అన్నిటికీ రేషన్ కార్డు అడిగితే ఎలా? – వి. బాలరాజ్‌ (ఆంధ్రజ్యోతి, 20.06.2024)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అసలు రేషన్‌ కార్డుల జారీ జరగనే లేదు. గతంలో ఇవ్వబడిన కార్డుకు ఒక చిన్న పేపర్‌ అంటించి ఒక ఆన్‌లైన్ టాగ్‌ తొడిగారు. కుటుంబ సభ్యుల్లో చౌకధరల దుకాణం వద్దకు ఎవరు వెళ్లినా ఆధార్‌ నంబర్‌ చెబితే రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తెచ్చుకునే వెసులుబాటుని ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని రేషన్‌ కార్డులు ఇవ్వాలనుకుంటుంది. ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఈ ప్రక్రియలో లబ్ధిదారుల అర్హతానర్హతల గురించి కూలంకషంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతనే రేషన్ కార్డులు జారీ చేయాలి. ఆర్థికపరమైన నియమ నిబంధనలను, సామాజిక ఆర్థిక స్థితిగతులను, వాస్తవంగా నివసిస్తున్న ప్రాంతాన్ని, వారి సంవత్సర ఆదాయాన్నీ… వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. సంవత్సరాదాయాన్ని మూడు లక్షల వరకు పరిమితిని విధించి తెలంగాణలో ఆదివాసీలు, దళితులు, అత్యంత వెనుకబడిన కులాలు, మైనారిటీలకు తప్పనిసరిగా ఇవ్వాలి.

గత ప్రభుత్వం పదేళ్ళల్లో ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వకపోగా ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేసింది. బోగస్‌ కార్డుల ఏరివేత లేదా వీడ్‌ అవుట్‌ పేరిట చాలా కార్డులను తొలగించింది. వాటి స్థానంలోకి ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామంటూ మాట ఇచ్చి ఉన్నందున ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దరఖాస్తులను ఆహ్వానించింది. అందులో ఎక్కువ శాతం రేషన్‌ కార్డులు ఉన్నాయి. అంటే ఇంకా చాలామంది కొత్త రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని రుజువయింది. కానీ, ఆరు గ్యారంటీల దరఖాస్తుకు తెల్లకార్డు అర్హతగా ఉన్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారికి కొత్త కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారంటీల అమలు కోసం రేషన్‌ కార్డు జత చేయాలి అనటం ఎలా సమంజసం? అర్హులకు కార్డు ఇచ్చాక ఆరు గ్యారంటీల హామీ అమలుకు రేషన్ కార్డ్ లింకు పెడితే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాను కోల్పోకుండా ఉంటారు.

ఆంధ్రజ్యోతి
20.06.2024

Related Posts

Scroll to Top