ఆంధ్రా యూనివర్సిటీ వీసీ నోట అజ్ఞాన వీచికలు!

ఇటీవల జలంధర్‌ పట్టణంలో జరిగిన భారతీయ సైన్స్‌ కాంగ్రెస్ అసోసియేషన్‌ (ISCA) 106వ సభలలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేసిన శాస్త్ర విరుద్ధ ప్రకటనలను మానవహక్కుల వేదిక తీవ్రంగా గర్హిస్తోంది. విజ్ఞాన వీచికలు విరాజిల్లే ప్రతిష్టాకరమైన యూనివర్శిటీకి వీసీనన్న విషయాన్ని మరచిపోయిన ఆయన మూలకణాలపై (stem cells) జరిగిన పరిశోధనల, టెస్ట్‌ట్యూబ్‌ ఫలదీకరణ పద్ధతుల ఫలితంగానే కౌరవులు జన్మించారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగక రావణునికి 24 రకాల విమానాలు ఉండేవనీ, శ్రీలంకలో ఆనాడు విమానాశ్రయాలు ఉండేవనీ కూడా చెప్పుకొచ్చారు.

శాస్త్రజ్ఞానం విస్తుబోయే ఇటువంటి ప్రకటనలు ఎంత మాత్రం సమర్థనీయం కావు. పైపెచ్చు జ్ఞానం పేరుతో చెలామణీ కాజూసే బూటకపు సైన్సును (pseudo-science) సమర్థించేవి. ఈ అభిప్రాయాలకు సైన్సులో ఎటువంటి ఆధారమూ లేకపోవడమే కాదు అవి శాస్త్రజ్ఞానం ముందు నిలిచేవి కూడా కావు. శాస్త్ర పరిశోధనా పద్ధతులకూ, ఆలోచనలకు ఎంత మాత్రమూ పొసగని ఈ భావాలు శాస్త్రీయ దృక్పథానికి హాని కలిగిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తిరోగమన భావాలు సైన్సును కించపరిచేవి. వీసీ చేసిన అర్థరహిత ఉపన్యాసం శాస్త్ర పటిమను దెబ్బతీసేదన్న పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయంతో మానవహక్కుల వేదిక ఏకీభవిస్తోంది.

సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు పుక్కిటి పురాణాలను పంచుకొనే సాదాసీదా సభలు కావు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల నుంచి విలువైన శాస్త్ర పరిశోధనా జ్ఞానాన్ని గ్రహించేందుకు వాటికి ఎంతోమంది యువ శాస్త్రవేత్తలు హాజరవుతారు. తాను చేసే వ్యాఖ్యలు ఆ భావితరానికి ఏ సందేశాన్ని ఇస్తాయో తెలియని స్థితిలో వీసీ ఉండటం విచారకరం.

ఇతిహాసాలలోని విషయాలే సత్యాలని నమ్మజూపే అజ్ఞానాంధకారంలో వీసీ నిండామునిగినట్టు అర్ధమవుతోంది. ఆయన సైన్సు కాంగ్రెసులో వ్యక్తపరచిన నిరర్ధక అభిప్రాయాలను తేలిగ్గా తీసుకోకూడదు. అవి అటు యూనివర్సిటీ ప్రతిష్టను మసక బార్చడమే కాక సమాజంలో శాస్త్ర ప్రగతికి చేటు చేస్తాయి. ప్రజల్లో అంధ విశ్వాసాలను మరింతగా పెంచుతాయి.

ఇటువంటి అభిప్రాయాల వ్యక్తీకరించడంలో దేశంలో ప్రతిష్టాకరమైన పదవుల్లో ఉండినవారి సరసనే నాగేశ్వరరావు చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి ప్రకటనే చేసారు. ప్లాస్టిక్ సర్జరీ, అవయవ మార్పిడి ప్రాచీన భారతంలో ఉండేవని చెప్పడానికి తహతహలాడుతూ వినాయకుడిని దానికి ఆధారంగా చూపారు. ఆ తరువాత జరిగిన పలు సైన్సు కాంగ్రెస్ సమావేశాల్లో కొందరు శాస్త్రవేత్తలు ఇటువంటి అసాధారణ, అశాస్త్రీయ వ్యాఖ్యానాలనే చేశారు. దేశంలో అత్యుత్తమ శాస్త్రవేత్తల ప్రగతిశీల, శాస్త్రీయ ఆలోచనల కలబోతకు వేదికగా నిలవవలసిన సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌ సమావేశాలు అజ్ఞాన, అశాస్త్రీయ ఆలోచనలకు వేదికగా మారటం ఎంతో దురదృష్టకరం.

ఇటువంటి అశాస్త్రీయ భావాలను నిరసించాలనీ, తిరస్కరించాలనీ ప్రజలను మానవహక్కుల వేదిక కోరుతోంది. సమాజంలో శాస్త్రీయ దృక్పథం పాదుకోవడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని అధ్యాపకులకూ, చదువరులకూ గుర్తుచేస్తోంది.

మానవహక్కుల  వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
8 జనవరి 2019

Related Posts

Scroll to Top