ప్రహసనంగా మారిన 2019 ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకూ, పార్లమెంటు స్థానాలకూ ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు వ్యవహరించిన తీరు పట్ల మానవహక్కుల వేదిక దిగ్ర్భాంతి చెందుతోంది. ప్రజల సమస్యలపై, పాలనా విధానాలపై చర్చ అనేది ఎక్కడా కనిపించకుండా పోయి, ప్రాతినిధ్య ఎన్నికలు కాస్తా ఒక ప్రహసనంగా మిగిలిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తోంది.

అడపా దడపా జరిగే ఎన్నికల్లో వోటు వేసేసి ఆ తర్వాత పాలనను ఎన్నికయిన వారి చేతుల్లో పెట్టేయడమేనా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సారం అన్న చర్చను పక్కన పెడితే, ఈనాటి ఎన్నికల వ్యవహారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. నైతిక సూత్రాలకూ, సూత్రబద్ధతకూ తిలోదకాలిచ్చి నాయకులు ఎడాపెడా పార్టీలు ఫిరాయించడం, పట్టుమని పదిరోజులు కూడా కొత్త పార్టీలో గడపకుండానే మళ్ళీ గడప గెంతేయడం వంటి ఎన్నో జుగుప్సాకరమైన పరిణామాలకు ఈసారి ఎన్నికలు వేదిక అయ్యాయి. గతంలో ప్రజాస్వామిక విలువల గురించి కనీసం ఊకదంపుడు ప్రసంగాలైనా చేసేవారు. ఇప్పుడదీ లేదు. తమ అవకాశవాదాన్ని వారు బహిరంగంగా సమర్థించుకుంటున్నారు. గద్దె నెక్కడమే ఏకైక లక్ష్యంగా వారు వేయని పాచిక లేదు. యావత్తు రాజకీయ ప్రక్రియా తమ ఆస్తులు కూడగట్టుకోవడం కోసం, వ్యక్తిగత అభివృద్ధి కోసమేనని వారు భావించారు.

మన చుట్టూ ఉన్న సమాజంలో నిత్యం వివిధ రూపాల్లో హింస జరుగుతూనే ఉంది. కుల, మత, ప్రాంతీయ, లైంగిక, ఆర్థిక అసమానతలెన్నో మన సమాజంలో ఏళ్ల తరబడి వేళ్ళూనుకుని పోయాయి. పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు వంటి అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారంలో ఈ ప్రజా సమస్యలలో వేటికీ చోటు లేకుండా పోయింది. ఎన్నికల ప్రచారమంతా కూడా చాలా అసహజమైన రీతిలో అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో సాగింది. సూత్రబద్ధత, సభ్యత మృగ్యమై నేలబారు రాజకీయాలు సర్వత్రా ఆవిష్కృతమయ్యాయి.

ఎన్నికైన అభ్యర్థులు తమ జీవితాలను మెరుగుపరుస్తారని, నిత్య జీవిత సమస్యలను పరిష్కరిస్తారనీ, హక్కులను అమలు పరుస్తారనీ, చక్కటి విద్యా వైద్య సదుపాయాలూ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారనీ ప్రజలు గంపెడాశతో ఉన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికీ, సమాజాన్ని ప్రగతి వైపు మళ్ళించడానికీ తాము ఎటువంటి విధానాలను అవలంబించబోతున్నదీ పార్టీలు, అభ్యర్థులు అనువైన అన్ని వేదికలపైనా చర్చించాలి. ప్రజాభిప్రాయం ఆ సంవాదంలో భాగం కావాలి. ఆ చర్చే మృగ్యమైన కారణంగా వోటర్లు తమ ఆశలను నెరవేర్చే అభ్యర్థులను ఎన్నికల్లో ఎన్నుకునే అవకాశం, స్వేచ్చ కోల్పోయారు. పార్టీలు లేదా అభ్యర్థులు రూపొందించే విధానాలు వారికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సత్యానికి కేంద్రస్థానం ఉండాలి. అసత్యాలు వోటర్లను ప్రభావితం చేస్తే వారు స్వేచ్చగా ప్రవర్తించలేరు. ఉద్దేశ్యపూర్వకంగా సాగిన అసత్య ప్రచారాల హోరులో ఎన్నికల ప్రక్రియ దాని ప్రాధాన్యతను కోల్పోవడం విషాదం. ఈ విషాదానికి రాజకీయ పక్షాలనే నిందించాలి.

