దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వారు జె.ఎన్.యు. పూర్వ విద్యార్ధి, ‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ కార్యకర్త ఉమర్ ఖలీద్ ను ఆదివారం రాత్రి అరెస్టు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈశాన్య దిల్లీలో జరిగిన హింసాకాండలో పాల్గొన్నాడనే అసత్య ఆరోపణలతో అతనిపై అత్యంత కిరాతకమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసారు. లేని సాక్ష్యాధారాలను సృష్టించి ఉమర్ ఖలీద్ మీద ఈ అన్యాయమైన అబద్ధపు కేసు బనాయించారని హెచ్.ఆర్.ఎఫ్. భావిస్తోంది.
పౌరసత్వ (సవరణ) చట్ట (సి.ఏ.ఏ.) వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలపై, ప్రధానంగా యువ కార్యకర్తలపై దిల్లీ పోలీసులు గత కొన్ని నెలలుగా పధకం ప్రకారం అబద్ధపు కేసులు బనాయిస్తూ పోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు వ్యూహం రచించిన కుట్రదారులు, వాటిని ప్రేరేపించిన వారు, రెచ్చగొట్టిన వారు, అల్లర్లకు పాల్పడ్డ కిరాతక మూకలు ఈనాటికీ దిల్లీ వీధులలో, అధికార కారిడార్లలో నిర్భయంగా, నిర్లజ్జగా తిరుగుతున్నారు. వారిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మతసామరస్యం కోసం కృషి చేసిన సంస్థలపై, కార్యకర్తలపై విషపూరిత దుష్ప్రచారం చేసుకుంటూ, అబద్ధపు కేసులు బనాయిస్తూ వారిపై విరుచుకుపడుతున్నారు. రాజ్యం, బిజెపి, దాని అనుబంధ సంస్థల అండదండలున్నాయి కాబట్టే వారు ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నారు.
గోల్వాల్కర్, హెగ్డేవార్ల భావజాల వారసులమని చెప్పుకు తిరుగుతూ రాజ్యమేలుతున్న వారు ఇవాళ దేశంలోని వైవిధ్యాన్ని మట్టుపెట్టి, ‘ఒక దేశం ఒక మతం” అనే దుర్మార్గమైన విలువను ప్రవేశపెట్టి, ఈ దేశాన్ని ఒక దురహంకార, అప్రజాస్వామిక, దుందుడుకు సమాజంగా మార్చాలని కలలుకంటున్నారు. వారు కంటున్న ఈ కల, చేస్తున్న పన్నాగాలు ముమ్మాటికీ నెరవేరవు. ఉమర్ ఖలీద్ మాటల్లోనే చెప్పాలంటే: “భారతదేశ పాలకులు ఒక యుద్ధం ఓడిపోయారు – అది ఏమంటే, యువ మనసులపై వారు చేస్తున్న యుద్ధం. మమ్మల్ని మట్టుపెట్టడానికి వచ్చారు; మేము విత్తనాలమనే సంగతి వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు.”
మన గణతంత్రం జనించిన ముద్దుబిడ్డ ఉమర్ ఖలీద్. అతను తన ప్రసంగాలు, రచనలు, అహింసాయుత కార్యకలాపాల ద్వారా రాజ్యాంగ విలువలను, నిరసించే హక్కును, నిర్భయంగా బ్రతకాలనే సందేశాన్ని శాంతియుతంగా చాటుతూ పోతున్నాడు. నిరుపేదల పట్ల, అణగారిని వర్గాల పట్ల ఉన్న కరుణామమతలు; సమానత్వం, న్యాయం మొదలైన విలువల పట్ల ఉన్న అపారమైన గౌరవం అతని రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దిoది.
దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉమర్ ఖలీద్, ఇతర సి.ఏ.ఏ. వ్యతిరేక కార్యకర్తలు అందరినీ వెంటనే విడిచిపెట్టాలని, వారిపై బనాయించిన అబద్ధపు కేసులను వెంటనే ఎత్తివేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది. ఉపా చట్టాన్ని, రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే ఒక మహత్తరమైన ఉద్యమాన్ని చేపట్టాలని ప్రజాస్వామికవాదులను మేము కోరుతున్నాము.
మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
14 సెప్టెంబర్ 2020