జీరో టాలరెన్స్ లాకప్ మరణాలకు వర్తించదా!

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి వర్యులు
ఆంధ్రప్రదేశ్

అయ్యా,

గత రెండు దశాబ్దాలుగా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్న సంస్థ ‘మానవ హక్కుల వేదిక’. కుల, మత, ప్రాంత, లింగ వివక్షల వంటి అనేక అంశాల మూలంగా తలెత్తుతున్న వ్యవస్థీకృత హింసకూ, రాజ్యాధికారం ప్రజలపై చేసే హింసకూ వ్యతిరేకంగా మా సంస్థ పోరాడుతుంది. సమాజంలోనూ, పాలనా విభాగాలలోనూ ప్రజాస్వామిక పధ్ధతులు అమలు కావాలని మా సంస్థ కోరుకుంటుంది.

పై లక్ష్యాలతో పని చేసే మాకు రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో జరుగుతున్న హింస, దాని పర్యవసానంగా  జరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక ఏడాది కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురు పౌరులు పోలీసు స్టేషన్లలో మరణిoచారు. మరో ముగ్గురు పోలీసు లాకప్ లలో హింసకు గురయి బైటకి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు, మరొకరు గుండెపోటుతో మరణిoచారు.

నిరంతరం మీరు హైటెక్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతుండగా పోలీసులు మటుకూ తమదైన హింసాత్మక పద్ధతుల్లో మనుషులను కొట్టి చంపుతూనే ఉన్నారు. దర్యాప్తులో, నిందితులను అదుపులోకి తీసుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్నీ, సైన్సునూ ఉపయోగించుకోవాలని మీరు తరచూ  సూచిస్తూ ఉంటారు. మీ సూచనలను పోలీసులు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని లాకప్ లలో అనుమానితులను, ముద్దాయిలను హింసించడం, చంపడం రివాజుగా మారింది. ఈ రకమైన హింస చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అన్న విషయం మీకు తెలియంది కాదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) ఇచ్చిన ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా దర్యాప్తులు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఈ విధానాలకు మీరు అడ్డుకట్ట వేయకపోతే పోలీసు స్టేషన్లు మృత్యు కుహరాలుగా మారే ప్రమాదముంది.  అందుకే ఈ బహిరంగ లేఖ.

ఉలవపాడు ఎస్.ఐ. రమణయ్య పైశాచిక హింసకు బలైన బాబరు బాషా  

ఉలవపాడు పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయిన బాబర్ బాషా (28) కథను వింటే ఒళ్లు జలదరిస్తుంది.  ఒక కారు దొంగతనం కేసులో అక్టోబర్ 3 న విజయవాడలో పట్టుబడ్డ బాబర్ బాషాను ఉలవపాడు పోలీసు స్టేషనుకు తరలించారు. ఎస్.ఐ. వెంకటరమణయ్య పెట్టిన చిత్రహింసలకు తాళలేక అతను మరణిoచాడు.  ఆ వివరాలు రాయడం చాలా కష్టంగా ఉంది.  బాబర్ బాషా ఎలా చనిపోయాడో మేము చెప్పడం కంటే దానిపై అక్టోబర్ 10 న ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన వార్త మీరే చదవండి. 

 “ఉలవపాడు ఎస్.ఐ. వెంకటరమణయ్య బాషాను చిత్రహింసలకు గురి చేసాడు.  ఇన్నోవా కారు దొంగతనం కేసులో ఎంతకూ నిజాలు చెప్పకపోవడంతో బాబర్ బాషాను పైశాచికంగా హింసించారు.  నగ్నంగా మార్చిన బాబర్ బాషా శరీరంపై లాఠీలు ఇష్టం వచ్చినట్లు నాట్యమాడాయి.  దాంతో బాబర్ బాషా చేతులు, కళ్ళు దారుణంగా దెబ్బతిన్నాయి. లాఠీ దెబ్బలు తట్టుకోలేక మోచేయి నుంచి చేతి వేళ్ళ వరకు రెండు చేతులూ బాగా వాచిపోయాయి. రెండు కాళ్ళూ లాఠీ దెబ్బలతో తీవ్రంగా కమిలిపోయాయి.  గోళ్ళు పగిలిపోయాయి.  అయినా కుడా ఆశించిన సమాధానం రాకపోవడంతో ఎస్.ఐ. రమణయ్యలో వికృత భావాలు చెలరేగాయి.  పోలీసుల థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా అయన రాక్షసంగా వ్యవహరించారు.  వెలుగుతున్న కొవ్వొత్తి నుంచి వేడికి కరిగి కారుతున్న మైనాన్ని బాబర్ పురుషాంగం మీద, వృషణాల మీద పడేటట్టు చేసాడు.  ఎంతో సున్నితమైన ఆ మర్మాంగం పైన వేడివేడిగా కారుతూ పడిన మైనంతో బాబర్ బాషా నరకయాతన అనుభవించాడు.  అంతటితో పైశాచికత్వం చల్లారని ఎస్.ఐ. రమణయ్య మరింత క్రూరంగా ప్రవర్తించాడు.  బాబర్ మలద్వారంలోకి లాఠీని జొప్పించి మెలితిప్పడంతో హాహాకారాలు మిన్నంటాయి.  ఆ వికృత చేష్టకు మలద్వారం లోపల రక్తనాళాలు తెగిపోవడంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది.  ఇంటరాగేషన్ గది రక్తపు మడుగుగా మారింది.  ఆ రాక్షస చేష్టతో నిందితుడు బాబర్ బాషా ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.