సామాజిక న్యాయం, ఆర్థిక విధానాలు వంటి ఎన్నో చర్చకు రావాల్సిన విషయాలు ఈ దఫా చర్చకు రాకుండా పోయాయి. దానికి బదులు అభ్యర్థుల విజయావకాశాలు, వారికి కలిసి రాగల అవకాశాలు, వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలూ, అభ్యర్థుల రాజకీయ చతురత వంటి అంశాల మీదనే ప్రధానంగా చర్చంతా సాగింది. ప్రజలకు చేరువ కావడానికి రాజకీయ పార్టీలు భారీ మార్కెటింగ్‌ ప్రచారాలను కూడా నిర్వహించాయి.

అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా తెలుగుదేశం, వై.ఎస్‌.ఆర్‌.కాంగెస్‌ పార్టీలు ఈ ఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టాయి. ఈ ఎన్నికల్లో ప్రతి వోటరుకి రూ.1000 నుండి రూ.3,000 రూపాయలు చొప్పున పంచి పెట్టారనేది జగమెరిగిన సత్యం. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువగా కూడా పంపిణీ చేసారని విన్నాం. పోటాపోటీగా వోటర్లకు డబ్బు పంపిణీ చేయడం ఒక ప్రమాణంగా మారిపోతుండటం విస్మయాన్నీ విచారాన్నీ కలుగచేస్తోంది. ఈ రకంగా వోటర్లకు డబ్బులు ఎరజూపి ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారనే విషయాన్ని కాసేపు పక్కనపెట్టినా, ఇన్ని లక్షలకోట్ల రూపాయలు వీరికి ఎక్కడ నుండి వస్తున్నాయన్నది ఆలోచించాల్సిన విషయం. ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల రాజకీయ చిట్టా విప్పి చూడాలే కాని కనిపించేది వారి నేర, అవినీతి చరిత్రలే. చట్టం పట్ల ఎవరికీ కించిత్తు గౌరవం లేదు. చాలా మంది నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారంలో బాధ్యతాయుతంగా మాట్లాడటం, సంయమనం పాటించడం అన్న ప్రమాణాన్ని గాలికి వదిలేసారు. ఒకరిపై ఒకరు అసభ్యకరంగా, అసహ్యకరంగా బురద జల్లుకోవడం ఒక్కటే మిగిలింది. జుగుప్సాకరమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం ద్వారా ఓట్లు పొందుదామని ఒకర్ని మించి ఇంకొకరు పోటీపడ్డారు.

నైతికతకు కట్టుబడి వాస్తవాలను వెల్లడించడంలో మీడియా పాత్ర కీలకమైనది. దీనికి భిన్నంగా ఈసారి ఎన్నికల సందర్భంగా మీడియా ఎంత అనైతికంగా ప్రవర్తించిందో చెప్పనవసరం లేదు. గణనీయమైన సంఖ్యలో పత్రికలూ, చానళ్ళూ వివిధ పార్టీలకూ, అభ్యర్థులకు బాకాలుగా, కరపత్రాలుగా మారిపోయాయి. ఈ ఒరవడిలో కొన్ని తెలుగు వార్తా చానళ్లు ఇంగ్లీష్  చానల్‌ ‘రిపబ్లిక్’ను మించిపోయాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని మానవహక్కుల వేదిక భావిస్తోంది.

