చేనుమెస్తున్న కంచె – మార్పు శరత్ (25.12.2024, ఉత్తరాంధ్ర)

ఇందులో దాపరికమేమిలేదు, సూటిగానే చెప్తున్నాను. చేను విశాఖ ఉక్కు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలే ఆ కంచె. రక్షించాల్సిన ఆ పచ్చని కర్మాగారాన్ని బక్షిస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలే. అత్యధిక మేజారిటీతో పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్ధులని గెలిపించండి ప్లాంట్ ని కాపాడుతాం అని ప్రజలసాక్షిగా నాటి ప్రతిపక్ష నాయకుడూ నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు గాజువాక సెంటర్లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. ఆ వీడియో అప్పట్లో మా సోషల్ మిడియా గ్రూపుల్లో బాగ ప్రచారం జరిగింది. అంతా కలసి అలాగే ఇద్దర్నీ భారీ మెజారిటీతో గెలిపించారు. ఏరు దాటాక ఇప్పుడు బోడిమల్లయ్య అంటున్నారు. ఇంకా ‘ముప్పైరెండుమంది త్యాగాల కీర్తనే ఆలపిస్థారా’?? పల్లవి మార్చరా అని సాక్ష్యాత్త ముఖ్యమంత్రి అంటున్నారు. పార్లమెంటులో ఈరొజు తనకున్న బలంతో విశాఖ ఉక్కును కాపాడ్డం పెద్దకష్టమైన పనేం కాదనే విషయం అందరికీ తెలుసు. కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులున్న కర్నాటకలోని విశ్వేశ్వరయ్య ఉక్కుకర్మాగారానికి 15,000 కోట్ల రూపాయలు సహయం ప్రకటించారు. ఆకర్మాగారం పదేల్లుగా నష్టాల్లోనే ఉంది. విశాఖ ఉక్కు తో పోల్చుకుంటే చాలా చిన్న ప్లాంట్. సంవత్సరానికి కేవలం ఏడు లక్షల టన్నులే ఉత్పత్తిచేస్తుంది. స్వంత గనులున్నాయి. భద్రావతి నది ఒడ్డునే ఉంటుంది, నీటికొరతలేదు. అయినా నష్టాల్లో ఉంది. విశాఖ ఉక్కు రేటెడ్ కెపాసిటీ 72 లక్షల టన్నులు. స్వంతగనులులేవు, నీరుకూడ కొనుగోలు చేస్తుంది. కేవలం స్వంత గనులు కేటాయిస్తే నష్టాల ఊసే ఉండదు. సంవత్సరానికి ఐదువేల కోట్ల రూపాయల లాభాలు సునాయాసంగా వస్తాయి. VISL కి ఆర్ధిక సహాయం వద్దనేది నా ప్రతిపాదన కాదు. పాలకుల ద్వందనీతి గమనించమని చెప్తున్నాను.

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రధాన సమస్య ఇనపగనులే. ఇరవై మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే ‘సెయిల్ ప్లాంట్ల’కు ముడిసరుకోసం అయ్యే ఖర్చు 18 వేల కోట్ల రూపాయలు కానీ 7.2 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తి చేసే విశాఖ ఉక్కు ప్లాంట్లకు ముడిసరుకోసం అయ్యే ఖర్చు 15 వేల కోట్ల రూపాయలు. సెయిల్ ప్లాంట్లకు టన్ను ఐరన్ ఓర్ ఐదువందలు నుండి రెండు వేల రూపాయల లోపల లభిస్తుంటే విశాఖ ఉక్కు ప్లాంట్ కు టన్ను ఐరన్ ఓర్ కొనుగోలుకు ఎనిమిదివేల ఐదువందల రూపాయలు వెచ్చిస్తుంది. అంచాత సెయిల్ మాదిరిగా స్వంత గనులుంటే ఒక్క ముడిసరుకుదగ్గరే పదివేలకోట్లు ఆదా అవుతుంది. ఇంత సింపుల్ లాజిక్ పాలకులకి తెలియదా?? సంపద సృష్టించదంలో ఆరితేరానని చెప్పుకుంటున్నా చంద్రబాబుకి తెలియదా?? సనాతన ధర్మరక్షకుడు పవన్ కల్యాన్ కు తెలియదా?? విశ్వగురువు మోడీకి తెలియదా?? అందరికీ తెలుసు. కానీ వారందరి ఎజండ ఒక్కటే. ఎలాగైనా విశాఖ ఉక్కును తమ అనునాయులకు అప్పగించాలి. దండిగా కమీషన్లు రావాలి. అందుకే ఇంకా ముప్పైరెండుమంది త్యాగాల కీర్తనే ఆలపిస్థారా?? అనే పల్లవి అందుకున్నారు.

పాత ప్రభుత్వం కార్మికులను మీరు పోరాడి రక్షించుకోమని, అటు కేంద్రాన్ని మీ పని మీరు చేసుకోండి అనే విధంగా వ్యవహరించింది. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం కంటే మేము బెటర్ అనేలా వాళ్ళు రెన్యువల్ చేయకుండా వొదిలేసిన మైన్స్ రెన్యువల్ చేసింది. స్టీల్ మినిస్టర్ ను రప్పించాం, ప్రకటన చేయించాం అన్నారు. ఆయన ఇక్కడ చెప్పిన దానికి, పార్లమెంట్ లో చెప్పిన దానికి సంబంధం లేదు.

కేంద్రం మాత్రం ఏది చేయదలుచుకున్నదో అదే చేస్తున్నది అన్నది తేటతెల్లం అవుచున్నది.