పోలీసు వ్యవస్థలో ఇటువంటి వెంకటరమణయ్యలు ఒక రోజులో అవతరించరు. మనుషులను శారీరక చిత్రహింసలకు గురిచేయడం ఇటువంటి పోలీసు అధికార్లకు ఒక అలవాటు. ఒక దిన చర్య. బాబర్ బాషా చేసిన తప్పు ఏమిటంటే ఆ దెబ్బలు కాయలేక ‘గుండె పోటుతో చనిపోవడం’.

పై అధికార్ల అండా, రాజకీయ పాలనా యంత్రాంగం అండా ఉండకపోతే ఇటువంటి పోలీసు అధికార్లు ఈ తరహా ఘాతుకాలకు పాల్పడగలగటం అసంభవం. తామేం చేసినా రాజకీయ నేతల, ఉన్నతాధికారుల అండ, ఆమోదం లభిస్తాయనే ధీమా ఉండబట్టే రమణయ్యలు తయారవ్వడమే కాదు ఇతర పోలీసు అధికారులకు కూడా ‘స్ఫూర్తి’ అయిపోయి కూర్చుంటారు.

కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు అలవోకగా నెరుపుతున్న సీనియర్ నాయకులూ, ముమ్మారు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వహించిన వారూ అయిన మీకు ఈ థర్డ్ డిగ్రీ హింసా పద్ధతికి మన పోలీసులు ఎంతో కాలంగా అలవాటు పడ్డారని తెలియకపోదు. మరి దీనిని నిలువరించడం కోసం ఏ స్మార్ట్ నిర్ణయాలూ తీసుకోరా?

‘అసలు నేనేం తప్పు చేసానని కొట్టారో అడుగు నాన్నా’: సూసైడ్ నోట్ లో తండ్రిని కోరిన జాషువా

 చెల్లబోయిన నరేష్ కానిస్టేబుల్ ఆడు నన్ను కొట్టాడు. నన్ను ఎందుకు స్తంభానికి కట్టాడు? నేను చచ్చిపోవడానికి ఇదే కారణం. అసలు నేను చేసిన తప్పేంటి? మర్చిపోయాను ఇంకో కానిస్టేబుల్ ఉన్నాడు.  అక్కడ ఆడు కూడా కొట్టాడు…నేను చచ్చిపోయాకద నాన్నా, నా శవాన్ని పట్టికెళ్ళి వాడిని సమాధానం చెప్పమను… నా శవాన్ని వాళ్ల ఇంటికి తీసుకెళ్ళండి. వాడే సమాధానం చెప్పాలి నాకు. 

ఉత్తపుణ్యానికి పోలీసుల చేతిలో దెబ్బలుతిని, అవమానపడి ఆత్మహత్య చేసుకున్న 19 ఏళ్ల జాషువా నగదాసు రాసిన 12 పేజీల సూసైడ్ నోటులోని కొన్ని మాటలు ఇవి. నిండా ఇరవై ఏళ్లయినా నిండని జాషువాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని వెంకటాపురం గ్రామం.

జాషువా మిత్రుడూ, గౌడ కులస్తుడూ అయిన అత్తిలి రాజేష్ వీరవాసరం మండలంలోని రాయకుదురు గ్రామానికి చెందిన ఒక శెట్టి బలిజ కులస్తురాలిని ప్రేమించాడట.  తన ప్రేయసి ఊరు వెళ్దామని రాజేష్ పట్టుబట్టే సరికి జాషువా 2018 నవంబర్ 1 సాయంత్రం రాజేష్ తో పాటు రాయకుదురు గ్రామానికి వెళ్లి ఓ బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ తాగుతూ మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉన్నాడు.  అదీ జాషువా  చేసిన తప్పు. స్నేహితుడు ప్రేమించిన  అమ్మాయి తమను కొట్టిన కానిస్టేబుల్ చెల్లబోయిన నరేష్ కు వరసకు చెల్లెలు అవుతుంది. తన చెల్లెలు కోసం వేరే కులానికి చెందిన అబ్బాయి వస్తాడా అనే ఆగ్రహంతో నరసాపురం పోలీస్ స్టేషనుకు చెందిన కానిస్టేబుల్ చెల్లబోయిన నరేష్ స్నేహితులిద్దరినీ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అతనికి చేబ్రోలు నాగరాజు అనే మరో కానిస్టేబుల్ సహకరించాడు.  బాగా కొట్టిన తరువాత నరేష్ వారిద్దరినీ వీరవాసరం పోలీసు స్టేషను ఎస్.ఐ. కి అప్పగించాడు. ఎస్.ఐ గారు జాషువా తల్లిదండ్రులను పిలిపించి జాషువానీ, అతడి తల్లిదండ్రులనూ మందలించి పంపేసారు.  అంతేకానీ రాజేష్, జాషువాలను కొట్టిన కానిస్టేబుల్ నరేష్ ని వారించలేదు, మందలించలేదు. అలా కొట్టడం తప్పని ఆయనకు అనిపించనే లేదు. ఈ సంఘటనతో బాగా కలత చెందిన జాషువా 12 పేజీల సూసైడ్ నోట్ రాసి అక్టోబర్ 6 తెల్లవారు జామున ఇంటి వాకిట్లో ఉరిపోసుకుని చనిపోయాడు.  పాలకొల్లులోని గౌతం కాలేజీలో బి.కామ్. మొదటి సంవత్సరం చదువుతున్న జాషువా చదువు ఆ సుదీర్ఘ సూసైడ్ నోట్ రాయడానికి పనికి వచ్చింది.  కానిస్టేబుల్ నరేష్, నాగరాజుల ఖాకీ దుస్తులు కుల దురహంకార ప్రదర్శనకు పనికొచ్చాయి. 

