అవినీతి అక్రమాలతో నిండిన మునుగోడు ఉప ఎన్నికలు

మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించేందుకు మానవహక్కుల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదికల బృందం 15 అక్టోబర్‌ 2022న చౌటుప్పల్‌, సంస్థాన్ నారాయణపూర్‌, చండూర్‌, మునుగోడు మండలాలలో తొమ్మిది గ్రామాలు పర్యటించి ప్రజలను, రాజకీయ పార్టీల కార్యకర్తలను కలిసి విషయ సేకరణ చేసింది.

ఏ రాజకీయ పక్షమూ తమ సమస్యల గురించి గాని, తమ ఆకాంక్షల గురించి గాని అడగడం లేదని మేము సందర్శించిన అన్ని గ్రామాల ప్రజలూ చెప్పారు. రెండు రాజకీయ పార్టీలూ తమ సమావేశాలకు హాజరైన ప్రజలకు డబ్బులు పంచి పెడుతున్న దృశ్యాలు బృందం కళ్లబడ్డాయి. ఏ పార్టీ ఓటుకు ఎంత ఇస్తుంది, ఎవరు ఎక్కువ మొత్తంలో ఇస్తారు అన్న విషయంపైనే ప్రజలలో చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా మీకు ఎంత కావాలని నేరుగా ఓటర్లను అడుగుతున్నట్లు మాకు కొన్ని గ్రామాల్లోని ప్రజలు చెప్పారు.

అకారణంగా, ముందస్తుగా ఒక శాసనసభ్యుడు రాజీనామా చేసి, ఉపఎన్నిక వచ్చే పరిస్థితిని కల్పించి ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టించినట్లుగా మాకు అనిపించింది. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చాలా పెద్ద సంఖ్యలో వాళ్ల పార్టీ కార్యకర్తలను, నాయకులను, మునుగోడు, చండూరు పట్టణాలలో దింపి భారీ స్థాయిలో ప్రచార కార్యాలయాలు ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.

ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి రాజ్యాంగపరమైన ఎన్నికల కమిషన్‌ ఉంది. ఎన్నికల కమిషన్‌ తన విధులలో భాగంగా ఎన్నికల ప్రక్రియ నియమానుసారంగా నడుస్తుందో లేదో చూడాలి. ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ మాకు ఎన్నికల కమిషన్‌ అక్కడ పని చేస్తున్నట్లుగానే కనిపించలేదు. ‘స్వేచ్చగా ఓటు వేయమని, ఓటు వేయడం నీ బాధ్యత’ అని బ్యానర్లు తప్ప ఇంకేమీ కనపడలేదు. వందల కొద్దీ కార్లు, ఖరీదైన వాహనాలు గ్రామాలలో తిరుగుతూ, హడావుడి సృష్టిస్తూ వుంటే ప్రజలు భయభ్రాంతులతో వీక్షిస్తున్నారు.

మేము కలిసిన గ్రామాలలో ప్రజలు తాగునీటి సమస్య గురించి, రోడ్ల అధ్వాన్న పరిస్థితుల గురించి, చదువుకున్న పిల్లల  ఉద్యోగాల కల్పన గురించి, జీవనోపాధి గురించి మాట్లాడారు. చౌటుప్పల్‌ లేబర్‌ అడ్డాలో పని కోసం కూర్చున్న 300 మంది కూలీలు సాయంత్రం వరకు కూర్చున్నా 100 మందికి కూడా పని దొరకడం లేదని ఆందోళన చెందుతూ చెప్పారు. కొత్తగా ఏర్పాటు అయిన తంగేడిపల్లి మున్సిపాలిటీలో అధికారులు గృహ నిర్మాణాల కోసం విపరీతంగా లంచాలు అడుగుతున్నారని ప్రజలు చెప్పారు. ఆ మున్సిపాలిటీలో సరైన రోడ్ల వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, పేదలకు గృహాలు లేవని బృందం గమనించింది. విచిత్రం ఏమిటంటే ఈ సమస్యల మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ హామీలు ఇవ్వడం గానీ వాళ్ల మ్యానిఫెస్టోలలో రాయడం గానీ చేయలేదు. ఇది అత్యంత విచారకరం.

ఎన్నికల కమిషన్‌ దృష్టికి ఈ క్రింది విషయాలను మేము తీసుకొస్తున్నాము:

  1. నియోజకవర్గానికి చెందని రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు కాబట్టి వారిపై నిఘా ఏర్పాటు చేయాలి.
  2. పరిమితికి మించి ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలను నియంత్రించాలి.
  3. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలి.

ఎన్నికల్లో పాల్గొంటున్న రాజకీయ పార్టీలు నిరంతరం ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురి చేయాలని కాకుండా స్థానిక సమస్యల మీద దృష్టిని సారించాలి.

మానవ హక్కుల వేదిక, తెలంగాణ
తెలంగాణ విద్యావంతుల వేదిక
15 అక్టోబర్‌ 2022

Related Posts

Scroll to Top