దెందులూరు తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ‘దళితులకు పదవులు ఎందుకురా’ అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్లజ్జగా తన పెత్తందారీ స్వభావాన్ని బహిరంగంగా బయటపెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యా తీసుకోకపోవడం సిగ్గుచేటు. తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేసి దళితులను గౌరవించని వ్యక్తులకు ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత లేదని ఆయన ఈ పాటికి విస్పష్ట ప్రకటన చేసి ఉండాల్సింది.
ఈ విషయంలో పోలీసుల ప్రవర్తన ఇంకా వింతగా ఉంది. అతనిపై తక్షణమే ఎస్.సి, ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం, 1989 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా, అతని మాటలను ఎడిట్ చేశాడని ఒక వ్యక్తిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఎడిట్ అంటే ఏమిటి? గంట ప్రసంగంలోంచి 5 నిమిషాలు కత్తిరించి పెట్టాడనా! అదే అంత నేరమైతే ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి చేసిన నేరం ఇంకెంతటిది? చింతమనేని ఆ మాటలు అనలేదని ఎస్.పి కూడా అనలేదే! మరి అతనిపై ఎందుకు కేసు పెట్టలేదు? అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు? తక్షణమే పోలీసులు ఆ రెండు పనులు చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎం.ఎల్.ఏ అయిన చింతమనేని ప్రభాకర్ దళితులు, స్త్రీలు, వెనకబడిన వర్గాల పట్ల ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం, అగౌరవంగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అతను అనేకసార్లు ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడ్డాడు. అతనిపై దాదాపు 40 కేసులు నమోదై కొన్ని ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి. ఒకసారి ఎస్.సి, ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం, 1989 కింద కూడా కేసు నమోదైంది. రౌడీ షీట్ తెరిచారు. ఒక కేసులో శిక్ష కూడా పడింది. అయినా అతని ప్రజా జీవితానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీకి అనిపించకపోవడం ఆశ్చర్యకరం.
ఇంతవరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా వారు అతని దురహంకార ప్రవర్తనకు ఆమోద ముద్ర వేసిన వాళ్ళయ్యారు.
ఇంతటి నేర చరిత్ర కలిగి, కుల దురహంకారం, పురుషాధిక్య భావజాలం ప్రతిబింబించే చేష్టలకు పాల్పడిన చింతమనేని ప్రభాకర్ ను ప్రజా జీవితంలో ఇంకా కొనసాగనీయడం సామాజిక న్యాయం అనే రాజ్యాంగ విలువకు తిలోదకాలు ఇవ్వడమే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అతనికి టికెట్ ఇచ్చి అతని ప్రజా జీవితాన్ని పొడిగించదలిస్తే దళితులకు, స్త్రీలకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. ఎటువంటి విలువలున్న మనుషులతో శాసనసభను నింపదల్బుకున్నారో ఆ పార్టీ ప్రజలకు స్పష్టం చేయాలి.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
22 ఫిబ్రవరి 2019