జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఏ.బి.వి.పి. గుండాలు చేసిన దాడి అమానుషం

జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఆదివారం రాత్రి  ఏ.బి.వి.పి. గుండాలు చేసిన అమానుష దాడిని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) తీవ్రంగా ఖండిస్తోంది.ముసుగులు ధరించిన రౌడీ మూకలు ఇనప రాడ్లు, హాకీ స్టిక్స్, ఇటుకలతో విశ్వవిద్యలయం లోపలికి చొరబడి విద్యార్ధులపై దాడి చేసి, మహిళా విధ్యార్ధినుల హాస్టల్స్ లోకి చొరబడి మహిళా విధ్యార్ధినులను చితకబాది, అడ్డమొచ్చిన విశ్వవిద్యాలయ అధ్యాపకుల తల పగలగొట్టి కాంపస్ అంతటా స్వైరవిహారం చేస్తున్నప్పటికీ క్యాంపస్లోనే వున్న ఢిల్లీ పోలీసులు, అక్కడి సెక్యూరిటి సిబ్బంది చూస్తూ ఉండిపోయారు కాని ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం, రౌడీ మూకలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు.  టివి చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఈ దాడిని పోలీసులు దగ్గరుండి కొన్ని గంటలపాటు కొనసాగనిచ్చారు.  పోలీసులు మూకలను అదుపులోకి తీసుకునే బదులు వారిని సునాయాసంగా కాంపస్ నుండి తప్పుకోనిచ్చారు.

విశ్వవిద్యాలయ యాజమాన్యం, పోలీసుల సహకారం లేకుండా ఈ దాడి సాధ్యం కాదని మేము భావిస్తున్నాం.  తమ విద్యార్ధులపై ఇంతటి అమానవీయ దాడి జరుగుతుంటే విశ్వవిద్యాలయం యాజమాన్యం వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు.  విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మామిడాల జగదీశ్ కుమార్ కాంపస్ కు వెళ్లక పోగా ఈ విషయం గురించి ఇంత వరకు నోరు మెదప లేదు.  ఈ దాడి పట్ల జె.ఎన్.యు. యాజమాన్య ధోరణిని, వారి సమర్ధనను హెచ్.ఆర్.ఎఫ్. ఖండిస్తోంది. 

ఇంతకీ జె.ఎన్.యు. విద్యార్ధులపై ఈ కిరాయి మూకలకు, యాజమాన్యానికీ,  బిజెపి ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపం?  పెంచిన ఫీజులను తగ్గించాలని గత కొన్ని నెలలుగా వారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు.  నూతన ఫిస్ట్రక్చర్  జె.ఎన్.యు. విశ్వవిద్యాలయ స్వరూపాన్నే మార్చేస్తుందని, అలా జరగకూడదని వారు భావిస్తున్నారు.  ఒక జె.ఎన్.యు. లోనే కాదు విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, విద్యావ్యాపారం మన దేశంలో తగదని వారి నమ్మకం.  ఇది ఒక న్యాయమైన డిమాండుగా మేము భావిస్తున్నాం.  జె.ఎన్.యు.లోనే కాదు దేశవ్యాపితంగా విద్య ప్రైవేటీకరణను హెచ్.ఆర్.ఎఫ్. వ్యతిరేకిస్తుoది.  ఇంతటి నిర్బంధాన్ని ఎదుర్కుంటూ సుదీర్ఘకాలం పాటు నిర్భయంగా ఒక న్యాయమైన పోరాటం సాగిస్తున్న జె.ఎన్.యు. విద్యార్ధులకు మా మద్దతు తెలియ చేస్తున్నాం. ప్రజలు కూడా వారికి అండగా నిలవాలని కోరుతున్నాం. 

దాడిలో పాల్గొన్న వారిని, వారికి సహకరించిన వారిని శిక్షించాలని హెచ్.ఆర్.ఎఫ్.డిమాండ్ చేస్తోంది. 

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
06 జనవరి 2020

Related Posts

Scroll to Top