ఉపాధి పనికి పట్టిన గ్రహణం వీడేనా? – కె. అనురాధ (ఆంధ్రజ్యోతి దినపత్రిక; 29.08.2023)

పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మిపురం మండలంలో బాలేసు అనే ఆదివాసీ గ్రామంలో 29 ఏళ్ల కొలక రంగారావు ఉపాధి పని కోసం రోజూ ఎదురు చూస్తున్నాడు. ఏ రోజూ మస్తరులో పేరు రావడం లేదు. చివరికి అధికార్లను ఆరా తీస్తే “నువ్వు చనిపోయావని నీ పేరును తొలగించారు” అని చెప్పారు. బ్రతికున్న రంగారావు హతాశుడై, దిక్కు తోచకుండా వున్నాడు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 లో వచ్చిన ఒక అత్యంత ముఖ్యమైన,  ప్రజాఉపయోగకరమైన చట్టం. గ్రామీణ ఉపాధి ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసి, పేదరిక  నిర్మూలన దిశగా ఈ చట్టం గ్రామీణ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఆదివాసులకు  భద్రతా వలయంగా నిలిచింది. పరిమితంగా అయినామొదటి సారి ‘పని హక్కు’ ఒక హక్కుగా గుర్తింప బడింది. ఈ చట్టాన్ని అనుసరించే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. చాలా ప్రత్యేకతలతో కూడిన ఈ పథకం గ్రామీణ పేదలకు ఎంతో ఆసరాను కల్పించింది. సంవత్సరంలో కనీసం 100 రోజుల పనికి గ్యారంటీ ఇచ్చింది. పనిలో మూడవ వంతు మహిళలు ఉండాలనే నియమం ఉంది. దీని ఫలితాలను వివిధ సామాజిక సూచికలు స్పష్టం చేశాయి. కూలీ రేట్ల పెరుగుదల, ఆహార భద్రత వాటిలో ముఖ్యమైనవి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ పధకం నుండి చాలా దేశాలు స్ఫూర్తిని పొంది అనుసరించాయి.

కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జబ్బు చేసింది. కేంద్రంలో  బి జే పీ ప్రభుత్వం వచ్చినప్పటినుండీ ఈ పథకానికి ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ఇదొక విఫలమైన పథకానికి నమూనాగా నిలుస్తుందని స్వయానా మోడీ గారే ప్రకటించారు. అక్కడనుండి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం మొదలైంది. ఏటా బడ్జెట్లో కోతల తో పాటు పని గంటల తగ్గింపు, తలసరి వేతనంలో తగ్గుదల లాంటివి జరుగుతున్నాయి. అది చాలదన్నట్లు ఇప్పుడు పెద్దెత్తున కూలీల తొలగింపు కార్యక్రమం మొదలైంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రం లోనే 2022-23 సంవత్సరంలో 77.9 లక్షల మంది కూలీలను తొలగించారు. మొత్తం రిజిష్టర్ చేసుకున్న 1.33 కోట్ల మందిలో నికరంగా 59.6% మంది కూలీల పేర్లు తొలగించారు. అంటే సగం కంటే ఎక్కువ మంది పనిని కోల్పోయారు. ఈ పరిస్థితి దేశమంతటా వుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దేసవ్యాప్తంగా తొలగింపుల శాతం 247% పెరిగిందని స్వయానా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ లోక్ సభలో ఒప్పుకున్నారు. ఇది గ్రామీణ, ఆదివాసీ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపగలదు. నిరుద్యోగం, పేదరికం, వలసలు పెరిగి ఆర్థిక స్వావలంబన, ఆహార భద్రతకు తీరని నష్టం చేయగలదు.

క్షేత్రస్థాయి పరిశీలన

మానవ హక్కుల వేదిక, లిబ్ టెక్ సంస్థల కార్యకర్తలు పార్వతీపురం మన్యం జిల్లాలో చింతలపాడు, బాలేసు (గుమ్మలక్ష్మిపురం మండలం), దుర్బిలి (కురుపాం మండలం) ఆదివాసీ గ్రామాలలో పర్యటిస్తే ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మూడు గ్రామాలలో తొలగించబడ్డ 30 మంది కూలీలను కలిస్తే వారిలో సహేతుకంగా తొలగించడానికి అర్హులైన వారు ఐదుగురే ఉన్నారు. మిగతా 25 మందివీ తప్పుడు తొలగింపులే. వీరిలో రంగారావు ఒకడు. మిగతా వారిని ‘పని చేయడానికి ఇష్టం లేదు’ అనే కారణంగా తొలగించారు. నిజానికి వారందరూ రోజూ పని కోసం ఎదురు చూస్తున్న వారే. ఇంకా విచిత్రం ఏమిటంటే వారిలో కొంతమంది పేర్లు మస్తరులో కనపడుతున్నాయి గనుక పనిలోకి కూడా వెళ్తున్నారు. వారు పని చేసి కూడా కూలి డబ్బులు పోగొట్టుకున్నట్లే. తొలగించబడ్డ వారి జాబితా ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద లేకపోవడం విశేషం.

