సమగ్రమైన కరువు సహాయక చట్టం రూపొందించాలి

డిసెంబర్ 2, 2018 న  ముగ్గురు సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక బృందం విజయనగరం జిల్లాలో నెలకున్న కరువు పరిస్థితులను, వాటిపై ప్రభుత్వ స్పందనను పరిశీలించడానికివెళ్ళింది. కొత్తవలస మండలంలోని వీరభద్రపురం, దేవాడ గ్రామాలనూ, ఎల్. కోట మండలం లోని కళ్ళేపల్లి రేగ, భూమిరెడ్డి పాలెం గ్రామాలనూ, జామి మండలం లోని పావాడ, చింతాడ గ్రామాలనూ సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడింది.  తీవ్ర వర్షాభావం వల్ల ఈ గ్రామాలలో పంటలు ఎండిపోవడం గమనించింది. అక్కడ కరువు పరిస్థితులు నెలకున్నాయి.

      జిల్లాలో దాదాపు 26 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా ప్రభుత్వం కేవలం 4 మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయం. కేవలం వర్షపాతాన్నే దీనికి ప్రామాణికంగా తీసుకోకుండా తడుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. ప్రతిసారీ ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగితే తప్ప కరువు ఉందని ప్రకటించకపోవడం మన ప్రభుత్వాలకు పరిపాటి అయ్యింది.

ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా కరువును గుర్తించడానికి ఇప్పటికైనా ఒక శాస్త్రీయ పద్ధతిని అవలంబించి సకాలంలో కరువు చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. దాదాపు అక్టోబర్ నాటికే కరువు పరిస్థితిపై స్పష్టత వచ్చినా ప్రభుత్వం సకాలంలో స్పందించక పోవడం నిర్లక్ష్యం కాక మరేమిటనుకోవాలి? కరువు మండలాలుగా గుర్తించిన చోట్ల సైతం పంట నష్టం జాబితాను ఇంత వరకూ తయారు చేయలేదు. ముఖ్యమంత్రి గారు రోజూ ఊదరగొడుతున్న రియల్ టైమ్ గవర్నన్స్ అంటే ఇదేనా ? 

ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా రైతులకు ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారంగా ఇవ్వాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. పాత బకాయిలతో నిమిత్తం లేకుండా రాబోయే పంట సమయానికి వారికి కొత్త రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం రైతులకు ఇచ్చే నష్టపరిహారం సొమ్మును బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోవడం మానుకోవాలి. అలా చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. నష్టపరిహారంతో సరిపెట్టకుండా వేసవిలో పశుగ్రాసం సరఫరా చేయాలి. ఉపాధి హామీ పధకం పని దినాలను కనీసం 200కి పెంచాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవులలో కూడా అమలు చేయాలి.

చెరువుల పూడికతీత, చెరువు కట్టలు బాగు చేయడం, ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. అంతేకాక స్థానికంగా అవసరమైన దగ్గర మినీ రిజర్వాయర్లు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం పొందవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా రైతులను పట్టి పీడిస్తున్న సమస్య భూ రికార్డుల సమస్య. వాటిని తిరిగి సర్వే చేయకపోతే సగం మందికి కూడా నష్టపరిహారం అందకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతులను గ్రామీణ ప్రాంతాల ప్రజలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు.

సమగ్ర కరువు సహాయక చట్టం రూపొందించాలి

కరువు కాలంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ సహకారాలను హక్కులుగా గుర్తించి, ఒక సమగ్ర ‘కరువు సహాయక చట్టాన్ని’ రూపొందించాలని మానవ హక్కుల వేదిక కోరుతోంది. దాని అమలు కోసం అవసరమైన యంత్రాంగాన్ని  చట్టంలోనే  నిర్దేశించాలని డిమాండ్ చేస్తోంది. ఆ సమగ్ర కరువు సహాయక చట్టంలో కరువు ప్రాంత ప్రజలకు కనీస రక్షణ కల్పించాలి. పని, తాగునీరు, పశు గ్రాసం అనే మూడు విషయాలకు కచ్చితమైన హామీ ఉండాలి. ఏ అధికార్ల బాధ్యత ఏమిటో స్పష్టంగా పేర్కొనాలి. ఆ బాధ్యతలు నిర్వర్తించని అధికార్లపై తీసుకునే చర్యలు కూడా అందులో పొందుపరచాలి.

3 డిసెంబర్  2018                                             కె. సుధ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్

విజయనగరం                                    వి.ఎస్. కృష్ణ, ఆంధ్ర- తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు

మానవ హక్కుల వేదిక

Scroll to Top