తూర్పు గోదావరి జిల్లా తుని ఘటనకు సంబంధించిన 17 కేసులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని మానవహక్కుల వేదిక భావిస్తున్నది.
కాపులకు రిజర్వేషన్ల కోసం 2016 జనవరిలో కాపు గర్జన పేరుతో తుని పట్టణంలో లక్షలాది మందితో ఒక సభ జరిగింది. దానికి ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించారు. ఆ సభ మధ్యలోనే నిరసనకారులు తుని రైల్వే స్టేషన్లోకి చొరబడి రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బందితో పాటు కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. రైలు ఇంజన్ పూర్తిగా ధ్వంసమైంది. కొన్ని బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ సందర్భంగా నమోదైన 69 కేసులలో 51 కేసులను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చిలో ఒక జీవో జారీ చేసింది. మరో 17 కేసులను ఉపసంహరించుకుంటూ ఈ నెల 27న మరొక జీవో జారీ చేసింది.
సెక్షన్-321 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం క్రిమినల్ కేసులలో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునే అధికారం ఆయా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఉంది. సాధారణంగా ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆయా కేసుల ఉపసంహరణ చట్టానికి లోబడి ఉన్నట్లుగా నిర్ధారించుకుని ఆ ప్రతిపాదనను కోర్టుల ముందు పెట్టాలి. కోర్టులు కూడా ఒప్పుకున్న తర్వాత ఉపసంహరణ జరగాలి. అయితే ఈ విచక్షణాధికారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ఇప్పుడు అన్ని రాష్ట్రాలలోనూ సాధారణమైపోయింది. ప్రభుత్వమే నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వానికి వంత పాడడం తప్ప స్వతంత్రంగా వ్యవహరించలేరు. కోర్టులు కూడా ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరించకపోవడం చట్టబద్ధ పాలనకే ముప్పు.
ఇప్పటికే రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం, రాజ్యాంగాన్ని చట్టాలను ఖాతరు చేయకుండా ఆయా ప్రాంతాల్లో తమ రాజకీయ ప్రాబల్యానికి అనుకూలంగా పని చేయించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. దీనితో సామాన్యులకు న్యాయం జరిగే పరిస్థితులు ఉండడం లేదు. అధికారం ఉంటే చట్టాలకు అతీతం అనే భావన పెరిగిపోయింది. అందువల్లే ప్రజలకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది.
రైతులు, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ సఫాయి కార్మికులు, అసంఘటిత కార్మికులు, దళిత, బలహీన వర్గాలు తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుత నిరసన తెలియజేసినప్పుడు నమోదైన కేసుల విషయంలో మాత్రం ఈ విచక్షణ అధికారాన్ని ఉపయోగించరు. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను రద్దు చేసి ఆయా క్రిమినల్ కేసుల్లో విచారణను త్వరితగతిన చేపట్టాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. కోర్టులు రాజ్యాంగబద్ధంగా తమ స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకునేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తోంది.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
31 జూలై 2020