కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం వైద్యులకు కావలసినన్ని ఎన్-95 మాస్క్ లు సమకుర్చలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ రావును సస్పెండ్ చేయడం తొందరపాటు చర్యని, ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలనిమానవ హక్కుల వేదిక (Human Rights Forum, HRF) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. విశాఖపట్నం జిల్లానర్సీపట్నంలో 150 పడకల ఏరియా ఆస్పత్రిలో గత 20 ఏళ్లుగా అనెస్థటిస్ట్ గాపని చేస్తున్న డాక్టర్ సుధాకర్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయడమే కాదు ఆయనపై అన్యాయంగా నమోదు చేసిన క్రిమినల్ కేసును కూడా ఎత్తివేయాలనికోరుతున్నాం.
ఎన్ 95 మాస్క్ లు, ఇతర రక్షక సదుపాయాలు (పి.పి.ఇ.) కొరత రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాపితంగా ఉంది. పి.పి.ఇ.లు లేక దేశ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వైద్యులు కరోనా వ్యాధి బారిన పడ్డారు. అటువంటి పరిస్థితులలో డాక్టర్ సుధాకర్ రావు లాంటి వైద్యులు భయపడటం అతి సహజం. ఆ భయానికి భౌతిక పునాదులు ఉన్నాయి. డాక్టర్ సుధాకర రావు భావావేశంలో మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఆ వీడియో క్లిప్పింగ్ ని చుస్తే అర్ధమోపుతుంది. భయంతో కూడిన ఆ ఆగ్రహాన్ని సానుభూతితో అర్ధం చేసుకోకుండా ప్రభుత్వం ఇంత అసహనం వ్యక్తం చేయడం తగదు.
కరోనా వ్యాధి విసురుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, పాలనాయంత్రాoగం, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, మీడియా, సామాన్య పౌరులు అందరూ కలిసి పని చేస్తేనే ఫలితముంటుంది. ఎవరి వంతు బాధ్యత వారు సక్రమంగా నెరవేర్చడానికి రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధిని ప్రత్యక్షంగా ఎదుర్కొనేది వైద్య బృందమే. ఈ పరీక్షా ఘడియల్లో భయాందోళనలకు గురైన ఒక వైద్యాధికారిపై ప్రభుత్వం ఇటువంటి విపరీత చర్యలకు పాల్పడటం వల్ల వైద్యులందరి మనస్థర్యం దెబ్బ తినే అవకాశంముంది. ఇటువంటి అవాంఛనీయ సంకేతాలు ఇవ్వడం వల్ల డాక్టర్ల మనస్తర్యం దెబ్బ తినడమే కాదు ఈ కాలంలో అందాల్సిన విలువైన సమాచారం ప్రజలకు, ప్రభుత్వానికి అందకుండా పోతుంది.
కరోనా వ్యాధి నివారణ కోసం జరుగుతున్న కృషిలో ఇటువంటి అపశ్రుతులు లేకపోతే వైద్య విభాగంతో సహా అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత ఉత్సాహంగా పని చేయగలవని మేము భావిస్తున్నాము. ఇటువంటి మహమ్మారిని ఎదురుకోవాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజాస్వామిక విలువలను మరింత పటిష్ట పరచాలి.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
11 ఏప్రిల్ 2020