తొలగింపుకు కారణాలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన చెల్లింపుల పద్ధతి వల్లే ఈ భారీ స్థాయి తొలగింపులు జరిగాయని లిబ్ టెక్ సంస్థ చేసిన పరిశీలనలో తేలింది. ఇన్నాళ్లూ వేతన చెల్లింపులు బ్యాంక్ అకౌంట్ ఆధారంగా జరిగేవి. కానీ ఇటీవల ఆధార్ ఆధారిత చెల్లింపుల పద్ధతి (Aadhar Based Payment System) కి  మారమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ పద్ధతికి మారాలంటే మొత్తం మూడు దశలు దాటాలి. మొదట ‘ఆధార్ సీడింగ్’ చెయ్యాలి. అంటే కూలీల పేర్ల పక్క ఆధార్ నెంబర్లను చేర్చాలి. ఆ తరవాత ‘ఆధార్ ఆథెంటికషన్’ జరగాలి. అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జాబ్ కార్డులు మూడిటినీ మ్యాచ్ చెయ్యాలి. ఆ తరవాత NPCI (National Payment Corporation of India) పోర్టల్ లో మ్యాపింగ్ చెయ్యాలి. అంటే జాతీయ చెల్లింపుల పోర్టల్ తో అనుసంధానం చెయ్యాలి. ఇదంతా సవ్యంగా జరగాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జాబ్ కార్డు లలో ఏ చిన్న తేడా లేకుండా పూర్తిగా మ్యాచ్ అవ్వాలి. అంటే పేరులోని అక్షరాలు తేడా పడినా, జెండర్ లేదా వయసు తేడా పడినా అవి మ్యాచ్ కావు. అలా మ్యాచ్ కానీ వారి పేర్లే తొలగించ బడ్డాయి. వారి పేర్లు పెండింగ్ లో పెట్టే అవకాశం లేక అలా జరిగి ఉండవచ్చని ఫీల్డ్ లో పని చేసే వారు అంటున్నారు. బహుశ అదే కారణంతో ఈ సంవత్సరం ఉపాధి పనికి వెళ్లిన వారికి కొంత మందికి కూలీ డబ్బులు ఇంకా పడలేదు. పైగా డేటా ని నమోదు చేసే ప్రక్రియను ఇప్పుడు స్థానిక సిబ్బంది పరిధి నుండి తీసి వేసి ఎన్ ఐ సి (NIC) కి అప్పగించాక సమస్య ఇంకా జటిలంగా మారిందని ఉపాధి హామీ సిబ్బంది అంటున్నారు. కష్టసాధ్యమైన డెడ్లైన్లు పెట్టకుండా వారికి కొంత సమయం ఇచ్చి, సరైన శిక్షణ ఇచ్చి ఉంటె ఇన్ని పొరపాట్లు జరిగి ఉండేవి కావు. ఆధార్ కార్డులోనో రేషన్ కార్డులోనో ఎంట్రీలు తప్పుగా ఉండడం లబ్దిదారుల తప్పు కాకపోయినా శిక్ష వాళ్ళే అనుభవిస్తున్నారు. ఆంగ్లంలో స్పెల్లింగులు సరిగ్గా రాయలేని సిబ్బందిని ఆధార్ సెంటర్లలో డేటా ఎంట్రీ కి నియమించిన విషయం అందరి అనుభవంలో ఉంది. అక్కడ ఎంత నిర్లక్ష్యంగా తప్పుడు ఎంట్రీలు జరుగుతాయో వేరేగా చెప్పనవసరం లేదు.

డిజిటల్ వెలుగులు

డిజిటీకరణ వల్ల ప్రజలకు మరింత సులువుగా పని జరిగిపోవలి. కానీ ఇక్కడ  పథక నిర్వాహకుల సులువుకు మాత్రమే  ప్రాధాన్యతనిచ్చారు. మన దేశంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అన్ని పథకాలు DBT (Direct Beneficiary Transfer) పద్ధతిలోనే అమలవుతున్నాయి. అంటే రాయితీ సొమ్ము నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేయబడుతుంది. ఆ పథకాలకు కూడా ఎన్ పి సి ఐ మరియు ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేశారు. దాని ఫలితంగా సగానికి సగం మంది లబ్ది పొందలేక పోతున్నారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరగకపోయినా ప్రభుత్వం మాత్రం చాలా డబ్బునే మిగుల్చుకుంటోంది.  విషాదం ఏమిటంటే చాలా మంది గ్రామీణ పేదలకి ఎక్కౌంట్ లో డబ్బు ఎందుకు పడలేదో తెలీదు. ఇంకా తరవాత వస్తాయని తిట్టుకుంటూ ఎదురు చూస్తుంటారు. చాలా మంది ఉపాధి కూలీలకు కూడా వారి పేర్లను తొలగించిన విషయం తెలియదు. ఒక వేళ తెలిసినా డిజిటల్ సామర్ధ్యంలో వెనకబడిన ఆదివాసులకు మూడు కార్డులను సరిచేయించు కోవడం తలకు మించిన పనే అవుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు, రెవిన్యూ ఆఫీసులు వారికి చాలా దూరంలో ఉంటాయి. రోజుల తరబడి తిరగాలి. బోలెడు డబ్బు వెచ్చించాలి.

ఈ లోపు ప్రధాన మంత్రి మోడీ గారు జీ-20 సదస్సులో డిజిటల్ ఇండియా ప్రగతి గురించి గొప్పలు  చెబుతారు. భారత దేశ మధ్యతరగతి సంతృప్తిగా చంకలు గుద్దుకుంటుంది. కొలకా రంగారావు తాను బ్రతికే ఉన్నానని రుజువు చేసుకోవడానికి ఏమి చేయాలో తెలీక ఊళ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు.

కె. అనురాధ

ఆంధ్రజ్యోతి దినపత్రిక
29.08.2023

Related Posts

Scroll to Top