జాషువా ఆత్మహత్యతో అట్టుడికి పోయిన వెంకటాపురం గ్రామస్తులు, బంధుమిత్రులు, దళిత సంఘాల వారు పెద్దెత్తున నిరసన వ్యక్తం చేసే సరికి పాలకొల్లు పోలీసులు ఆత్మహత్య ప్రేరేపించినందుకు కానిస్టేబుల్ నరేష్ మీద  ఐ.పి.సి. సెక్షన్ 342, 323, 306 R/W 34 కిందా, ఎస్.సి.ఎస్.టి.  అత్యాచార నిరోధక చట్టం-1989  సెక్షన్ 3(II)(V) కిందా కేసు నమోదు చేసారు. మరో కానిస్టేబుల్  మీద కూడా కేసు నమోదు చేసారు.  ఈ కేసు దర్యాప్తు నరసాపురం డి.ఎస్.పి. గారు చేస్తున్నారు. నరేష్ పని చేసేది నరసాపురం పోలీస్ స్టేషన్లో.  జాషువాని కొట్టింది, కొట్టుకుని తీసుకు పోయింది వీరవాసరం పోలీస్ స్టేషనుకు.  జాషువా ఆత్మహత్య చేసుకుంది పాలకొల్లు పోలీసు స్టేషన్ పరిధిలో, కేసు నమోదయ్యింది ఆ స్టేషన్ లోనే. ఈ పోలీసు స్టేషన్లన్ని నరసాపురం డి.ఎస్.పి. గారి సబ్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. అదే సబ్ డివిజన్ డి.ఎస్.పి.కి కేసు అప్పగిస్తే దర్యాప్తు సక్రమంగా సాగే అవకాశం ఉందా మీరు ఆలోచించండి. సక్రమంగా జరిగి ఉంటే కానిస్టేబుల్స్ నరేష్, నాగరజులను ఈపాటికి అరెస్ట్ చేసి ఉండే వారు.  జాషువా  మరణించి నెల గడుస్తున్నా వారిని ఇంత వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. 

‘ఆత్మహత్య’ చేసుకోవడానికి ముద్దాయిలు పోలీసులకు లొంగిపోతారా?! అచ్యుతాపురం స్టేషన్లో జరిగిందదే

విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో చీమలాపల్లి గ్రామానికి చెందిన పారిపల్లి రామునాయుడు (60) ఏప్రిల్ 24, 2018 నాటికి హుషారుగానే ఉన్నాడు. తమ ఊళ్ళో సంచలనాత్మకంగా మారిన పెంట అప్పారావు హత్య కేసులో రామునాయుడు ముద్దాయి.  ఏప్రిల్ 3న జరిగిన ఈ హత్య కేసులో అతనితో పాటు మరో నలుగురిపై ఎఫ్.ఐ.ఆర్. (క్రైమ్ నం. 48/2018) నమోదైంది. రామునాయుడు ఏప్రిల్ 24న గ్రామ వి.ఆర్.ఓ.తో కలిసి వెళ్లి అచ్యుతాపురం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.  లొంగి పోయాడన్న విషయాన్ని పోలీసులే ఒప్పుకుంటున్నారు. యలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.విజయనాథ్ ఈ హత్యకేసులో దర్యాప్తును చేపట్టారు. ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం సి.ఐ గారినీ, ఇతర దర్యాప్తు బృంద సభ్యులనూ హత్య జరిగిన ప్రదేశానికి రామునాయుడు తీసుకువెళ్ళాడు. అప్పారావు మృత దేహాన్ని తగలబెట్టడానికి తాను వాడిన ఆయిలు డబ్బాను రామునాయుడు దర్యాప్తు బృందానికి చూపించాడు.  హత్య జరిగిన సమయంలో మృతుడు అప్పారావు పడుకున్న మంచం కూడా చూపించి, హత్య జరిగిన తీరును అదే మంచం మీద పడుకుని మరీ సి.ఐ. గారికి ప్రదర్శించాడు.  ఈ మొత్తం సన్నివేశాన్ని పోలీసులు వీడియో రికార్డు కూడా చేసారు. 

స్వయంగా పోలీసులకు లొంగిపోయి దర్యాప్తు బృందానికి సంఘటనా స్థలాన్ని చూపించడమే కాకుండా హత్య జరిగిన తీరును ఉత్సాహంగా నటించి చూపించిన రామునాయుడు ఆ మర్నాడే ఉదయం 5.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల కధనం ప్రకారం, ఆవేళ రామునాయుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి స్టేషన్ లోపలున్న బాత్రూమ్ లోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళిన రామునాయుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి పోలీసులు తలుపు బలవంతంగా తోసి చూశారు. కొబ్బరితాడుకు వేళ్ళాడుతున్న రామునాయుడుని చూసి వారు హతాశులయ్యారు. హుటాహుటిన అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి ఉషా ప్రైమ్ కి తరలించారు. అతను చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. అనకాపల్లి డి.ఎస్.పి ఎ.వి. రమణ కేసు విచారించగా ఆర్.డి.ఓ. సూర్యకళ సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.

రామునాయుడు మరణించిన తీరు మాత్రమే కాదు ఈ కేసులోవిచారణ జరిగిన తీరుపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి.

i) అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కు విషయ సేకరణకు వెళ్ళిన మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందానికి రామునాయుడు ఎలా మరణించిందీ చెబుతూనే అతడి హత్య కేసులో తాము చేపడుతున్న దర్యాప్తు తీరుతెన్నుల గురించి కూడా దర్యాప్తు అధికారి కె.వి.వి. విజయనాథ్ గారు పూసకుగుచ్చినట్లు వివరించారు. తాము ఏయే లీడ్స్ తీసుకుంటున్నదీ, ఏయే సాక్ష్యాలు స్వీకరిస్తున్నదీ, వేటిని వదిలేస్తున్నదీ, ఏ డిఫెన్సు తీసుకుంటున్నదీ వంటి వివరాలనెన్ని౦టినో చెప్పుకొచ్చారు. అప్పారావు హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సి.ఐ. గారే రామునాయుడు లాకప్ మరణం కేసును కూడా దర్యాప్తు చేసేసారు. పోలీసులకు హత్యా స్థలాన్ని చూపెడుతున్న రామానాయుడు వీడియోను సి.ఐ.గారు హెచ్.ఆర్.ఎఫ్. నిజనిర్ధారణ బృందానికి చూపించారు.  ఆ వీడియోలో ఆయన కూడా కనిపించారు. ఆకేసులో ఆయన ఎంత కూరుకుపోయారో దీన్ని బట్టి అర్ధమౌతుంది. ‘అప్పారావు హత్య కేసులో దర్యాప్తు అధికారినైన నేను సహజంగా రామునాయుడు లాకప్ మరణం కేసులో అనుమానితుడిని అవుతానుకదా, రామునాయుడు లాకప్ మరణం కేసులో నేనుకలుగ చేసుకోవడంఏమిటీ’ అనే మౌలికమైన ప్రశ్న ఆ సి.ఐ. గారు వేసుకోలేదు. రామునాయుడు లాకప్ మరణం కేసులో దర్యాప్తు ఎన్.హెచ్.ఆర్.సి. ఆదేశిక సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా జరిగిందన్నది సుస్ఫష్టం.    

ii) ఆత్మహత్య కధను  రక్తి కట్టించే ప్రయత్నంలో పోలీసులు కొంత మంది ప్రత్యక్ష సాక్షులను పక్కనబెట్టారనీ, మరి కొంత మందిని చొప్పించారనీ సి.ఐ. విజయనాథ్, రామునాయుడు కొడుకుల మాటలను బట్టి మాకు అర్ధమయ్యింది.  రామునాయుడుతో పాటు మిగిలిన నలుగురు ముద్దాయిలు కూడా ఏప్రిల్ 24/25 తేదీల్లో అచ్యుతాపురం పోలీసు లాకప్ లోనే ఉన్నారన్న విషయాన్ని రామునాయుడు కుటుంబసభ్యులు మాకు చెప్పారు.  మిగిలిన నలుగురు ముద్దాయిలను స్టేషన్లోనే ఉంచిన విషయాన్ని పోలీసులు దాచిపెడుతున్నారు. ఆ నలుగురు లాకప్ లో ఉన్న విషయం స్టేషన్ రికార్డులలో లేకుండా జాగ్రత్త పడ్డారు. రామునాయుడు ప్రాణాలతో ఉండగా చూసిన ఆఖరు వ్యక్తంటూ ఉష ప్రైమ్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ ని చూపించారు. తాము కాకుండా ఒక స్వతంత్రమైన ప్రత్యక్ష సాక్షిని పుట్టించాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఈ పనికి పాల్పడినట్టు అర్ధమవుతోంది.

ముద్దాయిని ఒక రకంగా, ముద్దాయి మేనమామను మరో రకంగా చంపేశారు       

కర్నూలు జిల్లాలో కల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ షబ్బీర్(25)ను దొంగతనం చేసాడనే నేరారోపణతో కర్నూలు త్రీ టౌన్ పోలీసులు 2018 ఆగస్టు 21న అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి అతని భార్య ఫాతిమాబీ పోలీసు స్టేషనుకు వెళ్లి వాకబు చేసింది. అతడి మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పి ఆమెను పోలీసులు పంపేసారు. కానీ మరుసటి రోజుకల్లా షబ్బీర్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో శవమై తేలాడు. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు చదువుకోలేదు. నలుగురు పిల్లలు. 

డబ్బులు ఇస్తామనీ, గొడవ చెయ్యొద్దనీ మధ్యవర్తుల ద్వారా చెప్పించి తమను రాజీకి ఒప్పించారని షబ్బీర్ భార్య ఫాతిమాబీ మానవ హక్కుల వేదిక సభ్యులకు తెలిపారు. అంతే కాకుండా ఖాళీ కాగితాల మీద ఫాతిమాబీ, సయ్యద్ షబ్బీర్ మేనమామ వలీ బాషాల చేత పోలీసులు సంతకం చేయిoచుకున్నారు. పోలీసులు మూడు గంటలపాటు నిర్బంధించి బెదిరించడంతో తీవ్ర ఆందోళనకు గురయిన వలీబాషా  ఆగస్టు 23న గుండెపోటుతో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రోజులు తిరిగకుండా పోలీసుల దాష్టీకానికి బలయ్యారు.  కోర్టులో నేరం రుజువయినా కూడా  షబ్బీర్ కి మరణ శిక్షపడేది కాదు.  అతన్ని చంపడమే పరమ దుర్మార్గం అనుకుంటే అసలు ఏ నేరం చేయని వలీ బాషాను పొట్టన పెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి? మాబోటి చాలామందికి ఇది అన్యాయం అనిపిస్తోంది.  మీ పోలీసు ఉన్నతాధికారులకు ఎందుకు అనిపించడం లేదు? చీమ చిటుక్కుమంటే ఆ వార్త మీ చెవిన పడేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకున్న ఆధునిక ముఖ్యమంత్రి మీరు. మీ దృష్టికి ఈ విషయమే రాలేదా?  వచ్చీ గమ్మున ఉన్నారా?

