ఎదురుకాల్పుల దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆందోళనకరం

ఎదురుకాల్పులు (encounters) జరిగి మరణాలు సంభవించిన ప్రతి సందర్భంలోనూ  పోలీసులపై ప్రాధమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు భిన్నంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జూలై 18, 2019 న  ఒక తీర్పు ఇచ్చింది. ఈ  తీర్పు చాలా అసంతృప్తికరంగా, ఆందోళనకరంగా ఉందని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) భావిస్తోంది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏపీ  హైకోర్టు (ఐదుగురు జడ్జీల బెంచ్) 2009 ఫిబ్రవరి 6న ఇచ్చిన తీర్పుని గానీ, దాని స్ఫూర్తిని గానీ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. మరణాలకు దారి తీసిన ప్రతి ‘ఎన్‌కౌంటర్’ కేసులో ఆ ‘ఎన్‌కౌంటర్’ లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై ఎఫ్.ఐ.ఆర్.  నమోదు చేసి తీరాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తాజా తీర్పులో ఎక్కడా ప్రస్తావించ లేదు. ఎదురుకాల్పులు జరిగినప్పుడు సంఘటనపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని చెప్పిందే కాని ఆత్మరక్షణార్ధం ఎదురుకాల్పులు జరిపామని చెప్పే పోలీస్ సిబ్బందిపై ఎఫ్.ఐ.ఆర్.  నమోదు చేయాలని ఎక్కడా అనలేదు.

ఎన్‌కౌంటర్సంఘటన జరిగినప్పుడు దర్యాప్తు ఏవిధంగా జరగాలనే విషయంలో‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇతరులు’ అనే కేసులో 2014లో తాము ఇచ్చిన తీర్పే గీటురాయనిసుప్రీంకోర్టు అనింది. ‘ఇటువంటి కేసుల్లో ఎటువంటి విధానాలు అనుసరించాలో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పి.యు.సి.ఎల్) కేసులో కోర్టు వివరమైన ఆదేశాలు జారీ చేసింది’ అని చెబుతూ పోలీస్ ఎన్‌కౌంటర్ కేసుల్లో  ఆ ఆదేశాలనే శాసనంగా భావించాలని సుప్రీంకోర్టుజూలై 18 తీర్పులో నొక్కి చెప్పింది. 

సుప్రీంకోర్టు  అభిప్రాయంతో హెచ్.ఆర్.ఎఫ్. ఏకీభవించడం లేదు. పి.యు.సి.ఎల్. కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలనే అన్నారు కాని ‘ఎన్‌కౌంటర్’ మరణాలకు కారకులైన పోలీసు సిబ్బందిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని కచ్చితమైన, స్పష్టమైన ఆదేశాలు ఏమీ జారీ చేయలేదు. ఆ తీర్పే దేశంలో శాసనంగా చలామణి అవ్వాలని ఆదేశించడం ద్వారా ‘ఎన్‌కౌంటర్’ మరణాల కేసుల్లో పోలీసు సిబ్బందిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలనే ప్రధానాంశాన్ని విస్మరించినట్లు అయ్యింది.  ఈ తీర్పు పర్యవసానం ఏమిటంటే ఎన్‌కౌంటర్ మరణాలకు కారకులైన పోలీసు సిబ్బందిపై ఎటువంటి నేర విచారణ జరగదు. ఇన్నాళ్ళూ అదే జరుగుతూ వచ్చింది.  పి.యు.సి.ఎల్. కేసులో 2014 సెప్టెంబర్ 23న కోర్టు తీర్పు జారీ చేసిన తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతూ వచ్చింది.  దేశ అత్యున్నత న్యాయస్థానం ఇంతటి అస్పష్టమైన తీర్పు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.   

‘ఎన్‌కౌంటర్’మరణం సంభవించిన ప్రతిసారీ ఎఫ్.ఐ.ఆర్లు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ విషయo సుప్రీంకోర్టు ఎందుకు విస్మరించిందో మాకు అర్ధం కావట్లేదు.  ప్రతి ‘ఎన్‌కౌంటర్’ కేసులో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేస్తూనే ఉన్నారు కాని పోలీసులపై కాదు. ‘ఎన్‌కౌంటర్’ లో మృతి చెందిన వ్యక్తిపై చేస్తూ వచ్చారు.  పోలీసులపై హత్యా ప్రయత్నం నేరానికి పాల్పడ్డారని మృతులపై ఐ.పి.సి. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేస్తున్నారు.  కేసుని చనిపోయిన వ్యక్తిపై మోపి, ఆ పిమ్మట దాన్ని మూసేసి పోలీసులు తమ ఇష్టానుసారం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు ఎటువంటి దర్యాప్తు, న్యాయ విచారణ లేకుండా ఇటువంటి అన్యాయమైన ఆనవాయతీని అనుసరించి తప్పించుకుని తిరుగుతుంటేసుప్రీంకోర్టుకి తెలీదని అనుకుందామా?పోలీసులు పేరుకు మేజిస్టీరియల్ విచారణ జరిపి కేసులు మూసేస్తున్నారు.   ఇటువంటి ‘ఎన్‌కౌంటర్స్’ లో అధిక భాగం చనిపోతున్నది నిరాయుధులైన పౌరులు అనేది గమనించి తీరాలి. 

