అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యువకులపై కాల్పులు అమానుషం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తున్న వారిపై కాల్పులు జరిపి ఇద్దరు యువకుల ప్రాణాలు తీయటాన్ని మానవహక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.

అగ్నిపథ్‌ను నిరసిస్తూ వేలాది మంది ఆర్మీ ఉద్యోగార్థులు 17 జూన్‌ 2022 ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. వారిని అదుపు చేయడంలో భాగంగా రైల్వే, రాష్ట ప్రభుత్వ పోలీసులు అతిగా వ్యవహరించి, కాల్పులు జరిపి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీశారు. పోలీసుల అమానుష చర్యను మానవహక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఆందోళనకారుల పైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయటంతో పాటు, 13 మంది దేహాల్లో బుల్లెట్లు దించటం అనేది అత్యంత అనాగరికం.

మృతుల్లో ఒకరైన దామెర రాకేష్‌ (20) పాత వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని దబ్బెటిపేట గ్రామానికి చెందినవాడు. అతడి మృతదేహాన్ని వరంగల్‌ మీదుగా స్వగ్రామానికి తరలించే క్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర మృతుని తల్లిదండ్రులు, బంధువులు నిరసన లాంటిదేమైనా చేస్తారమోనన్న అనుమానంతో నర్సంపేట పోలీసులు మృతుని తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను వేరువేరు పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అలవాటుగా చేసిన ఈ హీనమైన ముందస్తు నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వారిని విడుదల చేయాలి.

  1. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు, కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు  ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించాలి.
    1. విచక్షణ లేని కాల్పులు జరిపి యువకుల ప్రాణాలు తీసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలి.
    1. రాకేష్‌ తల్లిదండ్రుల, బంధువుల వట్ల అమానవీయంగా వ్యవహరించి అక్రమంగా నిర్బంధించిన నర్సంపేట పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలి.
    1. గత మూడు రోజులుగా దేశంలో, రాష్ట్రంలో లక్షలాది మంది యువకుల జీవితాల్లో మంటలు రేపిన కేంద్ర ప్రభుత్వం తన మతిలేని పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
    1. యువకుల ఆందోళనలను అదుపు చేసే పేరుతో అతిగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలను తీస్తున్న కేంద్రప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలి.

మానవహక్కుల వేదిక
తెలంగాణ
17 జూన్‌ 2022

Related Posts

Scroll to Top