గుట్టుచప్పుడు కాకుండా పైడిరాజు శవదహనం

థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించడంలో తమకున్న నైపుణ్యం చాలక కాబోలు విశాఖపట్నం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సి.సి.ఎస్.) పోలీసులు ఆ కళలో ఆరితేరిన రిటైర్డ్ కానిస్టేబుల్ విజయకుమార్ ను రప్పించి మరీ విజయనగరానికి చెందిన గొర్లె పైడిరాజు (26)ను సెప్టెంబర్ 10 న కొట్టి చంపారు. రిటైర్డ్ కానిస్టేబుల్ విజయకుమార్, సి.ఐ. దుర్గాప్రసాద్, ఎ.సి.పి లు ముగ్గురూ కలిసి కొట్టి చంపారనే వార్త సెప్టెంబర్ 11 కల్లా నగరంలో గుప్పుమంది. ఆ ముగ్గురూ  పైడిరాజుకి పెట్టిన నరక యాతన చూసి భరించలేకపోయిన తోటి పోలీసులే విలేఖరులకు ఆ వివరాలు తెలిపారని వినికిడి. అంతే కాదు, పోలీసులు అర్ధరాత్రి శవాన్నిజీపులో ఎక్కించి నగరంలోని సరస్వతీ పార్కు సెంటర్ వద్దకు తీసుకుపోయి అక్కడ వదిలిoచుకోవడానికి ప్రయత్నించారు. ఆ రోజు సరస్వతీ పార్కు వద్ద అర్ధరాత్రి కుడా మనుషుల అలికిడి ఉండటంతో పోలీసులు అక్కడ నుండి వెనక్కి మళ్ళారు. సరస్వతీ పార్కు చుట్టూ ఉన్న దుకాణాలలో, అపార్ట్మెంట్లలో రికార్డు అయిన సి.సి. కెమెరాల ఫుటేజీని పోలీసులు వినాయక చవితి నాడు అంటే సెప్టెంబర్ 11న తొలగించారు.  విశాఖ నగరంలోని పండా వీధిలో ఉంటున్న పైడిరాజు భార్య కుమారిని రప్పించి ప్రలోభాలకు గురిచేసారు. పైడిరాజు మృతదేహాన్ని సి.సి.ఎస్. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు కారులో స్మశానానికి తరలింఛి చీకటి తెరలు ఇంకా పూర్తిగా తొలగకుండానే నగరంలోని చావులమదుంలో తగలబెట్టేసారు. వారి నిర్వాకాన్ని ఆ రకంగా చీకటి మాటున ఉంచేయాలని అనుకున్నావిలేఖరుల ముక్కుపుటాలకు ఆ కారు వాసన తగలనే తగిలింది. విషయం బైటకు పొక్కి ప్రజా సంఘాలు నిజ నిర్ధారణకు పూనుకోగానే పోలీసులకు ఇలాంటి విషయాలలో ఎప్పుడూ సహకారం అందించే వైష్ణవి నర్సింగ్ హోం నుండి పైడిరాజుది సహజ మరణమేనని డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు.

ఈ కేసులో పోలీసుల అధికారిక కధనమేమిటో చూడండి. తెల్లవారితే 2018 సెప్టెంబర్ 10న పాత నేరస్తుడైన పైడిరాజు ఎం.వి.పి. కాలనీలో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 10 భారత్ బంద్ కనుక అతన్ని తమ కస్టడీలో నుండి విడుదల చేసేసారు. పండా వీధిలో నివసించే అతని భార్య కుమారిని రప్పించి స్వంత పూచీకత్తు మీద అతడిని ఆరోజే పంపించేసారు.  అయితే ఆ తరువాత అతనికి ఆరోగ్యం బాగోకపోయే సరికి అతని భార్య ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకునిపోగా అతను అక్కడ మరణించాడు.  పైడిరాజు మృతి విషయమై హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ రిట్ పిటిషను నo. 33769/ 2018 కేసులో పోలీసులు ఇచ్చిన సమాధానమిది.  అంతేకాదు, తన భర్త పైడిరాజు చికిత్స పొందుతూ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించాడని కుమారి పేరిట ఒక అఫిడవిటు దాఖలు చేసారు పోలీసులు.  ఆమెను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించగా పోలీసులు ముందు ఆమెను తాసిల్దారు ముందు హాజరు పరిచారు.  “పైకి కనిపిస్తున్నoత తేలికైన విషయంగా అనిపించడం లేదు. మేము మా ముందు హాజరుపర్చమంటే ఆమెను తాసిల్దారు ముందు ఎందుకు హాజరుపర్చారు?” అని హైకోర్టు న్యాయమూర్తులు పోలీసులను ప్రశ్నించి కుమారిని కోర్టులో హాజరుపర్చమని అడిగారు.  పోలీసులు ఆమెను హైకోర్టులో హాజరుపరిచారు. పోలీసుల భయంతో కావచ్చు, ప్రలోభాలకి లొంగి కావచ్చు ఆమె అఫిడవిటులో ఉన్న విషయాన్నే కోర్టు వారికి విన్నవించుకుంది. ఈ కారణంగా పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అయితే హెబియస్ కార్పస్ రిట్ పిటిషను వేసిన పిటిషనరుకి తగిన సాక్ష్యాధారాలు లభిస్తే కనుక సంబంధిత  కోర్టులో పరిష్కారాన్ని కోరవచ్చునని తెలిపింది.

పైడిరాజును చంపేసిన సి.సి.ఎస్. పోలీస్ స్టేషన్, శవాన్ని పడేద్దామనుకున్న సరస్వతీ పార్కు , చివరకు దాన్ని తగలబెట్టిన చావులమదుం స్మశానం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో లేవు.  తమరు ఎల్.ఈ.డీ లైట్లూ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎంతో మురిపెంతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్న విశాఖపట్నం నడిబొడ్డునే ఉన్నాయి. జిగేల్మని మెరిసే ఈ మహానగరి కాంతి పుంజాలలో పైడిరాజు రక్తపు మరకలు కూడా రంగరించి పోసారు విశాఖ పోలీసులు. ఈ ప్రాంతాలన్నిటా పైడిరాజు మృత్యువు చారికలు ఉండటం మీకు సమ్మతమేనా? సాక్ష్యాలు దొరికితే ఇప్పటికీ మించిపోయింది లేదు, కేసు నమోదు చేయవచ్చని  హైకోర్టు తెలిపింది. మీరు కనుక నిష్కర్షగా ఉండదలిస్తే కేసును తిరగదోడవచ్చు. విచారణ జరిపించవచ్చు. సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి పైడిరాజు హంతకులపై క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసు ఉన్నతాధికారులను అదేశించవచ్చు. ఆపని చేస్తారని మేము ఆశించవచ్చా?

