కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచాలి

ప్రాణాంతకమైన రెండవ విడత కోవిడ్‌-19 ఇప్పుడు మన ముందు ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ర్రాలలో వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్యకు సరిపడా మంచాలు లేవు. అత్యవసర మందులకు తీవ్రమైన/ కృత్రిమ కొరత ఏర్పడింది. ప్రాణాలు నిలిపే ఆక్సిజన్‌ లభించడం లేదు. వైద్య నిపుణులు అవసరమైన సంఖ్యలో లేరు. చివరికి శ్మశానాల్లో కూడా చోటు లేకుండా పోయింది.

గతేడాది మనకేమీ గుణపాఠం నేర్పినట్టు లేదు. హరిద్వార్‌ కుంభమేళాలో లక్షల మంది గుమిగూడటం, కొన్ని రోజుల క్రితం కర్నూలులో ఉగాది రోజున ఆవు పిడకల పోటీలో వేల మంది పాల్గొనటం చూశాము. అందరం సామూహిక మరణాన్ని కోరుకుంటున్నామా అనిపిస్తోంది ఇవన్నీ చూస్తుంటే. దేశవ్యాప్తంగా ఒక అత్యవసర స్థితిలో మనం ఉన్నాం. ఈ సంక్షోభానికి తగ్గ స్థాయిలో ప్రభుత్వాల స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ ప్రభుత్వాలు మరింత ఆలస్యం చెయ్యకుండా తక్షణమే రంగంలోకి దిగాలని కోరుతున్నాం. పాత తప్పులు పునరావృతం కాకూడదు.

భారీగా జరిగే సామూహిక మత కార్యక్రమాలనూ, ఎన్నికల ఊరేగింపులనూ, సభలనూ నిషేధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. భౌతిక దూరం పాటించడం, బహిరంగ ప్రదేశాలలో మాస్క్‌ ధరించడం అనే నియమాలని నిక్కచ్చిగా అమలు చెయ్యాలి. టీకా కొరతని తక్షణమే పరిష్కరించాలి. గతంలో అందుబాటులో ఉన్న కోవిడ్‌ సదుపాయాలని తిరిగి ప్రారంభించాలి. ప్రజారోగ్య వ్యవస్థ కోవిడ్‌ విశృంఖల  విజ్రుంభణ కట్టడి చేసే విధంగా పటిష్టపరచాలి. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడని స్థితిని కల్పించాలి. మొదటి విడతలో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల మీద ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. వారి అలక్ష్యం కారణంగా అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పరిస్థితి మరింత దిగజారక ముందే ప్రభుత్వం రంగంలోకి దిగాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. అసంఘటిత రంగ కార్మికులు గత వేసవిలోలా మళ్ళీ కడగళ్ళ పాలు కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. వారిని వేధింపులకు గురి చెయ్యకూడదు. వారి మౌలిక అవసరాలు తీర్చడమే కాక వారి ఆర్థిక భద్రతకూ, రక్షణకూ వెంటనే చర్యలు తీసుకోవాలి.

మానవహక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
16 ఏప్రిల్‌ 2021

Related Posts

Scroll to Top