అటవీ హక్కుల చట్టం (Forest Rights Act) ప్రకారం దక్కాల్సిన హక్కులు కొంత మంది ఆదివాసీలకు దక్కబోవని, వారు ఆ హక్కులకు అనర్హులంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మధ్య ప్రకటించాయి. ఇలా అనర్హతకు గురైన ఆదివాసుల సంఖ్య చిన్నదేమీ కాదు. వీరిని అటవీ ప్రాంతాల నుంచి తొలగించాలని నేడు సుప్రీంకోర్టు ఒక నిర్దయాపూరితమైన ఆదేశాన్ని ఇచ్చింది. ఫిబ్రవరి 18, 2019న సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని మానవహక్కుల వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అడవే జీవనాధారంగా బతుకుతూ దారిద్ర్య రేఖకు అట్టడుగున కూడా కనిపించని మన దేశ ఆదివాసుల జీవన హక్కులపై దాడికి దిగడమే తప్ప మరొకటి కాదని భావిస్తోంది. ఈ ఆదేశం గనుక అమలయితే ఆదివాసులూ, ఇతర అటవీవాసులూ గెంటివేతకు గురవుతారు. అలాంటి కుటుంబాల సంఖ్య ఇరవై లక్షల పైనే ఉండవచ్చు!
అలనాటి బ్రిటిష్ వలస ప్రభుత్వమే కాకుండా, స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా ఆదివాసులను అటవీ ఆక్రమణదారులుగా చూసింది. అనేక ఉద్యమాల ఫలితంగా ఈ చారిత్రిక దురన్యాయాన్ని సరిచేస్తూ 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. చట్ట స్ఫూర్తినీ, లక్ష్యాన్నీ ఉపేక్షిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి అహేతుకమైన ఆదేశాన్ని ఇవ్వడం మానవహక్కుల వేదికను కలతకూ, దిగ్భ్రాంతికీ గురిచేస్తోంది. నిజానికి, అటవీ హక్కుల చట్టాన్ని ఇన్నేళ్ళుగా సరిగా అమలు చేయనందుకుగాను సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనూ, కేంద్ర ప్రభుత్వాన్నీ నిలదీసి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. దీనికి బదులు ఆదివాసుల జీవన, సాంస్కృతిక హక్కులను హరించే సరికొత్త ప్రమాదానికి కోర్టు తెరలేపింది. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఆదివాసుల పక్షాన నిలబడకుండా వన్యప్రాణి ఔత్సాహికులూ, అటవీ అధికారులూ, గతకాలపు జమీందార్లూ చేసిన న్యాయబద్ధం కాని, అవాస్తవ ఫిర్యాదులకు కోర్టు ఎందుకు చెవి ఒగ్గిందో ప్రశ్నార్థకమే. కోర్టు ఆదేశం పర్యవసానంగా ప్రాచీన కాలం నుంచీ తాము నివసిస్తున్న నేలమీద నుంచి, రాజ్యాంగ రక్షణ పొందిన ఐదవ షెడ్యూలు ప్రాంతాల నుంచి ఆదివాసులు నేడు గెంటివేతకు గురవుతారు. ఆదివాసుల జీవితాలపట్ల కోర్టుకు ఎటువంటి బాధ్యతా లేనట్లు వారి ఆదేశం కనిపిస్తోంది.
అటవీ హక్కుల చట్టాన్ని సమర్థించే పనికి కేంద్ర ప్రభుత్వం ఏ కోశానా పూనుకోలేదు. పైపెచ్చు ఈ అగౌరవ ప్రక్రియలో భాగస్వామి కూడా అయ్యింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశం ఇస్తున్న రోజు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడం విస్మయం కలిగిస్తోంది. గత ఏడాది కాలంలో జరిగిన మూడు ముఖ్యమైన విచారణలకు ప్రభుత్వం తరపున ఒక్క సీనియర్ న్యాయాధికారి కూడా హాజరు కాలేదు! అటవీ హక్కుల చట్టం స్ఫూర్తికీ, నియమ నిబంధనలకూ విరుద్ధంగా వ్యవహరించి ఆదివాసుల హక్కుల అర్జీలను (claims) వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయన్నది అందరికీ తెలిసిందే. చట్టం అమలులో జరిగిన లోపాల కారణంగా అనేక రాష్ట్రాల్లో ఆదివాసుల అర్జీలు తిరస్కారానికి గురయ్యాయి. ప్రజల హక్కులు గుర్తింపు పొందకుండా ఎప్పటికప్పుడు మోకాలు అడ్డటంలో అటవీ అధికారులు చిరకాలంగా అపఖ్యాతి మూటకట్టుకున్నారు. వీరి ఘనకీర్తి గురించి ఎన్నో అనధికార, అధికార నివేదికలు ప్రస్తావించాయి. ఈ అర్జీల వ్యవహారం అంతా తప్పులతడకగా సాగిందనీ, దాని ఫలితంగానే ఎన్నో అర్జీల తిరస్కరణ జరిగిందంటూ ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ సందర్భంలో అంగీకరించింది కూడా. ఆ అర్జీల పునఃసమీక్ష అవసరం అని కూడా అనింది. అలా అని కూడా, అటవీ హక్కుల చట్టం రాజ్యాంగబద్ధమేనని కోర్టుకు విన్నవించడంలో ఆ శాఖ విఫలమయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రాముఖ్యత కలిగిన పై విషయాలను కోర్టు దృష్టికి తీసుకుపోలేదు కూడా.