కేసు పెట్టి మృతుని భార్యను వేధిస్తున్న డోన్ ఎస్.ఐ.

కర్నూలు జిల్లాలో డోన్ కు చెందిన పి.వరదరాజులు, అతని భార్య సుజాత తోపుడు బండి మీద వేరుసెనక్కాయలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వరదరాజులుకీ, మరి కొంత మంది తోపుడు బళ్ల వ్యాపారులకు మధ్య గొడవలు జరిగాయి.  పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు.  ఈ గొడవలు వారికే పరిమితమై వుంటే ఎలా ఉండేదో.  డోన్  సి.ఐ., ఎస్.ఐ., ఏ.ఎస్.ఐలు రాజకీయ పలుకుబడికి లోబడి ప్రత్యర్ధుల పక్షం వహించి వరదరాజులునీ, అతని భార్యనూ వేధించడం మొదలుపెట్టారు. పోలీసులు తమను వేధిస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషనుకు(ఎస్.హెచ్.ఆర్.సి.) వరదరాజులు ఫిర్యాదు చేసాడు. ఈ కేసులో డోన్ డి.ఎస్.పి., జిల్లా ఎస్.పి తమ క్రింది పోలీసు అధికార్లను వెనకేసుకు వచ్చారు.  ఎస్.హెచ్.ఆర్.సి. కేసు కొట్టేసింది.  ఆ తరువాత వరదరాజులు భార్య సుజాత మాటల్లో చెప్పాలంటే “డోన్ ఎస్.ఐ వి.శ్రీనివాసులు మా ప్రత్యర్ధుల తరఫు వ్యక్తిలాగా  రెచ్చిపోయి నా భర్త వరదరాజులును పోలీస్ స్టేషన్ ఆవరణలో, అందరి సమక్షంలో అవమానపరుస్తూ తిట్టాడు, కొట్టాడు. దీనితో  నా భర్త 10 డిసెంబర్ 2017 తేదిన యాసిడ్ తాగి, వైద్య సేవలు పొందుతూనే కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు.” 

సుజాత తన భర్త వరదరాజులు మృతికి కారణమైన ఎస్.ఐ శ్రీనివాసులుపై కేసు నమోదు చేసింది. ఫలితంగా  ఆమెపై వేధింపులు పెరిగాయి. సుజాత పోలీస్ అధికార్లపై ఆరోపణలు చేసి ఊరుకోవడం లేదు,  మీ ప్రభుత్వాన్ని కూడా తప్పు పడుతున్నారు.  ఎస్.హెచ్.ఆర్.సి.కి పెట్టుకున్న మరో విన్నపంలో సుజాత “ నా భర్త మృతిపై, డోన్ ఎస్.ఐ వి.శ్రీనివాసులు దౌర్జన్యానికి పాల్పడడం విషయమై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మా కుటుంబంపై క్రిమినల్ కేసులు బనాయించడం దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తున్నాం” అని అన్నారు. దుర్బలులకు ఆసరాగా నిలబడి ఆదరణ చూరగొనాలని మీ సహచర నేతలకూ, అధికారులకూ హితవు పలుకుతుంటారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఉపదేశిస్తూ ఉంటారు. అవన్నీ సుజాత విషయంలో ఎందుకూ కొరగానివి అయిపోయాయి. మీ సహచరులూ, అధికారులూ సరే మీరయినా సుజాత లాంటి వారికి జవాబుదారీ కాగలరా?  అసలు ఎస్.ఐ. శ్రీనివాసులుపై మీ ప్రభుత్వమే కేసు నమోదు చేసి ఉండాల్సింది.  తమ నేతృత్వం లోని  ప్రభుత్వం చేయాల్సిన పని ఒక సామాన్యురాలైన సుజాత చేసారు.  ఇప్పటికైనా సుజాత కోరిన విధంగా డోన్ ఎస్.ఐ. శ్రీనివాసులును సస్పెండ్ చేసి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆమెకు, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని ఈ బహిరంగ లేఖ ద్వారా మేము మిమ్మల్ని వేడుకుoటున్నాం.

ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పోలీసుల హింసను బైట పెట్టిన గోపిరాజు

ఈ ఏడాది అక్టోబర్ 30 నాడు గుంటూరు జిల్లా మంగళగిరి శివారు రత్నాలచెరువు ప్రాంతంలో బూసిరాజు గోపిరాజు (22) అనే యువకుడు ఫ్యాన్ కి వేలాడ తీసుకుని ఉరి పోసుకున్నాడు. ఆత్మహత్యకి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని అందులో పోలీసులు తననీ, తన తల్లినీ దొంగతనం నేరం ఆపాదించి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేశారనీ, కులం పేరుతొ దూషించారనీ, ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాననీ వివరించాడు.

