృతంగా ఉన్న అసమానత, అణచివేతలు హక్కుల లేమికి మూలం అని హక్కుల ఉద్యమం గుర్తిస్తుంది. ఆ అణచివేత రాజకీయం కావచ్చు, సాంఘికం కావచ్చు, ఆర్థికం కావచ్చు, సాంస్కృతికం కావచ్చు. అన్ని రకాల అణచివేతలను వ్యతిరేకించే దిశగా తనదైన పద్ధతిలో హక్కుల ఉద్యమం కృషి చేస్తుంది.
ఉదాహరణకు ప్రస్తుతం మన సమాజంలో వనరులపైన అసమాన యాజమాన్యం, కులపెత్తనం, వర్ణ ధర్మ సంస్కృతి, స్త్రీలపైన ఇంటా బయటా మగవారి పెత్తనం, రాజకీయ, ఆర్థిక జీవితంపైన అభివృద్ధి సాధించిన ప్రాంతాల ఆధిపత్యం, ప్రకృతినీ పర్యావరణాన్నీ ధ్వంసంచేసే అభివృద్ధి నమూనా, పెట్టుబడిదారీ ఆర్ధికనీతి, ఆదివాసుల జీవన వనరులపైన బయటివారి ఆధిపత్యం, ప్రపంచీకరణ పేరిట నెలకొంటున్న ప్రపంచ పెట్టుబడిదారీ పెత్తనం, మత మైనారిటీల పైన అణచివేత, రాజ్యాంగ యంత్రాంగానికి పౌరులపైన ఉండే అణచివేత అధికారాలు మొదలైన అణచివేత వ్యవస్థలన్నీ హక్కుల లేమికీ అతిక్రమణకూ మూలమని హక్కుల ఉద్యమం గుర్తిస్తుంది.
ప్రజలు ఈ అణచివేతలకు వ్యతిరేకంగా ఒక్కొక్కసారి పోరాటాలు చేస్తారు. ఆ పోరాటాలు చట్టం పరిధిలో ఉండవచ్చు. చట్టాన్ని ధిక్కరించీ సాగవచ్చు. ఒక్కొక్కసారి సంస్కరణాత్మకమైన కృషిద్వారా ప్రజలు అణచివేతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఏమీ చేయలేక దానిని అనుభవిస్తారు.
ఈ ఒక్కొక్క సందర్భంలోనూ హక్కుల ఉద్యమానికి ఒక్కొక్క రకమైన పాత్ర ఉంటుంది. అన్నిటికీ హక్కుల ఉద్యమం ఒకే రకమైన ప్రాధాన్యం ఇస్తుంది. ఉద్యమించే హక్కును, దానికి అవసరమైన భావస్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛలను కాపాడడానికి కృషి చేస్తుంది. ఉద్యమాలు చట్టాన్ని ధిక్కరించి సాగినా వాటితో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించాలని చెప్తుంది. ఉద్యమాలను అణచివేసే వైఖరితోకాకుండా అర్థం చేసుకునే వైఖరితో వ్యవహరించాలని చెప్తుంది. ఉద్యమాల లక్ష్యాలను వక్రీకరించే ప్రయత్నాలను ఎదుర్కొంటుంది. వాటి మూలాలను అన్వేషించి సమస్యలను ప్రజాస్వామికంగా పరిష్కరించాలని చెప్తుంది.
ఉద్యమాలు, సంస్కరణలు ఇవాళ కొత్తగా జరగడం లేదు. ఎప్పటినుండో జరుగుతున్నాయి. వాటి ఫలితంగా రాజకీయ, సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో అనేక ప్రజాస్వామిక విలువలు, హక్కులు, సంస్థలు రూపొంది ఉన్నాయి. వాటిలోని లోపాలనూ, అసమగ్రతనూ ఎండగడుతూనే, వాటిని కాపాడడానికీ, విస్తరింపచేయడానికీ చేయగల కృషి హక్కుల ఉద్యమం చేపడుతుంది. సంస్కరణల ప్రయత్నానికి తోడ్పడుతుంది.
రాజ్యాంగ వ్యవస్థలోనూ, సామాజిక జీవితంలోనూ వ్యవస్థితమై ఉన్న ప్రజాస్వామిక హక్కులు, విలువలు వాటంతటవి విలువైనవేకాక ప్రజల నిత్యజీవితం స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భీతిగా సాగడానికి కొంతమేరకు ఉపయోగపడతాయి. మరిన్ని సంస్కరణలు చేపట్టడానికి తోడ్పడతాయి. అంతేకాక, అణచివేతను సంఘటితంగా ఎదుర్కొనే స్థితిలో లేని ప్రజానీకానికి ఏమైనా రక్షణ ఉంటే అది వీటినుండే వస్తుంది. అసంఘటిత ప్రజావర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం, వారి హక్కులను రక్షించడం కోసం ఈ హక్కులనూ, విలువలనూ హక్కుల ఉద్యమం పెంపొందించే కృషి చేస్తుంది.
