జాతీయ జనాభా రిజిస్టరును తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి

జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) మొత్తాన్ని తిరస్కరించకుండా 2010 నాటి జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) ని అమలు చేస్తామంటే సరిపోదని, మొత్తం ఎన్.పి.ఆర్.ని తిరస్కరిస్తే తప్ప ప్రయోజనం లేదని,  ఆ మేరకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తమ రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానాలు అమలు చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది. 

చట్టరీత్యా ఎన్.పి.ఆర్., ఎన్.సి.ఆర్, సి.ఏ.ఏ. మూడు విడదీయలేనంతగా ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.  ఎన్.పి.ఆర్.కి శ్రీకారం చుట్టే పౌరసత్వ (సవరణ) చట్టం, 2003 ముఖ్య లక్ష్యం భారత పౌరుల జాతీయ రిజిస్టరు (ఎన్.ఆర్.సి.ఐ.సి.) రూపొందించడం.  ఎన్.పి.ఆర్. వివరాలు ఎలా సేకరించాలో నిర్దేశించే పౌరసత్వ (పౌరుల రిజిస్ట్రేషను, జాతీయ గుర్తింపు కార్డుల మంజూరీ) నియమాలు, 2003లోని 3వ నియమం శిర్షికలోనే ఎన్.ఆర్.సి.ఐ. ప్రస్తావన వుంది.  ఎన్.పి.ఆర్. ప్రక్రియ గురించి రూల్ 3(4) ప్రస్తావించగా రూల్ 3(5) సుస్పష్టంగా చెప్పేదేమిటంటే “జనాభా రిజిస్టరు ద్వారా ధృవీకరణ చేసిన తరువాతే భారత పౌరుల రిజిస్టరులో వ్యక్తుల వివరాలు పొందుపర్చుతారు.”  అనగా, జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) మీద ఆధారపడి భారత పౌరుల జాబితా (ఎన్.ఆర్.సి.) ను తయారు చేస్తారు.  పౌరసత్వ (సవరణ) చట్టం, 2003 పర్యవసానం ఏమంటే ఎన్.ఆర్.సి. అనేది ఈ నియమాలు చదివితే మనకి స్పష్టంగా అర్ధమౌతుంది.  మరో మాటలో చెప్పాలంటే ఎన్.పి.ఆర్. ఎన్.ఆర్.సి. కి తొలిమెట్టు.        

ఎన్.పి.ఆర్.-ఎన్.ఆర్.సి.-సి.ఏ.ఏ. ఏ క్రమంలో వచ్చాయో అర్ధం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో, బైట పదే పదే చాలా స్పష్టంగా చెబుతున్నారు.  ఎన్.పి.ఆర్. విధానంలో ఒక వ్యక్తి పౌరసత్వం ‘డౌట్ఫుల్’ లేదా ‘డి’ అని గుర్తించే ప్రసక్తి లేదని అమిత్ షా పార్లమెంట్ లో మార్చ్ 12వ తేదిన పచ్చి అబద్ధం ఆడారు. పౌరసత్వ (పౌరుల రిజిస్ట్రేషను, జాతీయ గుర్తింపు కార్డుల మంజూరీ) నియమాలు, 2003 లోని రూల్ 4(4) చెబుతున్నది ఏమిటంటే “ధృవీకరణ చేసేటప్పుడు వ్యక్తుల పౌరసత్వం అనుమానాస్పదంగా (డౌట్ఫుల్ గా) ఉన్నట్లు అనిపిస్తే దాన్ని స్థానిక రిజిస్టరులో నమోదు చేసేటప్పుడు ఈ విషయమై విచారణ జరపాలి అనే విషయాన్ని సూచిస్తూ జనాభా రిజిస్టరులో తగిన విధంగా గుర్తు పెట్టాలి. దృవీకరణ పూర్తయిన తరువాత పౌరసత్వ విషయంలో అనుమానం (డౌట్ఫుల్) వున్న కేసుల్లో ఆ వ్యక్తి, లేదా కుటుంబానికి ఆ విషయం ఒక ప్రోఫార్మా ద్వారా వెంటనే తెలియ చేయాలి.” 

ఎన్.పి.ఆర్. సర్వే చేపట్టేది ఎన్.ఆర్.సి. వివరాల సేకరణ కోసమేనని హెచ్.ఆర్.ఎఫ్. నమ్ముతుంది.  ‘డౌట్ఫుల్’ పౌరులను గుర్తించడానికి ఎన్.పి.ఆర్. వివరాలు వాడుకుంటారు, దాని ఆధారంగా ఎన్.ఆర్.సి.ని రూపొందిస్తారు.  జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) ఆధారంగా రూపొందించే జాతీయ పౌరుల రిజిస్టరు (ఎన్.ఆర్.సి.)ని అడ్డంపెట్టుకుని పాలకులు తమకు గిట్టని వ్యక్తుల పౌరసత్వంపై అనుమానాలు రేపి వారి జీవితాలతో చెలగాటమాడే అవకాశముంది.  ఇది కేవలం మత మైనారిటీల సమస్య మాత్రమేనని, ఇతరులది కాదు అన్నది ఒక భ్రమ.  ఈ సమస్య దేశంలోని అశేష బడుగు బలహీన వర్గాలకు చుట్టుకోనుంది.          

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేరళను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో ఎన్.పి.ఆర్.ను బేషరతుగా తిరస్కరించాలని,  తమ రాష్ట్రంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని అసెంబ్లీలలో తీర్మానాలు అమలు చేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది. 

మానవ హక్కుల వేదిక
ఆంద్ర -తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
13 మార్చ్ 2020

Related Posts

Scroll to Top