కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులకు ప్రాణ హాని ఉంది కనుక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ.) కింద చేపట్టే పనులను తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.), సమాలోచన డిమాండ్ చేస్తున్నాయి. రిజిస్టరయిన ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులందరికీ (క్రియాశీలకం కాని కార్మికులతో సహా) లాక్డౌన్ కాలమంతటా ప్రభుత్వం అడ్వాన్సు రూపంలో పూర్తి వేతనాలు చెల్లించాలి. ఈ వేతనాలను నిరుద్యోగ భత్యం లాగా పరిగణించ కూడదు. దానిని పని చేయాల్సిన కాలంలో పని చేయలేకపోయినందుకు చెల్లించాల్సిన వేతనంగా భావించాలి.
ఆంధ్రప్రదేశ్లో 93 లక్షల మంది రిజిస్టర్డ్ ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులు ఉన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఏ. పనులు చేపట్టడంలో అగ్రభాగాన వున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. లక్షలాది కుటుంబాలకు, ముఖ్యంగా పనులు దొరకని వేసవి కాలంలో ఆహార భద్రత కల్పించే ఈ పధకo వారికి ఆయువుపట్టు లాంటిది. కరోనా వైరస్ బాగా వ్యాపించిన జిల్లాలతో సహా రాష్ట్రమంతటా బుధవారo నాడు (ఏప్రిల్ 15న) 8.3 లక్షల మంది ఎన్.ఆర్.ఇ.జి.ఏ. పనులకు హాజరు కావడం చాలా ఆందోళనకరమైన విషయం. ఉదాహరణకు, అనేక మండలాలను కంటేన్మేంట్ జోన్లుగా ప్రకటించిన ప్రకాశం జిల్లాలో అత్యధిక సంఖ్యలో 1.95 లక్షల మంది ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులు పనులకు హాజరయ్యారు.
స్వాభావికంగానే ఈ పనుల్లో కార్మికులు ఒకరి నుండి ఒకరు భౌతికoగా దూరంగా ఉండటం సాధ్యమయ్యే పని కాదు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 15న కేంద్ర ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వుల మేరకు ఈ పనులు కొనసాగించడం మానవ హక్కుల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. ఆ విధంగా చేయడమంటే ఆ కార్మికుల జీవితాలతో చెలగాటమాడటమే.
ఎన్.ఆర్.ఇ.జి.ఏ. బకాయిలు చెల్లించారు కాని సంబంధిత బ్యాంకు సర్వీసులు, కస్టమర్ సర్వీసులు పని చేయకపోవడం వల్ల ఆ డబ్బులు కూడా వారు పొందలేక పోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నగదును గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ళ వద్ద అందజేసే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులు అందరినీ భవనాలు, ఇతర నిర్మాణాల కార్మికుల చట్టం (బి.ఓ.సి.డబ్య్లు.) కింద కార్మికులుగా రిజిస్టర్ చేయాలి. ఆవిధంగా చేస్తే ఆ కార్మికులకు భీమ, పిల్లల చదువులకు స్కాలర్షిప్పులు, పెన్షన్ వంటి అనేక సామాజిక భద్రత సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. బి.ఓ.సి.డబ్య్లు చట్టం కింద చెల్లించాల్సిన 1% సెస్స్ కట్టి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శిగా నిలవాలి.
కనీ వినీ ఎరుగుని విధంగా ఈ లాక్డౌన్ విధింపు, మరియు దాని కొనసాగింపు వల్ల కోట్లాది మంది వలస కార్మికులు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు, ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికులు, అసంఘటిత రంగంలో పని చేసే వారు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్స్, నిరాశ్రయులు, నిరుపేదల జీవితాలు ఛిద్రమయ్యాయి. జీవనోపాధి లేక వారు వీధులపాలయ్యారు. కరోన మహమ్మారి, లాక్డౌన్ల వల్ల ఆకలి, పెను దారిద్ర్యం నిరుపేదలను పట్టి పీడిస్తున్నాయి. ధనిక, మధ్య తరగతుల ప్రజలకు లేని అదనపు భారం వీరి నెత్తిన పడింది. గ్రామీణ కార్మికుల పట్ల, లాక్డౌన్ వల్ల పేదలకు కలిగే నష్టం పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి అవలంబించడం వల్ల రాబోయే కాలంలో వారి బ్రతుకులు మరింత దుర్భరంగా మారే అవకాశంముంది.
గ్రామీణ ఉపాధి విషయంలో ఎన్.ఆర్.ఇ.జి.ఏ. ప్రపంచoలోనే అతిపెద్ద పధకం. ఈ లాక్డౌన్ వల్ల అది పూర్తిగా కుంటు పడింది. లాక్డౌన్ వల్ల అనేక మంది వలస కార్మికులు తిరిగి తమ గ్రామాలకు వెళ్ళడంతో రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్.ఆర్.ఇ.జి.ఏ. పనులను మరింత పెంచి ఇంటి దారి పట్టిన వలస కార్మికులకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరo ఎంతైనా వుంది. వలస కార్మికులు ఇప్పటి వరకు ఈ పనులు చేయడం లేదు కాబట్టి వారిని ఇనాక్టివ్ కార్మికుల జాబితాలో చేర్చి ఉండొచ్చు, లేదా ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్మికుల జాబితాల నుండి వారి పేర్లు తొలగించి వారి జాబ్ కార్డ్లు రద్దు చేసి ఉండొచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి జాబ్ కార్డుకు 200 రోజుల పని దినాలు కల్పించాలని, మరింత మంది కార్మికులకు ఉపాధి అవకశం కల్పించే విధంగా రద్దు చేసిన జాబ్ కార్డులను ఆటోమేటిక్ గా రీయెన్రోల్ చేయాలనీ మేము కోరుతున్నాము. అందుకు తగ్గ బడ్జెట్ కేటాయింపు జరగాలి.
మానవ హక్కుల వేదిక
ఆంద్రప్రదేశ్ ఏప్రిల్
16 ఏప్రిల్ 2020