తీరప్రాంత క్రమబద్ధీకరణ -2018 నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (Coastal Regulatory Zone – CRZ), 2018 నోటిఫికేషన్‌ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది. అటవీ హక్కుల చట్టం – 2006 తరహాలో సంప్రదాయ, సాగర మత్స్యకారుల (హక్కుల రక్షణ) బిల్లును ఒకదాన్ని రూపొందించడానికి వీలుగా పారదర్శకమైన పద్ధతుల్లో ప్రజలతో సంప్రదింపులు ప్రారంభించాలని కోరుతోంది.

కొత్త సి.ఆర్‌.జెడ్‌ నోటిఫికేషన్‌ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. తీరం దోపిడీకి తావిచ్చేలా ఉంది. నోటిఫికేషన్‌ను కనుక తిరగరాయక పోతే సున్నితమైన తీరప్రాంత పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుంది. తీరప్రాంతం మీద ఆధారపడి బతికే సంప్రదాయ సమూహాల జీవనం ప్రమాదంలో పడుతుంది.

సి.ఆర్‌.జెడ్‌ – 2011 నోటిఫికేషన్‌లోని ఉపయుక్తమైన అంశాలను కొన్నింటిని కొత్త నోటిఫికేషన్‌ నీరుగార్చింది. గత సి.ఆర్‌.జెడ్‌ ప్రమాణాలను కుదించింది. ఈ మార్పులన్నీ ప్రయివేటు పెట్టుబడికి మరింత ప్రయోజనం చేకూర్చిపెట్టడానికే. ఇప్పటికే ఈ వర్గం కొత్త మార్పులను వరంగా భావించడం మొదలుపెట్టింది. ఎక్కడా మత్స్యకారులను బాధిస్తున్న విషయాలనూ, వారి ఆందోళననూ పట్టించుకోలేదు.

ఈ నోటిఫికేషన్‌ వల్ల దేశంలో ఉన్న 7500 కి.మీల తీరప్రాంత ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. దరిదాపు ఈ మొత్తం తీరప్రాంతం అంతా వేలాది మత్స్యకారులకు జీవనాధారం. కొత్త నోటిఫికేషన్‌ అనుమతిస్తున్నట్టుగా అడ్డూఆపూ లేని ఈ తరహా ‘అభివృద్ధి కలాపం’  గనుక జరిగితే ఈ సమూహాలకు బతకడానికి తీరమే మిగలదు.

తీరాన్ని శాశ్వతంగా నాశనం చేసే ఇండస్ట్రియల్, రియల్‌ ఎస్టేట్‌, టూరిస్టు ప్రాజెక్టులు విచ్చలవిడిగా వెలియడానికి కొత్త నోటిఫికేషన్‌ దారితీస్తుంది. తీరంపైన జరిగే ఈ ఆకస్మిక దాడి మూలంగా మత్స్వకారులు జీవనాధారం కోల్పోతారు. ఈ తరహా ప్రాజెక్టులకు జీవావరణ, పర్యావరణపరంగా సున్నితమైన కొన్ని ప్రాంతాలలో ఇంతకుముందు అనుమతి లేదు. ఈ ప్రాంతాలకు జరిగే పెనుముప్పును పరిగణనలోకి తీసుకోకుండా కొత్త నోటిఫికేషన్‌ ఈ తరహా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేస్తుంది.

అభివృద్ధి, సుస్థిరతల మేలైన సమ్మేళనంగా ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉంది. ఈ నోటిఫికేషన్‌ రావడానికి సిఫార్సులు ఇచ్చిన శైలేష్‌ నాయక్‌ కమిటీలో ఆయన అప్రజాస్వామికంగా, నియంతృత్వ పోకడలతో వ్యవహరించారు. తీరప్రాంత ప్రభుత్వాలతో జరిగిన చర్చల ఆధారంగా మాత్రమే నివేదికకు తుది రూపం ఇచ్చేసారు. పూర్తిగా సముద్రం మీదా, తీరప్రాంతం మీదా ఆధారపడి బతికే సమూహాలతో పారదర్శక పద్ధతుల్లో సంప్రదింపులు చేయలేదు. ఉమ్మడి సముద్ర వనరుల (coastal commons) పైన తమకు ఉండే హక్కుల గురించి ఎంతో కాలంగా ఘోషిస్తున్న సంప్రదాయ, సాగర మత్స్యకార సమూహాలను నిర్లక్ష్యం చేశారు.

కొత్త సి.ఆర్‌. జెడ్‌ నోటిఫికేషన్‌ చదివితే భయానక సత్యాలు బయటపడతాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ సంక్షోభాన్ని అది నిస్సిగ్గుగా విస్మరించింది. ముంచుకొస్తున్న పర్యావరణ, జీవావరణ ముప్పులకు సాక్ష్యంగా నిలుస్తున్న అనేక పరిణామాలను అది అవహేళన చేసింది. నోటిఫికేషన్‌ తెస్తున్న మార్పులు తీరాన్ని మరిన్ని విపత్కర సంక్షోభాలలోకి నెడతాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ సంక్షోభ మంత్రిత్వ శాఖ (MoEFCC) నుంచి అధికారాలను రాష్ట్రాల  తీరప్రాంత మ్యానేజ్‌మెంట్‌ అథారిటీలకు (SCZMAs) బదలాయించడం మమ్మల్ని వ్యాకుల పరుస్తోంది. రాష్ట్రాల తీరప్రాంత మ్యానేజ్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటు, రూపకల్పన, పని విధానాల విషయంలో ఉదాసీనత బాధిస్తోంది.

నోటిఫికేషన్‌లో ప్రమాద రేఖను (hazard line) తొలగించడం అభ్యంతరకరం. ఆ రేఖను ‘నో డెవలప్‌మెంట్‌ జోన్‌’ పరిధి నుంచి తొలగించి డిజాస్టర్‌ మ్యానేజ్‌మెంట్‌ ప్లానింగ్‌కు మాత్రమే పరిమితం చేశారు. ప్రమాద రేఖను తొలగించడం అన్నది తీరప్రాంత పరిరక్షణ, నిర్వహణ ప్రణాళికల (CZMPs) లక్ష్యాలు పూర్తిగా వెనుకపట్టు పట్టడాన్ని సూచిస్తోంది. ఈ తీరప్రాంత పరిరక్షణ, నిర్వహణ ప్రణాళికల రూపకల్పన విషయంలో మత్స్యకార, సముద్రతీర సంప్రదాయ సమూహాల నుంచి తీవ వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నోటిఫికేషన్‌ కారణంగా ఉమ్మడి సముద్ర వనరులు (coastal commons) ఈ సమూహాల చేతుల్లోంచి పెట్టుబడి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ సమూహాల జీవనం కోల్పోతారు. అందుకే ఈ వ్యతిరేకత.

తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి, 2018 నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది.

మానవహక్కుల  వేదిక
ఆంధ్రప్రదేశ్‌
29 జనవరి 2019

Related Posts

Scroll to Top