అర్జీల తిరస్కరణ ద్వారా ఆదివాసుల తరలింపుకు ప్రభుత్వాలు పూనుకోవడం అటవీ హక్కుల చట్టం ప్రకారం వీలు కానిది. అది చట్ట వ్యతిరేకం కూడా. అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియలో గ్రామసభకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దానికి రాజ్యాంగబద్ధ పాత్ర ఉంది. ‘ఆక్రమణదారులను’ అటవీ ప్రాంతాల నుంచి తొలగించాలన్న అత్యుత్సాహంలో కోర్టు వీటిని విస్మరించింది. ఒక మంచి చట్టంపై పద్ధతి ప్రకారం చావు దెబ్బకొట్టే పరిణామానికి అటవీ హక్కుల చట్టం మీద జరిగిన తాజా దాడి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. విషాదం ఏమిటంటే దేశ అత్యున్నత న్యాయస్థానమే దానిలో భాగం కావడం. అటువంటి తిరోగమన ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి ఇటీవల కాలంలో తరచుగా రావడం మమ్మల్ని ఎంతో వ్యాకులతకు గురిచేస్తోంది. ఎస్.సి, ఎస్.టి (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని బలహీన పరుస్తూ గతేడాది మార్చి10న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్చు అలాంటి తిరోగమన ఆదేశాలలో ఒకటన్నది మరచిపోలేము. ఈ వ్యవహారం చూస్తుంటే తిరిగి తిరిగి మనం బయలుదేరిన చోటకే చేరామన్న భావన కలుగుతోంది. ఈ ప్రభుత్వం, దాని కార్పొరేట్ స్నేహితులూ, అటవీ, వన్యప్రాణి సంరక్షక పదజాలంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న కొన్ని ప్రభుత్వేతర సంస్థలు (NGOs) అటవీ హక్కుల చట్టంలోని సమానత్వ ఆదర్శాన్ని గుర్తించలేక పోతున్నాయి. పదే పదే ఆ చట్టాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తున్నాయి. దానికి తూట్లు పొడిచే చర్యలకు దిగుతున్నాయి. అడవులలో నివసించే ఆదివాసుల మీద అటవీ శాఖ నిత్యం యేవిధంగా హింసకు దిగుతుందో అందరికే తెలిసిందే. ఆ శాఖ చట్టాలనే కాదు, న్యాయస్థానాల ఆదేశాలను సైతం కొన్నిసార్లు నిస్సిగ్గుగా ఉపేక్షించి ఆదివాసులను అటవీ ప్రాంతాల నుంచి తరిమికొట్టిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రతికూల ఆదేశం గనుక అమలయితే అది విలువైన సహజ వనరుల దోపిడీ వేగవంతం కావడానికి తోడ్పడుతుంది. అటవీ విధ్వంసం, జీవవైవిధ్య వినాశనం పెరుగుతాయి. ఆదివాసుల జీవనం, జీవనాధారాలు మరింత ప్రమాదంలో పడతాయి.
నిజానికి అరణ్యాల సంరక్షకులు ఆదివాసులే. వారి జీవితం, వారి సంస్కృతి, వారి వ్యక్తిగత, సామాజిక గౌరవాలు అటవీ సంరక్షణతో విడదీయలేనివి. అడవి లేనిది ఆ సమూహాలే లేవు. అటవీ సంరక్షణ గురించి వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అటవీ హక్కుల కోసం పెట్టుకున్న అర్జీల ఆమోదంలో అన్యాయం జరుగుతుందని గుర్తించి ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయించుకునేందుకు ఆదివాసీ సంఘాలు ప్రయత్నిస్తున్న సమయంలో ఇటువంటి అన్యాయమైన ఆదేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది.
అటవీ హక్కుల చట్టం మీద జరుగుతున్న ఈ దాడిని వ్యతిరేకించవలసిందిగా ప్రజాస్వామిక శక్తులకు మానవహక్కుల వేదిక విజ్ఞప్తి చేస్తోంది. అటవీశాఖ అధికారులు కోర్టు ఆదేశానుసారం ఆదివాసులను అడవులనుంచి గెంటి వేయకుండా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలను వెంటనే తీసుకోవాలని కోరుతోంది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం జరగబోయే తొలగింపులను నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తాత్సారం చేయకుండా ఒక ఆర్డినెన్సును తీసుకురావాలని డిమాండు చేస్తోంది.
మానవహక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
24 ఫిబ్రవరి 2019