గత సంవత్సర కాలంగా మెరుగైన వేతనం కోసం, తమ హక్కుల కోసం పోరాడుతున్న గంగవరం పోర్ట్ సర్వీస్ ఇండియా పైవేట్ లిమిటెడ్ (జీపీఎస్) ఉద్యోగులకు కనీస వేతన చట్టప్రకారం నెలకు ముప్పైవేలు ఇవ్వాలని, వారందరినీ అదానీ పోర్ట్ ఉద్యోగులుగానే పరిగణించి ఉద్యోగ భద్రత కల్పించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. గంగవరం, దిబ్బపాలెం నిర్వసిత ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి HRF మద్దతు ఇస్తోంది.
అదానీ గంగవరం పోర్టు పైవేట్ లిమిటెడ్ లో గంగవరం, దిబ్బపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు 550 మంది పనిచేస్తున్నారు. వీరంతా పోర్ట్ నిర్మాణ సమయంలో నిర్వాసితులు. అనేక పోరాటాలు, కాల్పుల అనంతరం గంగవరం పోర్ట్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ అనే ఒప్పంద సంస్థ ద్వారా ఈ ఉద్యోగాలు లభించాయి. చేపలవేట ద్వారా జీవితం గడిపిన వీరంతా, గంగవరం పోర్ట్ నిర్మాణం వలన సముద్రానికి, వేటకు దూరమయ్యారు. గంగవరం ఊరే దాదాపు మాయమయ్యింది. వీరంతా అన్ స్కిల్డ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ, క్లీనింగ్, లోడింగ్, అన్ లోడింగ్ వంటి విభాగాల్లో పని చేస్తున్నారు. దాదాపు 14 ఏళ్లుగా, అంటే పోర్టు ప్రారంభం నుంచి వీరంతా పని చేస్తున్నా వారిని అదానీ పోర్టు ఉద్యోగస్థులుగా గుర్తించట్లేదు. వీరి మూలవేతనం గత 14 ఏళ్లుగా నెలకు 3700 రూపాయలే. కరువుభత్యం, ఇంటి అద్దె వంటి ఇతర అలవెన్సులతో కలిసి అందే మొత్తం పదిహేను నుండి పదిహేడు వేల లోపే. ఇందులో సుమారు రెండువేలు పి.ఎఫ్ వంటి కటింగులకు పోతుంది. ఏళ్ల తరబడి ఒకే బేసిక్ పే ఉండటం, పెరుగుదల లేకుండా అతి తక్కువ జీతాలు ఉండటం ముమ్మాటికీ 1976 కనీసవేతన చట్టం నిభందనల ఉల్లంఘనే.
జూన్ 2023లో జీపీఎస్ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
మానవ హక్కుల వేదిక (HRF) గంగవరం కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతోంది.
పి. రఘు – HRF విశాఖ జిల్లా అధ్యక్షులు
కె. అనురాధ – HRF విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి
28.04.2024
విశాఖాపట్నం