మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని, తమనే కాక తమ కుటుంబ సభ్యులనూ వేధిస్తూ, తాము సాధారణ జీవితం గడిపే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. 2024 డిసెంబర్ 19 వ తేదీన జరిగిన ఈ సంఘటనలో వారు సెల్ఫీ వీడియో ద్వారా అందరికీ ఒక అభ్యర్థన పెట్టి మరీ ఈ పని చేశారు.
ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకునే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఒక సంవత్సరం కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే తన శరీరంపై తనే పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, వాళ్లు తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ కాలనీ యువకులపై నమోదైన కేసులూ, వాటికి తట్టుకోలేక భీతి గొలిపే వారి పెనుగులాటల వెనుక చాలా సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.
డిసెంబర్ 19న నలుగురు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించటం వెనుక నేపథ్యం ఇలా ఉంది. 2024 నవంబర్ 15వ తారీకు మందమర్రి కేకే వన్ మైన్ లోపలికి కొంతమంది ప్రవేశించి, కాపర్ వైర్ దొంగతనానికి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోతే రాళ్లు విసిరి పారిపోయారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు, సూర్యకాంతి వెలుగులో ఇది జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరి పేర్లను పేర్కొంటూ మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపైన పోలీసులు పది రోజుల పాటు తమ పాత పద్దతుల్లో ‘విచారించి ‘, ఎస్సీ ఎస్టీ కాలనీ, యాపల్ లోని తొమ్మిది మందిపై కేసు కట్టారు. ఫిర్యాదు దారులు పేర్కొన్న ఇద్దరు వేరు, ఈ తొమ్మిది మంది వేరు. ఏ ప్రత్యక్ష లేదా సాంకేతిక సాక్ష్యం ఈ పోలీసుల పరిశోధనలో లేదు. బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా అందరినీ కండీషన్ పేరుతో వారానికి రెండు సార్లు స్టేషన్ కి రప్పించి బెదిరిస్తూ, అవమానకరమైన పనులు చేపిస్తూ, కొత్త కేసుల్లో కూడా ఇరికించటానికి పథకం వేస్తున్నారని భయపడిన నలుగురు ఇలా ఈ పని చేశారు.
మందమర్రి విద్యానగర్ లోని ఎస్సీ ఎస్టీ కాలనీ అనేది అనేక ప్రాంతాలనుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారి కూలీ చేసుకొని బ్రతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. అక్కడ స్థిరపడిపోయిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డకూలీ పని, యువకులైతే ఆటోలు నడుపుకోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనాధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, ఒకరి కంటే ఎక్కువ మంది పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితీ, మంచి స్కూల్ కి పంపించే స్థోమత లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన అక్కడి పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. ఈ తొమ్మిది మందిలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. ఎవ్వరూ, ఎన్నడూ సీరియస్ అఫెన్స్ చేయలేదు. స్క్రాప్ బిజినెస్ చేసే వైశ్య కులానికి చెందిన ఒక్కరు మినహా మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన కటిక పేదవారు. ఎవరికీ సరైన ఇల్లు లేదు. ఒక్కరు తప్ప ఎవరి చదువూ ఏడవ తరగతి దాట లేదు. ఇందులో ఒకరు తల్లిదండ్రులు ఏనాడో చనిపోయి, అనాధగా పెరిగిన 22 సంవత్సరాల మేస్రం రాజు అనే గోండి తెగ అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుండగా, మిగతావారు చిన్నాచితక పనులు చేసుకుని బతుకుతున్నారు.
నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటీష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది. ఈ రోజుకీ స్వాతంత్ర పాలకులూ, పోలీసులూ, న్యాయ వ్యవస్థా పేద వర్గాల విషయంలో అలాగే వ్యవహరిస్తున్నాయి. నేరారోపణలు వచ్చినప్పుడు వారు దొంగతనం చేశారు అనో లేదా చేసే ఉంటారు అనో తప్ప ఈ రోజుకీ మరో విధంగా ఆలోచించటం లేదు. కొన్ని సార్లు వారు చేయని నేరాలను కూడా మోపి, వారిని మరింత గందరగోళపరుస్తున్నారు. దొంగతనాల ఆరోపణలతో ముఖ్యంగా నిమ్న కులాలపై రాష్ట్రంలో పోలీసు అకృత్యాలకు అంతులేకుండా పోతున్నది.
ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం అయితే సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్ కలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా, గౌరవంగా బ్రతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటూ, వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఎందుకు బతకాలి? కేవలం దొంగతనం రూపంలో తేడా ఉన్నందుకేనా?
పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతీ, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం చాలా సంకుచితమైనది, అన్యాయమైనది. ఒకవైపు, నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే మరోవైపు నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం, జైళ్లకు పంపటం అనేది అనైతికమైన విషయం.
దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కుల వివక్ష ఉంది. అంతే కాదు మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మ వంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది. రాష్ర్టంలో ఇటువంటి ప్రాంతాలను గుర్తించి, పరిపాలనలో ఏ రకమైన సంస్కరణలు తీసుకుంటే అక్కడ ఈ పరిస్థితి మారుతుందో, ఆ సంస్కరణలను పాలకులు చేపట్టగలరా? ఒకప్పుడు ఉండిన కాస్త సున్నితత్వాన్ని కూడా కోల్పోతూ మొద్దుబారిపోతున్న పాలనా వ్యవస్థ నుండి ఇటువంటివి ఆశించగలమా?
డాక్టర్ ఎస్. తిరుపతయ్య,
మానవ హక్కుల వేదిక, తెలంగాణ.
సాక్షి , 03.01.2025.