అమరావతి భూలావాదేవీల ప్రచురణను ఆపిన హైకోర్టు ఉత్తర్వులు అభ్యంతరకరం

మాజీ అడ్వకేట్‌ జనరల్‌నూ, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బంధువులనూ ముద్దాయిలుగా చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఇటీవల దాఖలు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ లోని వివరాలను ప్రచురించటానికి వీలు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సెప్టెంబర్‌ 15, 2020 నాడు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పై మానవహక్కుల వేదిక (HRF) తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నది.

కైమ్‌ నంబర్‌ 08/RCO-ACB-GNT/2020 కి సంబంధించి దాఖలు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ లోని వివరాలు ప్రింట్‌ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్‌ మీడియాలో కానీ ప్రచురించడానికి వీలు లేదని ఆంధ్రప్రదేళ్‌ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులలో పేర్కొన్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన ఉత్తర్వు. ఇది మీడియా నోరు పూర్తిగా నొక్కెయ్యడమే కాకుండా ప్రజా వ్యవస్థలకి సంబంధించిన సమాచారం ప్రజలు తెలుసుకునే హక్కుని కాలరాయటమే అవుతుంది. సమాచార హక్కు మీడియా స్వేచ్ఛకి, భావ ప్రకటనా హక్కు ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటివి. హైకోర్టు ఉత్తర్వు అటువంటి హక్కులని కాలరాయటమే కాకుండా ప్రాధమిక హక్కులైన మీడియా స్వేచ్ఛకి, భావ ప్రకటనా స్వేచ్ఛకి నష్టం చేస్తున్నది.

న్యాయమైన విచారణకి భంగం కలుగుతున్నదని భావించినపుడో లేదా న్యాయ ప్రక్రియకి ఆటంకం కలుగుతుందని భావించినపుడో మాత్రమే సుప్రీంకోర్టు గతంలో ప్రచురణని అడ్డుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇటువంటి ఉత్తర్వులు చాలా వరకు తాత్కలికమైనవి. సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ వర్సెస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న్యాయ ప్రక్రియకి ఆటంకం కలగవచ్చునన్న ఉద్దేశంతో ఒక ప్రచురణను వాయిదా వేయమని ఆదేశించింది. ఏదైనా సందర్భంలో తాత్కలికంగా వాయిదా వేయటానికి అనుగుణమైన పరిస్థితి ఉన్నప్పుడు, అలాగే ఆ నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 19(2)లో నిర్దేశించిన పరిమితులకి లోబడి ఉందని అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి వాయిదా నిర్ణయం ఇవ్వవచ్చునని పైన పేర్కొన్న  ఆదేశంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిలయన్స్‌ పెట్రోకెమికల్స్‌ వర్సెస్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, నరేష్‌ మిర్జాకర్ వర్సెస్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర  కేసులలో కూడా న్యాయ ప్రక్రియకి ఆటంకం కలుగుతుందని అనుకున్నప్పుడే సుప్రీంకోర్టు ప్రచురణ ఆపమని ఆదేశాలు ఇచ్చింది. 

అయితే ప్రస్తుత కేసులో అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి కేసు విషయాలు ప్రచురించటానికి వీలు లేదని ఆదేశం ఇవ్వటం అసాధారణమైన విషయం. ఈ కేసు గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలో అంతర్గత సమాచారాన్ని వాడుకుని కొంతమంది భూములు కొని లాభాలు గడించారన్న అభియోగానికి సంబంధించినది. ఇది అవినీతికి సంబంధించిన అభియోగం అవుతుంది. అంతేకాకుండా అత్యున్నత స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని ప్రైవేటు పార్టీలు లాభపడటానికి దోహదపడ్డారని వారి మీదున్న అభియోగం. ఈ విషయాలు ప్రజలకి, ప్రజా వ్యవస్థలకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు. మీడియాలో దీనికి సంబంధించిన కవరేజి రావడం చాలా అవసరం. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ తనని రాజకీయ కక్షలకు బలి చేస్తున్నారని చేస్తున్న వాదన తప్ప ఈ విషయంలో ప్రచురణని ఆపటానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి ఏ మాధ్యమం ద్వారానైనా ఈ అంశాన్ని ప్రచురించకూడదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుకి ఎటువంటి న్యాయపునాదీ లేదు. ఈ ఉత్తర్వునిచ్చి హైకోర్టు తన పరిధిని దాటిందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది పూర్తిగా అనవసరమైన ఉత్తర్వు. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు తన ఉత్తర్వుని వెనక్కి తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము.

హైకోర్టు  ఉత్తర్వుని విమర్శించడానికి పాలక పార్టీ వారు మీడియా స్వేచ్ఛ గురించి గొప్పగా మాటలు వల్లిస్తున్నారు. ఇది వాళ్ళ రెండు నాల్కల  ధోరణికి పరాకాష్ట తప్ప ఇంకేమీ కాదు. గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో ఇదే పాలక పార్టీ జి.ఓ. 2430ను జారీ చేసిన విషయం వారికి మేము గుర్తుచెయ్యదలుచుకున్నాము. మీడియా స్వేచ్ఛని తుంగలో తొక్కటానికి ఈ జి.ఓ. అవసరమైన సరంజామానంతా అందించింది. అధికారపక్షం కథనాలని వాస్తవాలుగా ప్రచారం చెయ్యని మీడియాని వేధించటానికే ఈ జి.ఓ జారీ చేశారు. ఈ జి.ఓ మీద తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ నేటికి కూడా దానిని ఇంకా వెనక్కి తీసుకోలేదు.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
18 సెప్టెంబర్‌ 2020

Related Posts

Scroll to Top