About HRF (Telugu)
మానవ హక్కుల వేదిక పరిచయం
మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల గురించి పోరాడటానికి, ఆ హక్కుల ఉల్లంఘనలను ప్రతిఘటించటానికి ఏర్పడింది. ఇటువంటి ఎజెండా వున్న అన్ని హక్కుల సంఘాలతోనూ సారూప్యత ఉన్నమేరకు ఈ వేదిక కలిసి పనిచేస్తుంది. ఆర్ధిక, సాంఘిక, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో హక్కుల ఉద్యమానికి ఒక ప్రత్యేకమైన పాత్ర వుందని, దానిని ఈ ఉద్యమం పోషించాలని వేదిక భావిస్తుంది.
రాష్ట్రంలోని పౌరహక్కుల ఉద్యమం గత రెండున్నర దశాబ్దాలుగా తన ఆచరణలోనూ, అవగాహనలోనూ రాజ్యాన్నీ, రాజ్యహింసనూ కేంద్రబిందువుగా చేసుకుంది. రాజ్యమే అన్నిరకాల అణచివేతలను, అసమానతలను పెంచిపోషిస్తుంది కాబట్టి రాజ్యం చేసే హక్కుల ఉల్లంఘనలపై ఎక్కువ దృష్టిపెట్టాలనే అవగాహనతో పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు పనిచేస్తూ వచ్చాయి.
రాష్ట్రంలో తర్వాత వచ్చిన స్త్రీవాద, దళిత, పర్యావరణ ఉద్యమాల నేపథ్యంలో హక్కుల అవగాహనను విస్తృతపరుచుకునే దిశలో పౌరప్రజాస్వామిక హక్కుల సంఘాలు తమ ప్రణాళికలనూ ఆచరణనూ మార్చుకుని కులం, జండర్, ప్రాంతీయ తత్వం మొదలగు వాటిని కూడా ఆధిపత్య వ్యవస్థలుగా గుర్తించడం మొదలుపెట్టాయి. అయితే ఆచరణలో రాజ్యం, దాని అణచివేత స్వభావం, అది చేసే హక్కుల ఉల్లంఘనలు ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చాయి. మానవ హక్కులకున్న విస్తృత అర్ధంలో ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం జరగవలసి ఉంది. ఇటువంటి ప్రయత్నాలు చేసేందుకే మానవహక్కుల వేదిక ఏర్పడింది.
హక్కుల ఉద్యమ అవగాహనలో రాజ్యాన్ని గురించిన అవగాహన కూడా అంతగా ముందుకు పోలేదు. అణచివేత స్వభావంతో పాటు ప్రజలు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు కూడా రాజ్య నిర్మాణంలో భాగమేనని గుర్తించినా కూడా, అణచివేత స్వభావాన్ని హైలైట్ చేసినంతగా ప్రజల పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలను, చట్టాల్లో వచ్చిన మార్పులను ప్రజలకనుగుణంగా బలోపేతం చేసే దిశలో ప్రయత్నాలు జరగలేదు. దాని వల్ల ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే హక్కుల ఉల్లంఘనల గురించి తగినంత కృషి జరగలేదు. దైనందిన జీవితంలోని హక్కుల విషయంలోనే ఆధునిక రాజ్యం ద్వారా అమలులోకి తేబడిన సార్వజనీన సూత్రాలు, సామాజిక ఆచరణ ఆయా ప్రజలకు అణచివేతను, అసమానతను వ్యతిరేకించటానికి ఉపయోగపడతాయని దళిత, స్త్రీవాద, పర్యావరణ ఉద్యమాలే కాక రెండున్నర దశాబ్దాల పౌర/ప్రజాస్వామిక హక్కుల ఉద్యమం కూడా స్పష్టం చేసింది. పోరాడే హక్కుతో పాటు ప్రజలు తమ దైనందిన జీవితాల్లో హక్కులను అనుభవించే దిశగా మానవహక్కుల ఉద్యమం తన ఆచరణను విస్తృత పరుచుకోవాలి. ఇటువంటి హక్కుల ఉద్యమాన్ని నిర్మించటం మానవహక్కుల వేదిక లక్ష్యం.
రాష్ట్రంలో ఇటువంటి ప్రణాళికతో పనిచేస్తున్న ఆంధప్రదేశ్ పౌరహక్కుల సంఘం వుండగా మానవహక్కుల వేదిక ఏర్పడటం నక్సలైటు పార్టీలు చేసే హింసను ఖండించటానికేనన్న వాదన చాలా బలంగా వినపడుతోంది. నక్సలైటు పార్టీలు చేసే అప్రజాస్వామిక చర్యల గురించి పౌరహక్కుల ఉద్యమంలో జరిగిన చర్చను రాజ్యహింస వర్సస్ నక్సలైట్ హింసగా కుంచించడం వల్ల ఏర్పడ్డ పరిణామమిది. దీనికి మీడియా సహకారం కూడా చాలానే వుంది. నక్సలైట్ పార్టీలు చేసే పనులు ప్రజలకు కొన్నిసార్లు అపకారం కలిగిస్తున్నా వాటిని విమర్శిస్తే రాజ్యయంత్రాంగానికి తోడ్పడిన వాళ్ళమవుతామేమోనన్న భయం చాలా కాలంపాటు పౌరహక్కుల ఉద్యమకారులను వెంటాడింది. అయితే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం ఈ విధంగా వెనకాడటం వల్ల జరిగేది నష్టమేనని ఈ మధ్య కాలంలో స్పష్టమవుతూ వచ్చింది. మానవ హక్కుల వేదిక రాజ్యహింసనూ, నక్సలైట్‌పార్టీలు చేసే అప్రజాస్వామిక చర్యలనూ ఒకే గాటనకట్టి చూడదు. అయితే నిజమైన ప్రజాస్వామ్యం కొరకు పోరాడుతున్నామని చెప్పుకునే ఉద్యమాలేవయినా అప్రజాస్వామికంగా ప్రవర్తించినపుడు మానవ హక్కుల వేదిక వాటిని కచ్చితంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో పౌరహక్కుల ఉద్యమంలో అంతగా ప్రాధాన్యం పొందని కొన్ని విషయాలను తీసుకొని పనిచేయాలని వేదిక నిర్ణయించింది.