కోవిడ్-19 విషమస్థితిలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలి

కోవిడ్‌-19 విషమస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్‌ హోమ్‌లను స్వాధీన పర్చుకోవాలని మానవహక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌. ఎఫ్‌) డిమాండ్‌ చేస్తోంది. వాటిలోని వైద్య సదుపాయాలు, మానవ వనరులు సహా అన్నిటినీ తమ ఆధీనంలోకి తీసుకుని వాటి నిర్వహణా బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని కోరుతున్నాము. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాయి. కోవిడ్‌ను కట్టడి చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేసిన స్పెయిన్‌ మన ప్రభుత్వాలకు ఆదర్శప్రాయం కావాలి.

కోవిడ్‌ మనకు చేయగల హాని గురించి అందరూ భయాందోళనలతో ఉన్నారు. అదృష్టవశాత్తూ కోవిడ్‌ ఇప్పటివరకు మన దేశంలో విశ్వరూపం దాల్చలేదు. ఇది దేశమంతటా వ్యాప్తి చెందితే సంభవించే పరిణామాలు ఊహకు అందడం లేదు. అలాంటి విపత్కర పరిస్థితులే సంభవిస్తే దానిని ఎదుర్కోవడానికి మన ప్రజారోగ్య వ్యవస్థ ప్రస్తుత సామర్థ్యం సరిపోదు. అందుకే ప్రభుత్వం ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థలను, వాటికున్న సదుపాయాలను తన అదుపులోకి తెచ్చుకోవాలని అంటున్నాము.

మన ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం దయనీయంగా వుంది. కోవిడ్‌-19 వంటి అత్యవసర పరిస్థితులను దీటుగా ఎదుర్కొనే సత్తా దానికి లేదు. పరీక్షా సదుపాయాలు బొత్తిగా కొరవడ్డాయి. అలాగే వైద్యులు, పారా మెడిక్స్‌, పారిశుధ్య సిబ్బంది సరిపడా లేరు. ఆసుపత్రుల్లో  గ్లోవ్స్, మాస్క్‌ల వంటి రక్షణ సామగ్రికి కొరత ఉంది. ఇక చిన్న పట్టణాలలో, గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో వుంది. కొవిడ్‌ వంటి సాంక్రమిక వ్యాధులకు గురైన వారిని పరీక్షించి, వారిని వేరు పరచి చికిత్సను అందించడం ద్వారా వ్యాధిని కట్టడి చేసే దిశలో మన ఆరోగ్య వ్యవస్థ పని చేయడం లేదు. అది కేవలం ధనికుల ప్రయోజనాలను కాపాడుతూ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళణ చేసి దానిని పేదలకు చేరువ చేయాలి. 

జైళ్లలో కోవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి అండర్‌ ట్రయల్‌ ఖైదీలను, శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను అత్యవసర  పెరోల్/బెయిల్‌ మీద విడుదల చేయడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలనూ చేపట్టలేదు. కోవిడ్‌-19 దృష్ట్యా జైళ్ళు కిక్కిరిసి ఉండటం ఆందోళనకరమైన విషయమని సుప్రీంకోర్టు వారం క్రితమే అన్నది. జైళ్ళలో ఖైదీల సంఖ్యను తగ్గించడానికి అండర్‌ ట్రయల్‌ ఖైదీలను, ఏడేళ్ళ లోపు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్/బెయిల్‌ మీద విడుదల చేసే విషయంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హర్షించదగ్గ ఈ ఉత్తర్వులను అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో ఎటువంటి ఆదేశాలు రూపొందాయో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు వేల మంది ఖైదీలు వుండగా వారిలో ఐదు వేల మంది కేవలం నాలుగు సెంట్రల్‌ జైళ్లలో బందీలై వున్నారు. తెలంగాణలో ఆరు వేలమంది ఖైదీలు వున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. పాత అలవాట్లు మానుకోవడం పోలీసువారికి కష్టమే! ఈ సంక్షోభ ఘడియల్లో పోలీసులు చాలా కష్టతరమైన బాధ్యతే నెరవేర్చవలసి వస్తోంది. అయితే ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీ అంటే పోలీసులకు తమ అధికారం దుర్వినియోగం చేసుకోవడానికి, ప్రజలను కొట్టడానికి, దుర్భాషలాడటానికి, వారిని కించపర్చడానికి ఒక లైసెన్సు కాకూడదు. అత్యవసర అవసరాల కోసం బైటకు వచ్చిన వారిని కూడా విడిచి పెట్టకుండా పోలీసులు అవసరానికి మించిన బలప్రయోగం, కర్ర పెత్తనం చేస్తున్నారు. అవసరానికి మించిన బలప్రయోగం చేయవద్దని ప్రభుత్వాలు పోలీసు సిబ్బందికి తక్షణం ఆదేశాలు జారీ చేయాలి.

కోవిడ్‌ సమస్త మానవాళిని గడగడలాడిస్తున్న తరుణంలో గూడులేని నిరుపేదల, వలస కార్మికుల, రోజుకూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. వారి కోసం ప్రభుత్వం చేయాల్సినంత చేయడం లేదనేది వార్తల ద్వారా స్పష్టమౌతోంది. పేదలు ఎలా బ్రతకాలి అనే విషయం గురించి కనీసపాటి ఆలోచన చేయకుండా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ప్రభుత్వం వ్యాధి కట్టడికి పథకాలు రూపొందించేటప్పుడు పేదల ప్రయోజనాలను కాపాడటంపై దృష్టి పెట్టె బదులు ప్రభుత్వం వారిని కొవిడ్‌ కు బలి పశువులుగా మార్చిందని ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అర్థమౌతుంది.

మానవహక్కుల వేదిక

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ

29 మార్చి 2020

Related Posts

Scroll to Top