పాలనా వ్యవస్థలోనూ, సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యంలోనూ ఉన్న ప్రజాస్వామిక విలువల వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఒక్కొక్క దానికోసం చాలా పోరాటాలు, చాలా జటిలమైన సంస్కరణాత్మక కృషి జరిగాయి. మన దేశంలోనూ, ఇతర దేశాలలోనూ జరిగాయి. ఒక దేశంలో జరిగిన కృషి ఫలితాలు ఇతర దేశాలకు వ్యాపించి ఇప్పుడు మానవ నాగరికతను నిర్వచించే లక్షణాలలో భాగమయ్యాయి. వాటినన్నిటినీ హక్కుల ఉద్యమం తన వారసత్వంగా స్వీకరిస్తుంది. వాటికి వ్యవస్థిత రూపం ఇచ్చే చట్టాలు, సంస్థలు, సంప్రదాయాలలోని లోపాలనూ, అసమగ్రతనూ విమర్శిస్తూ వాటికి సమగ్ర రూపం ఇచ్చి మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కొత్తగా ఉనికిలోకి వచ్చిన విలువలకు సాధికారత సంపాదించడం కోసం కృషిచేస్తుంది. వాటి వ్యాప్తికోసం కృషి చేస్తుంది. వాటి వక్రీకరణను ఎదుర్కొంటుంది. వాటి వ్యవస్థీకరణ కోసం పనిచేస్తుంది. వ్యవస్థితమైన వాటి అమలుకోసం కృషి చేస్తుంది. వాటిని పరిమితం చేసే ప్రయత్నాలనూ వెనక్కి తీసుకునే ప్రయత్నాలనూ ఎదుర్కొంటుంది.
పాలనా యంత్రాంగంలోని ప్రజాతంత్ర సంస్థలలో అసమగ్రత ఉండడమేకాక, వాటికి ఒక్కొకసారి ‘రెండు వైపులా పదును’ ఉంటుంది. అవి ఒక వైపు ప్రజలకు హక్కులు కల్పిస్తాయి. మరొకవైపు ప్రజల హక్కులను పరిమితం చేయడానికి వాటిని వాడుకోవడమూ జరుగుతుంది. హక్కుల ఉద్యమం ఈ సత్యాన్ని గుర్తించి ప్రజాస్వామ్యం పేరిట హక్కులను హరించి వేసే ప్రయత్నాల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది.
అణచివేతకు గురయ్యే ప్రజలు తమ హక్కుల కోసం, తమ జీవితాల మెరుగుదలకోసం పోరాటాలు చేసుకుంటారు కదా, అటువంటప్పుడు ప్రత్యేకంగా ఒక హక్కుల ఉద్యమం ఆవశ్యకత ఏమిటన్న ప్రశ్న వస్తుంది. పోరాటాలు చేయలేని ప్రజలు, సంఘటితం కాలేని ప్రజలు చాలామంది ఉంటారు. ప్రజలు సంఘటితం కాలేని సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ప్రత్యేకమైన హక్కుల ఉద్యమం ఆవశ్యకతకు అంతకంటే లోతైన కారణం ఉంది. ఒక ప్రజావర్గం తన హక్కులకోసం పోరాడడం వేరు. ‘హక్కులు’ అనే భావనను పెంపొందించడం కోసం కృషి చేయడం వేరు. ఈ రెండింటి మధ్య పరస్పర సంబంధం ఉన్నప్పటికీ ఇవి వేరు వేరు కర్తవ్యాలు. నిర్దిష్టమైన హక్కుల సాధనకూ ‘హక్కులు’ అనే భావన వ్యాప్తికీ మధ్యనున్న తేడా ఇది. రెండవ కృషి విజయవంతమైన మేరకు అది మొదటి కృషికి విస్తృతి కల్పిస్తుంది. విభిన్నమైన హక్కుల పోరాటాల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఈ ప్రత్యేకత నుండి పుట్టిన అనేక కర్తవ్యాలు హక్కుల ఉద్యమం కార్యరంగాన్ని నిర్దేశిస్తుంది.
అలాగే ప్రజలలోని ప్రజాస్వామిక ఆకాంక్షలు అన్ని సందర్భాలలోనూ సమగ్రంగా ఉండవు. ఒక్కొకసారి వాటిలో వైరుధ్యాలుంటాయి. అపోహలుంటాయి. తమకోసం హక్కులు కోరుకుంటూ తమ తోటివారికి నిరాకరించే సందర్భాలు కూడా ఉంటాయి. వివిధ కారణాలవల్ల తామే హక్కుల అతిక్రమణకు సాధనాలుగా పనిచేసే సందర్భాలూ ఉంటాయి. ఈ బలహీనతలను గుర్తిస్తూ, వాటిని అధిగమించడం కోసం తన పద్ధతిలో కృషిచేస్తూ, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఒక సమగ్రత కల్పించే ప్రయత్నంచేస్తూ, వాటి సాధనకోసం కృషిచేయడం హక్కుల ఉద్యమం కార్యరంగం.
వివిధ ప్రజాశ్రేణులు తమ హక్కులకోసం చేసే పోరాటాలతోనూ, సంస్కరణాత్మక కృషితోనూ హక్కుల ఉద్యమానికి సహజంగానే సన్నిహిత సంబంధం ఉంటుంది. ఆ పోరాటాలలోనూ, కృషిలోనూ రాజకీయ పార్టీలు, వాటి ప్రజాసంఘాలు, స్వతంత్రమైన ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ఆయా సమస్యల మీద హక్కుల ఉద్యమం వారితో కలిసి పనిచేయగల మేరకు చేస్తుంది. అయితే తన ప్రత్యేకమైన కర్తవ్యం వెలుగులో వారితో విమర్శనాత్మకంగా కూడా వ్యవహరిస్తుంది. ఏ ఉద్యమమైనా, సంస్థ అయినా ప్రజల హక్కులకూ ప్రజాతంత్ర విలువలకూ భంగకరంగా వ్యవహరిస్తే విమర్శిస్తుంది. తన స్వతంత్ర అవగాహననూ కర్తవ్యాన్నీ కాపాడుకుంటూ ప్రజాతంత్ర ఉద్యమ స్రవంతిలోనూ, ప్రజాస్వామిక కృషిలోనూ ఒక పాయగా పనిచేస్తుంది.
Scroll to Top