కళ్లపర్రి దళితుల మీద కౌంటర్‌ కేసులు పెట్టడం ఏమి న్యాయం?

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కళ్లపర్రి గ్రామంలో 16 మంది దళితుల మీద అగ్రకులస్తులు దాడి చేసి పది రోజులు కావస్తున్నా నిందితులను ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధక కేసు కింద ఇంతవరకూ అరెస్టు చేయకుండా బాధితుల మీదనే తిరిగి కౌంటర్‌ కేసు పెట్టడాన్ని మానవహక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండిస్తోంది.

కళ్లపర్రి గ్రామ దళిత కాలనీలోని సిమెంట్‌ రోడ్డుకు అడ్డంగా కర్రెమ్మ గుడిని కట్టె ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ రోడ్డుమీద తిరగడానికి తమకు అసౌకర్యం కలుగుతుందని తెలిసినా దళితులు పెద్ద మనసు చేసుకొని పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. అయితే గుడిని కట్టిన అగ్రకులాలవారు తాము ఒప్పుకున్న కొలతలకు మించి కట్టడం వల్ల దళితుల్లో ఆందోళన తలెత్తింది. 19 మే 2020 తేదీన ఉదయం 7-8 గంటల మధ్య గ్రామానికి చెందిన దాదాపు 300 మంది అగ్రకులస్తులు ఘటనా స్థలాన్ని చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 24 మంది బోయ కులస్తులు 16 మంది దళితులపై ఇనుప కడ్డీలు, కట్టెలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు దళితులకు తీవ్రమైన గాయాలు కాగా, 11 మందికి మూగ దెబ్బలు తగిలాయి. అయితే పోలీసులు తలకు గాయమై రక్తమోడిన మాదిగ కర్రన్న  ఒక్కడినే ఆసుపత్రిలో చేర్చారు. అతని నుంచి ఫిర్యాదు తీసుకొని దాడికి అసలు సూత్రధారులైన వెంకటేశ్వరరెడ్డి, బోయ మల్లిఖర్జునలను వదిలేసి, కేవలం 10 మంది బోయల మీదనే ఎస్‌.సి, ఎస్‌.టి కేసును నమోదు చేశారు.

దాడి జరిగిన సమయంలో పోలీసులు ఉండబట్టి సరిపోయిందని, లేకపోతే తమకు ప్రాణహాని సైతం జరిగేదని దళితులు వాపోయారు. దళితులు తిరిగి దాడి చేయకపోయినా దాడికి పాల్పడ్డవారు తప్పుడు ఆరోపణలతో ఎదురు దళితులపైనే ఫిర్యాదు చేశారు. పోలీసులు అగ్రకులాల వత్తిడి మేరకు 10 మంది దళితులపైన చేయని నేరాన్ని మోపి కౌంటర్‌ కేసును నమోదు చేశారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార కేసు పెట్టిన ప్రతి సందర్భంలోనూ ఈ రకంగా కౌంటర్‌ కేసులు పెట్టడం పోలీసులకి అలవాటుగా మారిపోయింది. ఈ ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా కర్నూలు ఆర్డీవో, డి.ఎస్పీ గానీ ఇంతవరకు గ్రామాన్ని సందర్శించలేదు. గ్రామంలో కేవలం ముగ్గురు కానిస్టేబుళ్ళతో పికెటింగ్‌ ఏర్పాటు చేసి సరిపెట్టారు. దళితులు డిఎస్పీని కలవడానికి కర్నూలు వెళ్లినా ఆయన వారితో మాట్లాడకపోవడం చూస్తే బాధితుల పట్ల ఆయన బాధ్యతారాహిత్యం బహిర్గతమవుతోంది.

దళిత యువకులను అగ్రకులాల వారు చంపుతామని ఇప్పటికీ బెదిరిస్తూనే వున్నారు. దాడికి సూత్రధారులైన వారిపై కేసు పెట్టకపోవడం వల్ల వారు యధేచ్చగా గ్రామంలో తిరుగుతున్నారు. కేసు నమోదైన వారిని అరెస్ట్‌ చేయక పోవడం వల్ల వారు తమపై మళ్ళీ దాడి చేస్తారనే భయంతో కాలం వెళ్లదీస్తున్నారు.

గతంలో అదే గ్రామంలో దేవర సందర్భంగా దున్నపోతును బలి ఇచ్చే విషయంలో దళితులు వ్యతిరేకించినందుకు, మిగతా అన్ని అగ్రకులాల వారు కలసి దళితులను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. దళితులపై దాడులను నిరోధించడానికి ప్రత్యేకమైన చట్టం ఉంది. కానీ ఆ చట్టం ఆచరణలో ఏ మాత్రం అమలవుతుందో చెప్పడానికి కళ్లపర్రి ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

ఇప్పటికైనా కర్నూలు ఆర్దీవో, డిఎస్పీలు గ్రామాన్ని సందర్శించి ఈ సంఘటన మీద విచారణ జరపాలనీ, ఘటనకు కారకులైన అసలు దోషులందరినీ నిందితులుగా చేర్చి వారిని అరెస్టు చేయాలనీ మానవహక్కుల వేదిక కోరుతోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నది. బాధితులైన దళితులకు రక్షణ కల్పించి, వారికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు, వారిపై పెట్టిన కౌంటర్‌ కేసులను తప్పుడు కేసుగా ప్రకటించి రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
30 మే 2020

Related Posts

Scroll to Top