ఆదోని డివిజన్‌ను జిల్లాగా మార్చండి

జిల్లా కలెక్టర్‌ గారికి
కర్నూలు.
అయ్యా!
విషయం: అన్ని అర్హతలున్న ఆదోని డివిజన్‌ను జిల్లాగా చేయమని కోరడం గురించి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక ఎన్నికల ముందు అదనంగా 13 జిల్లాల ఏర్పాటు గురించి ప్రతిపాదన చేసింది. ‘జనగణన పూర్తి అయ్యే వరకు జిల్లాల సరిహద్దులను మార్చడానికి వీలులేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పినా మన రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ నాటికి ఒక్కొక్క పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎంతవరకు శాప్రీయమని మేం అడుగుతున్నాం? మన రాష్ట్రం కూడ తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా ఒక్కొక్క జిల్లాను జనాభా, భౌగోళిక పరిస్థితి, వైశాల్యం పరిగణనలోకి తీసుకొని ప్రతి జిల్లాను మూడు జిల్లాలుగా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని మేం భావిస్తున్నాం.

ప్రభుత్వం జిల్లాలను పెంచడం వల్ల ‘అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజల వద్దకు పాలన చేరువ అవుతుందని మేం నమ్ముతున్నాం. అయితే ప్రభుత్వం ప్రజలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపకుండానే హడావిడిగా నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ప్రజలు అనేక ఇబ్బందులకు, అసౌకర్యాలకు గురికావలసి వస్తుండడం వల్ల ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఆదోని డివిజన్‌లోని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం గాని, ఇతర అవసరాల కోసం గాని నిత్యం జిల్లా కేంద్రమైన కర్నూలుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆదోని డివిజన్‌లోని ఆలూరు, హెళగుంద, కౌతాళం మండల కేంద్రాల నుండి కర్నూలు వెళ్ళడానికి ప్రజలు రెండు మూడు బస్సులను మారవలసి ఉంటుంది. వారికి కర్నూలు జిల్లా కేంద్రం 100 – 150కి. మీ దూరంలో వుంది. ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఎంతో వ్యయ ప్రయాసలతోపాటు, మూడు, నాలుగు గంటల ప్రయాణం చేయవలసి వస్తోందనే విషయం ప్రభుత్వం గుర్తించాలి.

కర్నూలు జిల్లా కేంద్రానికి తూర్పున ఉన్న నంద్యాల ప్రాంతంతో పోల్పుకున్నపుడు, పడమట దిశలో మారుమూలన ఉన్న ఆదోని ప్రాంతం అన్ని విధాలుగా వెనుకబడిన ప్రాంతం అన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే ఆదోని డివిజన్‌ను జిల్లా చేయమని ఇక్కడి ప్రజలు పోరాడాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం పూర్తిగా వర్షాధార ప్రాంతం కావడంతో వేల ఎకరాల్లో పంటలు సరిగా పండక గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం సుగ్గికి (వలస) వెళ్ళవలసిన దుస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ 4 TMC ల నికర జలాలను కేటాయించినా RDS (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కుడి కాలువ నిర్మాణం ఇప్పటికీ జరగక పోవడం వల్ల, దశాబ్దాలు గడిచినా ప్రభుత్వాలు దానికి నిధులు కేటాయించక పోవడం వల్ల 40,000 ఎకరాలు సాగునీటికి నోచుకోక రైతులు వలసలు పోతున్నారు. తాగునీటికి సైతం ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి వుంది. రైతులు తమ పశువులకు గడ్డి సైతం దొరకక జీవాలను (ఎద్దులు, ఎనుములను) కబేళాలకు అమ్ముకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది.

ఆదోని డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల కొరకు చాలా కాలంగా ప్రతిపాదన ఉన్నా రాజకీయ ఒత్తిడి కొరవడినందు వలన అది అమలుకు నోచుకోవడం లేదన్నది వాస్తవం. అందువల్ల ఇక్కడ ప్రైవేటు నర్సింగ్‌ హోంలకు గిరాకీ బాగా ఉంటోంది. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సైతం లేదు. దాని వల్ల పట్టణ, గ్రామీణ సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. లేదా ప్రైవేటు విద్యా సంస్థలను ఆశ్రయించవలసి వస్తోంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రైవేట్‌ ఆర్ట్స్‌ &సైన్స్‌ డిగ్రీ ఎయిడెడ్‌ కాలేజీలో ఎయిడెడ్‌ పోస్టులను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. దీని వల్ల విద్యార్థులందరు ప్రైవేటు కాలేజీలలో చదువు ‘కొనవలసిన’ పరిస్థితి నెలకొంది. చదువును కొనలేనివారు మానుకోవలసిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రజలకు విద్య, వైద్యం సక్రమంగా అందకుండా పోతోంది.

ఈ పరిస్థితుల రీత్యా ఆదోనిని జిల్లాగా చేస్తే ప్రజలకు కలెక్టర్‌తోపాటు అన్ని శాఖల అధికారులు, అందుబాటులో వుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తెచ్చే అవకాశం ఏర్పడుతుందని మేం భావిస్తున్నాం.

కావున తమరు ఇక్కడి ప్రజలతో సంప్రదింపులు జరిపి, అన్ని అర్హతలు ఉన్న ఆదోని డివిజన్‌ను జిల్లాగా చేయమనీ, మా విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి అందుకు పూర్తిగా సహకరించగలరనీ ఆశిస్తున్నాం.

అదోని జిల్లా సాధన సమితి, కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక
రాయలసీమ కోఆర్టినేషన్‌ కమిటీ, మానవహక్కుల వేదిక
21 ఫిబ్రవరి 2022

* జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టరుకు సమర్పించిన వినతి పత్రం

Scroll to Top