చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ విస్థాపితులకు న్యాయం చెయ్యాలి

చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ విస్తాపితులకు న్యాయం చెయ్యాలి
మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ, 05 ఫిబ్రవరి 2024

చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్న రెండు ఫ్లాట్ ఫారంలకు అదనంగా ఇంకొక నాలుగు ఫ్లాట్ ఫారంలను నిర్మించి చర్లపల్లి రైల్వేస్టేషన్ ను శాటిలైట్ టర్మినల్ గా ఆధునీకరించడానికి 300 కోట్ల బడ్జెట్ తో దక్షిణ మధ్య రైల్వే పనులు ప్రారంభించింది.

 రైల్వే స్టేషన్ విస్తరణ వల్ల ఆ ప్రాంతవాసులకు ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక అయిదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం భరత్ నగర్, మహలక్ష్మి నగర్ ప్రాంతాలలో(4/2/2024 నాడు) పర్యటించి ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించడం జరిగింది.

అసలు వాళ్ళ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎంత వరకు టర్మినల్ నిర్మాణాలు వస్తాయి తదితర వివరాలు అధికార్లు ఎప్పడూ తమకు తెలుపలేదని, స్టేషన్ కు తూర్పు వైపు ఉన్న భరత్ నగర్ కాలనీవాసులు చెప్పారు. కాలనీ పై భాగంలో చాలా గృహాలు కూలగొడతామని అధికారులు అంటున్నారని వారు తీవ్ర  ఆందోళన వెలిబుచ్చారు.

పులుమ బాలనర్సమ్మ, ఇరుసు పద్మకు చెందిన రెండు ఇండ్లను  ఖాళీ చెయ్యాలని చెప్పారని,  ఎక్కడకు పోవాలి, నష్టపరిహారం ఇస్తారా, పునరావాసం ఎట్లా చేస్తారనే విషయం తమకు అధికార్లు చెప్పలేదని బాధితులు తెలిపారు. తాము డబ్బులు పెట్టి నోటరీతో ఇండ్ల స్ధలాలను కొనుగోలు చేసుకొని ఇండ్లు నిర్మించుకోన్నామని చెప్పారు. కానీ ఇప్పుడు రైల్వే అధికారులు ఇది రైల్వే స్థలమని, రైల్వే స్థలంలో ఇండ్లు నిర్మించుకున్నందున నష్టపరిహారం ఇవ్వమని చెపుతున్నారని ఆవేదన  వ్యక్తం చేశారు.

రైల్వే స్టేషన్ కు ఉత్తరాన ఉన్న మహాలక్ష్మీ నగర్  కాలనీ నుండి ప్రధాన  రహదారికి వెళ్ళే రోడ్డును 30 అడుగుల నుండి 80 అడుగులకు పెంచుతున్నారని, దాని కోసం రోడ్డుకు రెండు పక్కల ఉన్న ఇళ్ళు, నివాస స్థలాల  యజమానులకుకు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రాంతంలో కూడా రైల్వే అధికారులు గాని, రెవెన్యూ అధికార్లు గాని తమతో ఏమీ చర్చించలేదని కాలనీ వాసులు తెలిపారు.

 గత 7 సంవత్సరాలుగా స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, తామంతా గత 5 సంవత్సరాల లోనే గృహాలు నిర్మించుకున్నామని, నిర్మాణానికి  అనుమతులిచ్చారని, కరెంట్ సప్లై ఏర్పాటు చేసారని, ఇంటి నంబర్ లు కేటాయించారు అని తెలిపారు.

ఈ రోడ్ వెడల్పు కాబోతుంది కాబట్టి ఇక్కడ నివాస స్థలాలు ఖరీదు చేయకూడదని ఏనాడు అధికారులు తమకు తెలుపలేదని ఆ కాలనీ వాసులు చెప్పారు. వాళ్లంతా గృహ నిర్మాణాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు. వాళ్ళ గృహాల కాగితాలు కూడా ఇంకా బ్యాంకుల్లోనే ఉన్నాయి. మహాలక్ష్మీ నగర్ కాలనీలోంచి స్టేషన్ వెళ్ళే దారి కాకుండా, ప్రధాన రోడ్డు నుంచి నాలుగు రోడ్లు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. మూతపడ్డ పబ్లిక్ రంగ సంస్థ హెచ్.సి.ఎల్ నుండి 100 అడుగుల రోడ్డు, మసీదు దగ్గర నుండి 30 అడుగుల రోడ్డు, శాంతినికేతన్ పాఠశాల ప్రక్కనుండి 40 అడుగులు రోడ్డు, మింట్ పరిశ్రమ నుండి 40 అడుగుల రోడ్లు ఉన్నాయి.

మహాలక్ష్మి నగర్ కాలనీ రోడ్డును విస్తరించే బదులుగా ఆ రోడ్డును స్టేషన్ లోపలికి వెళ్ళడానికి ఉపయోగించుకొని, బయటకు రావడానికి ఈ నాలుగు రోడ్లలో ఒక దానిని కేటాయిస్తే తమ నివాసాలు రక్షింపబడతాయని కాలనీవాసులు అంటున్నారు.

ఇంత భారీ నిర్మాణ పనులు చేపట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసి ఉండే. ఇప్పటికైనా రైల్వేశాఖ  పారదర్శకంగా వ్యవహరించి నిర్మాణ సమాచారం ప్రజలకు వివరించాలని మా సంస్థ డిమాండ్ చేస్తుంది.

మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసుల తో అధికారులు సమావేశం జరిపి వాళ్ళు చేస్తున్న సూచనల గురించి ఆలోచించాలి.
భరత్ నగర్ లో ఇండ్లు కొల్పో తున్న కుటుంబాలకు ఆ ప్రాంతం లోనే గృహాలు నిర్మించి ఇవ్వాలి.

 నిజనిర్ధారణ బృందం సభ్యులు

S. జీవన్ కుమార్, ఉభయ  రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు

పి. శంకర్, సామాజిక కార్యకర్త

టి.రోహిత్, నగర కమిటీ సహాయ కార్యదర్శి

 వెంకట నారాయణ & సురేష్ బాబు, నగర కమిటీ సభ్యులు

Scroll to Top