మంగళగిరి శివారు రత్నాలచెరువు వద్ద నివసించే చాకలి కులస్తుడైన బూసిరాజు గోపిరాజు (22) ఆటోనగర్ ప్రాంతంలో ఒక పరుపుల కంపెనీలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. తన తల్లి తండ్రులు ఇద్దరూ చాకలి పని చేసుకునే జీవనం గడుపుతున్నారు. గోపిరాజుకి ఇద్దరు చెల్లెళ్ళు. వారిలో ఒకరికి వివాహం అయ్యింది. గోపిరాజు ఆత్మహత్యకి కొన్ని రోజుల ముందు ఓ మద్యాహ్నం అతడి తల్లి లక్ష్మి ఇస్త్రీ బట్టలని అందజేయడానికి  పక్క వీధిలో ఉంటున్న స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకుడు, ఆ ప్రాంతంలో రెండో మూడో  కిరాణా  దుకాణాల యజమాని అయిన ఒడిసే సురేష్ ఇంటికి వెళ్ళింది. రెండంతస్తుల ఇల్లది. పై అంతస్తులో సురేష్ కుటుంబం నివసిస్తుంది. ఆ  ఇంటి కింది అంతస్తులో ఉన్న దరిదాపు ఇరవై మగ్గాల మీద  సురేష్ స్వంత కులస్థులైన పద్మశాలీలు చీరలు నేస్తుంటారు. పై అంతస్తులోని ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇస్త్రీ బట్టలు బయట పెట్టి లక్ష్మి వెళ్ళిపోయింది.

ఒడిసే సురేష్ తమ ఇంట్లో సుమారుగా రెండు లక్షలు విలువ చేసే 60 గ్రాముల బంగారం పోయిందని, తనకి ఆ రోజు బట్టలు ఇవ్వటానికి వచ్చిన బూసిరాజు లక్ష్మి మీదే అనుమానంగా ఉందని 2018 అక్టోబర్ 27 నాడు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు. రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించకుండా పోలీసు  స్టేషనులోనే  కానిస్టేబుల్ దాలి నాయుడు లక్ష్మిని పిలిపించటం జరిగింది.  విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన గోపిరాజుని, లక్ష్మిని పోలీసులు దూషించారు. అక్కడే కాకుండా ఒడిసే సురేష్ ఇంటి దగ్గర కూడా కులం పేరు మీద వీరిని దూషించారు. ఇది జరిగాక సోమవారం నాడు ఉదయం 7 గంటల సమయానికి పోయిన బంగారం సురేష్ ఇంటి మెట్ల మీద దొరికింది. అయితే దొరికిన దాoట్లో ఒక ఆభరణం లేకపోవటం, ఆ విషయానికి సంబంధించి మళ్ళీ తనని ఎక్కడ హింసిస్తారో అన్న భయాందోళనలతో మరుసటి రోజు, అనగా 2018 అక్టోబర్ 30 మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బూసిరాజు గోపిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి తన ఆత్మహత్యకి కారణాలు అందులో పేర్కొన్నాడు. గోపిరాజు ఆత్మహత్య అనoతరం ఎస్.ఐ. కృష్ణా రెడ్డి చేత స్వచ్చంద పదవీ విరమణ చేయించారు. దాలి నాయుడుని సస్పెండ్ చేసారు.  ఇద్దరి మీద శాఖాపరమైన విచారణ జరుగుతోంది. ఇతర కేసులతో పోల్చితే ఇది కొంత మేలే కాని శాఖాపరమైన విచారణతో జరిపి సరిపుచ్చారు.  కేసు నమోదు చేయలేదు. బూసిరాజు గోపిరాజు సెల్ఫీ వీడియోని మరణవాంగ్మూలంగా పరిగణనలోకి తీసుకుని అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసుని ఐ.పి.సి. 306 కిందకి మార్చి ఆత్మహత్యకి పురిగొల్పిన అభియోగం మీద ఒడిసే సురేష్, దాలి నాయుడుల మీద కేసు నమోదు చెయ్యాలని కోరుతున్నాం.

 ఈశ్వర రావు చావులో పట్టాలు  తప్పిన దర్యాప్తు   

2018 నవంబర్ 16 తేది రాత్రి సామర్లకోట పోలీస్ స్టేషన్ నుండి తరలిస్తుండగా ఈశ్వరరావు పారిపోయి రైల్వే ట్రాక్ పై ప్రమాదం బారిన పడ్డాడని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అంటున్నారు. అయితే అదే రోజు తాము ఈశ్వరరావును రాజమహేంద్రవరం జీ.ఆర్.పి. పోలీసు స్టేషనులో చూసామని మర్నాడు ఈశ్వరరావు మృతదేహం ఉన్న కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు అన్నారు. ఈశ్వరరావు చనిపోయింది జీ.ఆర్.పి. పోలీసు స్టేషనులోనా రైల్వే ట్రాక్ పైనా అనేది తెలుసుకోవడం అంత  కష్టమైన పని కాదు. ఈశ్వరరావు భార్య బలహీనురాలు. ఇద్దరు ఆడపిల్లల తల్లి.  ఏమి అడగగలదు?  వత్తిళ్ళకు ఏమి తట్టుకోగలదు? వైద్య పరీక్ష చేసిన మెడికల్ ఆఫీసరుని పిలిపించి అడిగితే తేలిపోతుంది. ఈశ్వరరావు పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయాడా రైలు కింద పడి చనిపోయాడా అన్న విషయాన్ని మీరే తేల్చగలరు.

పోలీసు వ్యవస్థలో ఏ మార్పులు రావాలి?

1.బాబర్ బాషా హత్య తరహా కేసుల్లో సంబంధిత పోలీసు అధికార్లపై ఐ.పి.సి. సెక్షన్ 302 కింద (హత్యానేరం) కేసు నమోదు చేయించండి.  ఈ ఏడాది జరిగిన లాకప్ మరణాల కేసుల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఈ సెక్షను  కింద కేసు నమోదు కాలేదు.  వరదరాజులు భార్య సుజాత పెట్టిన కేసులో సత్వరం దర్యాప్తు జరిపించండి.    

