స్థానిక ఎన్నికల్లో ఆదివాసీయేతరులకు సీట్ల కేటాయింపు పెసా ఉల్లంఘనే

ఈ నెల  జరగనున్న జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ఎన్నికలలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లోజెడ్‌పి‌టి‌సి స్థానాల్లో 7 స్థానాలను  జనరల్ కేటగిరిగా ప్రకటిoచి మిగిలిన 4స్థానాలనుబి.సి.మహిళలకుకేటాయించారు. ఏజెన్సీలో  ఒక్క జెడ్‌పి‌టి‌సి స్థానం కూడా ఎస్టీలకు  కేటాయించలేదు. అంటే జిల్లా పరిషద్లో  ఏజెన్సీ  నుండి ఆదివాసులకు కనీస రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేశారు.  అలాగే అనంతగిరి మండల ప్రజా పరిషద్ సీటును కూడా ఆదివాసీయేతరులకుకేటాయించారు.  ఇది పెసా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే.

పెసా చట్టంలోని సెక్షన్ 4(జి) ప్రకారం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి. కనీసం సగ భాగం సీట్లు ఆదివాసులకు చెందాలి.  అన్నీ అధ్యక్ష స్థానాల్లో ఆదివాసులే ఉండాలి. ప్రతి పంచాయతీలో ఆదివాసులే సర్పంచ్లు అయితీరాలి.  అలాగే మండల పరిషద్ అధ్యక్షులుగా కూడా ఆదివాసులే ఉండాలి.

విశాఖపట్నంఏజెన్సీ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీయేతరులు భూములు అన్యాక్రాంతం చేసుకుని, వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ స్థిరపడిపోయారు.  ఇది రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, 1/70 చట్టం, పెసా మొదలైన చట్టాల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు.  ఇన్ని దశాబ్దాల నుండి అక్కడ ఉంటున్నాము కాబట్టి తాము అన్యాక్రాంతం చేసుకున్న భూములను తమకు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలనే అన్యాయమైన డిమాండ్ తో వారు ముందుకి వస్తున్నారు. ఏజెన్సీలో ఆదివాసీయేతరులు చట్టాన్ని యదేచ్చగా ఉల్లంఘించి భూములు కబ్జా చేసుకొబట్టే ఆ ప్రాంతంలో వారి జనాభా పెరిగింది.  ఈ పరిణామం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల ఉనికికే ప్రమాదం.  చాప కింద నీరులా సాగుతున్న ఈ చట్ట విరుద్ధ భూ బదలాయింపులు ఏ స్థాయికి చేరుకున్నాయి అంటే ఈ నెల జరిగే జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికల్లో సీట్లను ఏకంగా ఆదివాసీయేతరులకు కేటాయించేసారు. ఈ విధంగా ఆదివాసీయేతరులకు ఎన్నికల్లో సీట్లు కేటాయించడం, భూములు కట్టబెట్టడం వల్ల ఆదివాసులకు వ్యతిరేకంగా అనాదిగా జరుగుతూ వస్తున్న చారిత్రిక తప్పిదాన్నే కొనసాగించినట్లు అవుతుంది.  అంతేకాదు స్థానిక పదవులలో వారికి ప్రాధాన్యత లేకుండాపోతే కనీసం గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా మిగలదు.

ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో తాము అన్యాక్రాంతం చేసుకున్న భూములకు తమ పేరిట పట్టాలు మంజూరు చేయాలనే ఈ అన్యాయమైన డిమాండును మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) వ్యతిరేకిస్తోంది.  అదే విధంగా ఈ నెల  జరిగే జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికల్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీయేతరులకు కేటాయించిన సీట్లను ఆదివాసులకు కేటాయించాలనీ, ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ను రీషెడ్యూల్ చేయాలని  కోరుతోంది. విశాఖ, ఇతర ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు ఆక్రమించుకున్న భూములని తిరిగి ఆదివాసులకు అప్పగించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
14 జనవరి 2020

Related Posts

Scroll to Top