గత ఆరు నెలలుగా విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడా పొంతన లేకుండా వ్యవహరిస్తున్నాయి.. నాలుగు దశాబ్దాల విశాఖ ఉక్కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ వర్గాల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయింది. 2020 వరకు సెయిల్ కంటే మెరుగ్గా ఉన్న జీతాలు ఎలవెన్సులు 2021వ సంవత్సరం నుంచి దిగజారుతూ వచ్చాయి. మరోపక్క 20వేల కోట్ల రూపాయలతో విస్తరించిన మూడో దశ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది.. దీని ప్రభావం కర్మాగార ఆర్థిక వ్యవస్థ పై తీవ్రంగా పడింది. ఇది ముమ్మాటికి కేంద్రం కుట్రే అని ఉద్యోగ సంఘాలు అరోపిస్తున్నాయి.

సొంతగనులు లేక వేలకోట్ల రూపాయలు అదనంగా ఇనుప ఖనిజం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఆదానీ పుణ్యమాని ఉక్కు ఉత్పత్తి కి కీలకమైన విదేశీ బొగ్గు కొనలేని పరిస్థితిలోకి నెట్టబడుంది. ఫలితంగా ప్రతి నెల 2500 కోట్ల టర్నోవర్ ఉండవలసిన ప్లాంట్ 1500 కోట్లకు పడిపోయింది. 2021 మార్చిలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు మరణించడానికే పుట్టాయి అంటూ మార్చిన ‘ప్రభుత్వ రంగ పరిశ్రమల పాలసీ’ ప్రకారం విశాఖ ఉక్కు ఆర్థిక సహాయం రాదు, ఈ పాలసీ మారిస్తే గాని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖ ఉక్కు విలీనం సాధ్యం కాదు. అయినా ఆ విలీనం ఒక ఉపశమనమే కానీ విశాఖ ఉక్కుకు ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఇది జరగాలంటే రాజకీయ నిర్ణయం ద్వారామాత్రమే సాధ్యం. నాలుగు సంవత్సరాల క్రితం ఒరిస్సాలోని నీలాంచల్ ఇస్పాత్ ఉక్కు కర్మాగారాన్ని ఇలాగే ఒక్కొక్క విభాగం మూసుకుంటూ వచ్చి, ఉద్యోగులకు 14 నెలల జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి , వారంతట వారే బయట ఉద్యోగాలు వెతుక్కునేటట్లు చేసి , అవకాశం లేనివారికి అమ్మేయటం మాత్రమే మార్గం అని కడుపు మాడ్చి ఒప్పించి అమ్మేశారు.

జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది.ఇక్కడ కార్మికుల నిరసన బయట ప్రపంచానికి తెలియటానికి మార్గంగా ఉన్న కూర్మన్నపాలెం దీక్షా శిబిరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి నాయకులలో ఐకమత్యత లోపించి కార్మికుల మధ్య విచ్చినం సృష్టించారు. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ ఓరకంగా ఆ శిబిరాన్ని, ఉద్యమాన్ని ప్రజల దృష్టిలో పలుచన చేశారు. గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి ఆశలు రేకిత్తించిన VVలక్ష్మినారాయన,కే ఏ పాల్ లాంటివారి ఉనికే లేదు. ఎన్నికలు అయిపొయినాక రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ కార్మికులను పట్టించుకోవడం మానేశారు. ఇదేసంధర్భంలో నక్కపల్లిలో ఇరవైవేల ఉద్యోగాలు, ఏడు మిలియన్ టన్నుల సామర్ధ్యం అంటూ మరో ఉక్కు కర్మాగారాన్ని తెరమీదకు తీసుకొచ్చారు . ఇది మూసేసినా ఇంకో కర్మాగారం వచ్చింది అని ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఇంత పెద్ద కర్మాగారానికి పూర్తిస్థాయి చైర్మన్ లేడు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగులో కనీస సమాచారం ఇచ్చే అధికారులు లేరు.. మొత్తం ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది. రకరకలా కారణాల వలన పౌరసమాజానికి దూరమైన ఉక్కు ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. అడిగే నాధుడు లేడు. దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పండగలకు ఉక్కు ఉద్యోగులు జీతాలు లేక దూరంగా దీనంగా ఉన్నారు.

కింజరాపు రామ్మోహన్ నాయుడు గతంలో పార్లమెంట్లో ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఉక్కును కాపాడుతానని ప్రైవేటీకరణ వద్దని ఊదరగొట్టాడు, ఎప్పుడైతే కేంద్ర మంత్రి పదవి ఇచ్చారో విశాఖ ఉక్కుపై మాటా పలుకూ లేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు పూర్తిగా రా మెటీరియల్ లేక ఆర్థిక వనరులు లేక నైపుణ్యముగల సాంకేతిక నిపుణులు అందరూ రిటైర్మెంట్ అవుతుంటే ఎంతోమంది యువ ఇంజనీర్ల ఖాళీలు గా ఉన్న భర్తీ చేయకుండా విశాఖ ఉక్కును పూర్తిగా నిర్వీర్యం చేసి మోడీ తాబేదారులకు అప్పనంగా అప్పగించడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నందుకు తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నందుకు పాలకులకు కొంచెం కూడా సిగ్గు వేయటం లేదు. నాటి రాస్ట్ర పాలకులు బలం లేక, తమకున్న వివిధ కారణాల చెత చేస్టలుడిగి కాలయాపన చేసారు. నేటి కూటమి పాలకులు అన్నీ ఉండికూడ కంచే చేనుమేస్తున్న చందంగా కేంద్రంతో అంటకాగుతున్న ఈ సమయంలో పౌరసమాజమే ముందుండి సమశీల పోరాటాలు చెయ్యాలి. లేకపోతే చారిత్రక ఉక్కు కర్మాగారం చరిత్ర పుటల్లోకి జారుకోవడం ఖాయం.

25.12.2024,
ఉత్తరాంధ్ర.

Related Posts

Scroll to Top