2.సి.ఆర్.పి.సి. సెక్షన్ 176 (1A) ప్రకారం లాకప్ మరణాల కేసుల్లో విచారణ చేయవలసింది జ్యూడీషియల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు.  పై కేసుల్లో ఏ ఒక్క దాంట్లో కూడా మన అధికార్లు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ చేత విచారణ చేయించలేదు.  జిల్లా కలెక్టర్లతో  జరిపే వీడియో కాన్ఫరెన్సులలో ఈ బాధ్యతను వారికి మీరు గుర్తు చేయండి. ఇంత ముఖ్యమైన చట్టపరమైన బాధ్యతను విస్మరించినందుకు వారిని అభిశంసించండి. ఇది జీవించే హక్కుకి సంబంధించిన విషయం. మరోసారి ఈ తప్పు జరిగితే విభాగపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పండి.      

3.ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు వారు తీసుకోవాల్సిన చర్యల గురించి సుప్రీంకోర్టు డి.కె. బసు కేసులో (1997) కొన్ని మార్గదర్శక సూత్రాలను పేర్కొంది. పైన మీ పరిశీలనకోసం వివరించిన కేసులను చూస్తే ముఖ్యమైన ఆ మార్గదర్శకాలను మన పోలీసులు అనుసరించడం లేదని స్పష్టమవుతోంది.  పోలీసు స్టేషన్లు సురక్షిత ప్రదేశాలు కావాలంటే మీరు వాటిని వెంటనే అమలు పరచాలి.

4.పోలీసు వ్యవస్థ సంస్కరణ కోసం సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో (2006) మరికొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది.

మొదటిది- శాంతి భద్రతల కోసం ఒకటీ, దర్యాప్తు కోసం మరొకటీ ఉండేలా వేర్వేరు విభాగాలను ఏర్పరచడం . దీని వల్ల దర్యాప్తు మరింత సమర్ధవంతంగా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనిని అమలయ్యేలా చూడండి.   

రెండవది- పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం.  పోలీసుల ప్రమోషన్లలో, బదిలీలలో రాజకీయ జోక్యం లేకుండా ఉండటం కోసం ఈ విలువైన ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు.  ఇతర రాష్ట్రాలు చేయకపోయినా మీరు మన రాష్ట్రంలో ఈ బోర్డు స్థాపించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవండి. 

మూడవదీ అన్నిటికంటే ముఖ్యమైనదీ- రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని స్థాపించడం. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు న్యాయమూర్తీ, జిల్లా అథారిటీకి రిటైర్డ్ జిల్లా జడ్జీ సారధ్యం వహిస్తారు. ఈ సంస్థలోని మిగిలిన సభ్యుల జాబితాను ప్రభుత్వమే సిద్ధం చేసినా దాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖరారు చేయాలి. పోలీసులు హత్య చేసారనో, అత్యాచారం చేసారనో, తీవ్రంగా గాయాల పాలు చేసారనో వచ్చే  ఫిర్యాదులను రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ స్వీకరించాలి.  భూకబ్జాలు, మామూళ్ళు వసూళ్లు , అధికార దుర్వినియోగం వంటి ఇతర నేరాలను జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ స్వీకరించాలి. ఫిర్యాదులు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనీ , క్రిమినల్ కేసులు పెట్టాలనీ పోలీసు కంప్లైంట్ అథారిటీలు సిఫార్సు చేస్తే వాటిని ఆయా అధికార్లు అమలు చేసి తీరాల్సిందే. 

నాలుగు నెలల్లోగా రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని స్థాపించి తీరాలని మన రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది జనవరి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అథారిటీనయితే  స్థాపించింది కానీ దానిని చాలా గోప్యంగా ఉంచింది. పాలనలో పారదర్శకత మీ విధానంగా చెప్పుకునే మీరు దీనిని గోప్యంగా ఉంచడాన్ని ఏ విధంగా సమర్ధించుకోగలరు?

5. హైటెక్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆహ్వానించ తగినదే: చిత్తశుద్ధితో అమలు చేయండి  

అ) ప్రతి పోలీస్ స్టేషన్లో సి.సి.టి.వి. కెమెరాలు పెట్టాలనే ఆలోచన చాలా మంచిది.  ఆ పని వీలైనంత త్వరగా చేయండి.  మరీ ముఖ్యంగా ఈ కెమెరాలు లాకప్ లలో , ఇంటరాగేషన్ రూములలో పెట్టించండి.     

ఆ) హైటెక్ అయితే సరిపోదు, పోలీసులకు రాజ్యాంగ విలువలను గౌరవించడం నేర్పండి.  అది పై అధికార్ల నుండి కానిస్టేబుల్స్ వరకూ అందరికి అవసరమే. దర్యాప్తు అంటే మనుషులను చితకబాదటం కాదు దానికి శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని వారికి అర్ధమయ్యేటట్లు చెప్పండి.

6. చివరిగా, లాకప్ మరణాల కేసుల్లో ముద్దాయిలు ఖాకీ దుస్తుల్లో ఉన్నవారు.  నిందితులు ఖాకీ దుస్తుల్లో ఉన్నంత మాత్రాన అవి నేరాలు కాకుండా పోవు. ప్రభుత్వ అధికార్లు ఎవరు నేరం చేసినా అంతిమంగా ప్రభుత్వమే జవాబుదారీ అవుతుంది. కూపీ లాగడానికి పోలీసులు హింసాత్మకపద్ధతులకు దిగడం, దిగకపోవడం అన్నది అధికారంలో ఉన్న వారి దృక్పధం లేదా అనుమతి మేరకే జరుగుతుందన్నది మీకు తెలియంది కాదు. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా మీరు ఇటువంటి దృక్పధాన్ని ప్రోత్సహించబోరని మేము ఆశిస్తున్నాం. మీకు సమర్పిస్తున్న ఈ లేఖ ప్రతిని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి కూడా పంపుతున్నాం.

                                                                మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
10.12.2018  

Scroll to Top