అన్ని పార్టీలలోను ఉన్న దళిత వ్యతిరేకులే ఈ దాడులకు కారణం

అమలాపురంలో 24-05-2022 న జరిగిన విధ్వంసం పూర్తిగా కుల విద్వేషాల వల్లనే జరిగిందని మానవహక్కుల వేదిక అభిప్రాయపడుతోంది. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం ఇప్పటివరకు సాగుతోన్న తమ పెత్తనానికి దెబ్బ తగిలినట్లుగా భావించి ఆధిపత్య (OC), వెనుకబడిన (BC) కులాలకు చెందిన అల్లరి మూకలు ఈ దాడులకు పాల్పడ్డాయి. దళితులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి తమ డిమాండ్‌ను సాధించుకోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఈ దాడులలో ప్రధానంగా పాల్గొన్నది కాపు, శెట్టిబలిజ కులాలకి చెందిన వారే. అన్ని పార్టీలకు చెందిన వారందరికీ ఉమ్మడిగా ఉన్నది మాత్రం దళితులపై ద్వేషమే.

దళితులకు వ్యతిరేకంగా దళితేతర శూద్ర కులాలను ఏకం చేయడంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. ఆయా సంస్థలకు చెందిన అగ్రకుల నాయకులు తెర వెనుక ఉండి నడిపించారు.

ఇది వాళ్ళు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న నమూనాయే. కులాల మధ్య ఉన్న విద్వేషాలని రెచ్చకొట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అన్ని పార్టీలకు అలవాటైనదే. గతంలో మన రాష్ట్రంలో దళితుల పైన అనేక దాడులు జరిగాయి. ఇప్పటి దాడులు కూడా అదే కోవకి చెందినవి. ఆధిపత్య కులాల వారు ఎటువంటి దాడులకి పాల్పడినా రాజకీయ కారణాలతో ఆయా కేసులని నిర్వీర్యం చెయ్యడం లేదా ప్రభుత్వమే మొత్తానికి ఎత్తేయడం గతంలో అనేక సార్లు జరిగింది. ఈ ధోరణి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తోంది. దానితో సహజంగానే ఇటువంటి దారుణాలు పునరావృతమవుతున్నాయి.

ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న ప్రధాన నాయకులందరూ తమ కుల బలం ద్వారానే ఎదిగారు. జిల్లాను అంబేద్కర్‌ జిల్లాగా మార్చాలని మొదట్లో డిమాండ్‌ వచ్చినప్పుడు దానికి మద్దతు తెలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పుడు మాత్రం జరిగిన దాడులను ఖండించి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని స్పష్టంగా చెప్పడం లేదు. అలాగే జిల్లా పేరు మార్చడం వెనుక YSR కాంగ్రెస్‌ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలు ఉన్నాయనే అంశం కాదనలేనిది. ఈ మొత్తం ఘటన వలన దళితులను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తాయనే విషయం తేటతెల్లమైంది.

సాధారణంగా ఎటువంటి ప్రగతిశీల ప్రజాస్వామిక నిరసననైనా ముందస్తు అరెస్టులతో అణిచివేసే పోలీసు వ్యవస్థ ఈ ఘటనను నివారించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యింది. మంత్రి విశ్వరూప్‌, శాసనసభ్యులు పొన్నాడ సతీష్‌ కుమార్‌ అణగారిన కులాలకు చెందిన వారు కావడం వల్లనే ఒక పధకం ప్రకారం అల్లరి మూకలు వారి ఇళ్ళపై దాడులకు పాల్చడ్డాయి. అదే పార్టీకి చెందిన ఆధిపత్య కులాల నాయకుల జోలికి విధ్వంసకారులు వెళ్లకపోవడం ఈ దాడుల వెనుక ఉన్న కుల విద్వేషాలను బట్టబయలు చేస్తుంది.

ఈ దారుణకాండకు కారణమైన వారందరిపైన కేసులు నమోదు చేసి సమగ్రమైన విచారణ జరిపించి, నిందితులకి శిక్ష విధించాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది. నాగరికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా సాటి మనుషులపై విద్వేషాలను ఈ స్థాయిలో ఇంత సులభంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉండడం సమాజంలో ఎవ్వరికీ మంచిది కాదు. ఈ విద్వేష మూలాలను తొలగించి, చట్టబద్ధ పాలన కొనసాగే దిశగా రాజకీయ పార్టీలు ఎలాగూ పనిచేయవు. ప్రజాస్వామిక వాదులు, ఆలోచనాపరులు ఈ దిశగా చేయాల్సిన కృషిని ఈ సంఘటనలు మరోసారి ఎత్తిచూపుతున్నాయి.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
26 మే 2022

Related Posts

Scroll to Top