ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు హాని చేసే జీ ఓ 50, 65లను రద్దు చేయాలి

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు సంబంధించి ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో హఠాత్తుగా పెనుమార్పులు తీసుకుని వచ్చి విద్యార్థుల, ఉపాధ్యాయుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వ జి.ఓ.నెం. 50, 65లను వెంటనే రద్దు చేయాలని మానవహక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌) డిమాండ్‌ చేస్తోంది.

ఈ జి.ఓ.ల కింద తీసుకుంటున్న చర్యలను తక్షణం ఉపవసంహరించుకోవాలని కోరుతున్నాం. సంఘసంస్కర్తలు, మిషనరీలు, ట్రస్టీలు సేవాభావంతో స్థాపించిన అనేక విద్యా సంస్థలు తరతరాలుగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తూ వచ్చాయి. ఇవాళ వాటి భవిష్యత్తు, వాటిలో చదివే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అల్లూరి సీతారామరాజు, మహాకవి శ్రీశ్రీ, సి.వి.రామన్‌ వంటి మహనీయులు చదువుకున్న ఘన చరిత్ర గల విద్యా సంస్థలపై సైతం వేటు వేసారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్ధులు తమ విద్యాహక్కునూ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ పని హక్కునూ మాత్రమే కోల్పోవడం లేదు; ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ఆయా విద్యా సంస్థలకున్న చరిత్రను, అవి పెంపొందించిన సంస్కృతిని కూడా రూపుమాపుతోంది.

1990 దశకం నుండి దేశవ్యాప్తంగా జరిగినట్లే కార్పొరేట్‌ విద్య మన రాష్టంలో కూడా విద్యా వ్యవస్థని కబళించింది. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ మీద మన రాష్ట్రంలో అధిక మోజు ఉండటం వల్ల ఇక్కడ కార్పొరేట్‌ విద్య మరింత వేగంగా పుంజుకుంది. ఫలితంగా ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో విద్యని అభ్యసించే ధనవంతుల బిడ్డలు క్రమంగా కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో భర్తీ కావడం, ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో కేవలం పేద, దిగువ మధ్యతరగతుల వారు చేరడం మొదలైంది. ఆయా ప్రభుత్వాలు వీటికి కేటాయించాల్సిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసేసరికి యాజమాన్యాలు కూడా వాటిపై పెట్టాల్సిన శ్రద్ధ పెట్టకుండా తమ సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేయగలిగే కోర్సులను ప్రారంభించడం మొదలెట్టాయి. ఈ విధంగా రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా సంస్థలు, అందులో చదివే విద్యార్థులు, పని చేసే ఉపాధ్యాయులు కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం, యాజమాన్యాల అనాదరణకు గురవుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్లుండి ఈ జి.ఓ.లను ప్రవేశపెట్టింది. 

ఈ చర్యలు విద్య ప్రైవేటీకరణని అరికట్టడానికి అయితే అంతకంటే హర్షించదగ్గది మరొకటి లేదు. ప్రభుత్వం అదే చేయదల్చితే అన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థలను మూసేయాల్సి ఉంటుంది. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేసి, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు అతితక్కువ వేతనాలు చెల్లించే విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రవేశపెట్టిన అనేక జి.ఓ.లను అమలు చేయాల్సి ఉంటుంది. బడుగువర్గాలకు చెందిన విద్యార్ధులకు కొద్దిపాటి మేలైన విద్యనందిస్తున్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఈ విధంగా వేటు వేయడం మాత్రం సరి కాదు. ప్రభుత్వ ఉద్దేశ్యం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటం కాదనేది జి.ఓ. 50, 65 లు చూపెడుతున్న కారణాలే స్పష్టం చేస్తున్నాయి. 