అన్ని ‘ఎన్‌కౌంటర్’ కేసుల్లో రెండు నేరాలను నమోదు చేయాలనేది హెచ్.ఆర్.ఎఫ్. అభిప్రాయం.  ఒకటి ఐ.పి.సి. సెక్షన్ 307 కింద, రెండోది సెక్షన్ 302 కింద నమోదు చేయాలి.  మొదటిది, హత్యా ప్రయత్నం నేరానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఐ.పి.సి. సెక్షన్ 307 కిందమృతులపై కేసు నమోదు చేయాలి. రెండోది,ఆత్మరక్షణార్ధం హత్యకుపాల్పడ్డారనే ఆరోపణపై సెక్షన్ 302 కింద పోలీసులపై కేసు నమోదు చేయాలి. ఆత్మరక్షణార్ధం కాల్పులు జరపగా మరణాలు సంభవించాయనే విషయం కోర్టులో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత  పోలీసులది.      

ఈ కేసుల్లో దర్యాప్తు ఎవరు జరపాలి?  సుప్రీంకోర్టు ప్రకారం: ‘సంఘటన/ ఎన్‌కౌంటర్ పై సి.ఐ.డి. కానీ , మరో పోలీసు స్టేషన్ కి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి(ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు పార్టీకి నాయకత్వం వహించిన అధికారి కంటే కనీసం ఒక స్థాయి పైనున్న అధికారి అయివుండాలి) పర్యవేక్షణలోని పోలీసు బృందం కాని స్వతంత్రమైన దర్యాప్తు చేయాలి.’ అంటే పోలీసులపై నేరారోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు జరపాల్సింది వారి సహోదరులే అన్నమాట.  ఆ విధమైన దర్యాప్తులు సక్రమంగా, స్వతంత్రంగా, న్యాయసమ్మతంగా జరిగే అవకాశాలు తక్కువ. అవి ఎటువంటి కొలిక్కీరావనే విషయం చాలా సందర్భాల్లో రుజువయ్యింది. ఈ అధికారిక హత్యలపై దర్యాప్తును ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలని మేము కోరుతున్నాం. 

ఐదుగురు సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం 2009 ఫిబ్రవరి 6 ఇచ్చిన తీర్పులోని కొన్ని వాక్యాలను గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది.  “విధి నిర్వహణలో భాగంగా కాని, విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నాననే భావనతో కాని, ఆత్మరక్షణార్ధం కాని ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తి మరణానికి కారకుడైతే ఆ సందర్భంలో ప్రాధమికంగా అందిన సమాచారాన్ని రికార్డు చేయాలి, చట్టంలోని తగిన సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి దర్యాప్తు జరిపించాలి.” 

2009లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆమోదిస్తూ సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చి ఉంటే – రాజ్యాంగ విరుద్ధంగా హత్యలకు పాల్పడ్డ పోలీసు అధికార్లపై కోర్టులో విచారణ జరిపే అవకాశం ఉండేది. ‘ఎన్‌కౌంటర్’ కేసుల్లో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి ఒక స్వతంత్ర సంస్థచే దర్యాప్తు జరిపించాలనే ఆదేశాన్ని సుప్రీంకోర్టు కనుక ఒప్పుకుని ఉంటే కొన్ని దశాబ్దాలుగా పోలీసులుహద్దూ పద్దూ లేకుండా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లు అయ్యేది.  ఈ పని సుప్రీంకోర్టు చేయక పోవడం నిజంగా బాధాకరం.  ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 21 అధికరణానికి తిలోదకాలు ఇచ్చిందని అనక తప్పదు.  ఈ ‘18 జూలై తీర్పు’ గురించి పునఃపరిశీలన జరగాల్సి ఉందని హెచ్.ఆర్.ఎఫ్. భావిస్తోంది.

వి. ఎస్. కృష్ణ; ఎస్. జీవన్ కుమార్

హెచ్.ఆర్.ఎఫ్.  ఎ .పి.&టి. ఎస్. సమన్వయ కమిటీ సభ్యులు

27-07-2019
హైదరాబాద్

Related Posts

Scroll to Top