మసిపూసి మారేడుకాయ చేసి యదార్ధాన్ని వక్రీకరించడం ప్రధాన స్రవంతి మీడియాలో పదేపదే జరిగింది. ఎన్నికల సంవాదాన్ని దిగజార్చడంలో ఇది చేయని పనుంటూ లేదు. జర్నలిజం పాటించాల్సిన నైతిక సూత్రాలను పూర్తిగా బుట్టదాఖలా చేసి అర్ధసత్యాలనూ, అసత్యాలనూ, పుకార్లనూ, సంచలన కధనాలనూ ప్రసారం చేసింది. మీడియా సంస్థలు పోటాపోటీగా అర్థంపర్థం లేని కథనాలు అల్లాయి. ప్రధానమైన అంశాలపై లోతైన విశ్లేషణ అన్నది పూర్తిగా కొరవడింది. వార్తల స్థానాన్ని సౌండ్‌ బైట్లు ఆక్రమించుకున్నాయి. వార్తా ప్రసారాలన్నీ ‘రియాలిటీ షో’లుగా మారాయి. సత్యాన్ని అసత్యం మింగేసింది. వాస్తవాలను వక్రీకరించడం, పక్షపాత వైఖరి ప్రదర్శించడం, ఉదారంగా అహేతుక భావనలకు స్థానం సమయం కల్పించడం కొంతమంది జర్నలిస్టుల ప్రమాణంగా మారిపోయింది. నిజం పట్ల వారికి ఏమాత్రం గౌరవం లేదనేది స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తుంది. ఈ దురదృష్టకర పరిణామంలో కొంతమంది సీనియర్‌ పాత్రికేయులు కూడా చేరిపోయి తమ మేధోసంపదను అనైతికంగా తాకట్టు పెట్టడం మమ్మల్ని తొలిచేస్తోంది. అయితే నైతిక విలువలకు కట్టుబడి జర్నలిజాన్ని సామాజిక ప్రయోజనం కోసమే వినియోగిస్తున్నవారు లేకపోలేదు. కాని అసత్యాల రణగొణధ్వనులలో వారి మాటలు మరుగున పడిపోవడం ఎంతో విషాదకరం.

ప్రజాస్వామ్యంలో మీడియా ఒక మూలస్తంభం. ఫోర్త్‌ ఎస్టేట్‌గా పేరొందింది. అయితే అటువంటి మీడియాకు సామాన్య ప్రజల సమస్యలు పట్టవనే విషయం ఈ ఎన్నికల ద్వారా మరింత స్పష్టంగా అర్థమైంది. అంతేకాక మీడియా అన్నది వాస్తవాలను ఉన్నదున్నట్లు చెబుతుందనే సాధారణ విశ్వాసం కూడా ప్రజల్లో తుడిచి పెట్టుకుపోయింది. ఈ విలువల పతనం ప్రజలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు చేటు చేస్తుంది. ఇవ్వాళ ప్రజలకు సంజాయషీ చెప్పుకోవాల్సిన వాళ్ళలో మీడియా ప్రథమ స్థానంలో ఉందనడానికి మేము సంశయించడం లేదు.

ఇవన్నీ ఒకెత్తు అయితే, ఈ ఎన్నికల్లో చొరబడిన మరో దౌర్భాగ్యం వ్యక్తిగత సమాచార చౌర్యం. లక్షలమంది పౌరుల వ్యక్తిగత సమాచారం కొన్ని ప్రయివేటు ఐటీ కంపెనీల పరం అయ్యిందనీ, ఆ సమాచారాన్ని ఎన్నికల సందర్భంలో ఆయా వోటర్ల మనోగతాన్ని అంచనా వేయడానికి అవి వినియోగించుకుంటున్నాయనీ వెల్లడయ్యింది. రాజకీయ పార్టీలు వోటర్ల అభిప్రాయాన్ని తమవైపు మలచుకోవడానికి ఈ సమాచారాన్ని అనైతికంగా వాడుకున్నాయి. అలాగే బోగస్‌ సర్వేలు, పుకార్లు, అసత్యాలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ప్రజాస్వామ్యాన్ని ఒక విలువగా పరిగణించే పౌరులుగా మనం ఈ దురదృష్టకర పరిణామాలను ఎలా అర్థం చేసుకుంటాం? మరింత క్రియాశీలంగా, మరింత చిత్తశుద్దితో పని చేయడం ద్వారానే మనం ఈ దుస్థితి నుండి బయట పడగలమని మానవహక్కుల వేదిక బలంగా నమ్ముతోంది.

మానవహక్కుల  వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
29 ఏప్రిల్‌ 2019

Related Posts

Scroll to Top