ఈ జి.ఓ.లు తీసుకొచ్చిన కారణాలు, అవి సూచిస్తున్న పరిష్కారాలు రెండూ సమంజసంగా లేవు. ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత మెరుగ్గా పని చేస్తున్నాయి కనుక ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసేస్తామనడం హేతుబద్ధంగా లేదు. ఈ విద్యా సంస్థల నిర్వహణలో లోపాలు ఉన్న మాట వాస్తవమే కాని ఎయిడెడ్‌ విద్యా సంస్థల దుస్థితికి ఒకానొక కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. వాటిని గాడిలో పెట్టాల్సింది పోయి ఈ జి.ఓ.ల ద్వారా వాటి గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల నిర్వహణ పట్ల తమకున్న బాధ్యత నుండి తప్పుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ.

‘స్వచ్చందంగా’ మూసేసుకోవడానికి ముందుకొచ్చిన ఎయిడెడ్‌ విద్యా సంస్థల నిర్వహణను, వాటి స్థిరచరాస్తులను స్వాధీనం చేసుకుంటామని, ఎయిడెడ్‌ పోస్టుల్లో ఉన్న అధ్యాపకులను, ఉపాధ్యాయులను ప్రభుత్వ విద్యా సంస్థల్లో భర్తీ చేస్తామని ఈ జి.ఓ.లలో పేర్కొన్నారు. ‘స్వచ్చందం’ అన్నది పేరుకే. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడికి తట్టుకోలేకే ఎయిడెడ్‌ సిబ్బంది, యాజమాన్యాలు అంగీకారం తెలుపుతున్నాయి.

ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలను, అందునా విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వ విద్యా సంస్థలకు తరలిస్తామనడం అమానవీయం. విద్యా విధానం పట్ల, పిల్లల మానసిక స్థితిగతుల పట్ల కనీస అవగాహన ఉన్న వారు ఇటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడరు.

ఎయిడెడ్‌ సంస్థల్లో కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న అన్‌-ఎయిడెడ్‌ సిబ్బంది గురించి ఈ జి.ఓల్లో ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు. వారి పరిస్థితి ఇప్పటికే దయనీయంగా ఉంది. అన్‌-ఎయిడెడ్‌ సిబ్బంది చాలా కాలంగా అటు యాజమాన్యాల, ఇటు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ సంస్థలను మూసేస్తే వీరందరూ ఏమి కావాలో ప్రభుత్వానికి పట్టడం లేదు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకున్నపుడు ఆ విద్యా సంస్థల యాజమాన్యాలకు నష్టపరిహారం కూడా ఇవ్వబోమని జి.ఓ.50 లో పేర్కొన్నారు. పైపెచ్చు ఈ చర్యలన్నీ ఆంధ్రప్రదేశ్‌ విద్యా చట్టం, 1982కు లోబడి తీసుకుంటున్నామని చెబుతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఈ చట్టమే కాదు రాజ్యాంగం కూడా కల్పించలేదు.

మైనారిటీ సంస్థలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈ జి.ఓలు కాలరాస్తున్నాయి. ఎయిడెడ్‌ విద్యా సంస్థల సిబ్బంది ఇప్పటికే కోర్టు కేసులు, వ్యాజ్యాల్లో కూరుకుని పోయున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశముంది. అది సిబ్బందికీ మంచిది కాదు, పాలనాయంత్రాంగానికీ మంచిది కాదు. అన్నిటికీ మించి ఆ విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు అసలు మంచిది కాదు.

పై కారణాల చేత ప్రభుత్వం ఈ ఏదాది జారీ చేసిన జి.ఓ. 50, 65లను, వాటి కింద తీసుకున్న చర్యలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ జి.ఓ.లను వెంటనే రద్దు చేసి వాటి ఆధారంగా తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులను ఈ సంస్థలకు హాని కలిగించే ఆలోచనలను మానుకుని వాటికి జీవం పోసే పనికి పూనుకోవాలని కోరుతున్నాం.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
30 అక్టోబర్‌ 2021

Related Posts

Scroll to Top