దిశ కేసు: పోలీసుల చట్టబాహ్య హత్యలు

హైదరాబాద్‌లో నవంబర్‌ 27, 2019న ఒక పశువైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులయిన నలుగురినీ పోలీసులు కాల్చి చంపివేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టబాహ్య హత్యలో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై హత్యా నేరం కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్‌.ఎఫ్‌.) డిమాండ్‌ చేస్తోంది.

ఈ కాల్పుల్లో తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు కనుక దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ కారణంగా కేసు దర్యాస్తును సి. బి.ఐకి అప్పగించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. కాల్పుల్లో చనిపోయింది పోలీసుల అదుపులోనున్న బందీలు కనుక ఈ విషయంలో న్యాయన్థానం సుమోటో కలుగ చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం.

‘దిశ’ సాముహిక అత్యాచారం, హత్య సమాజంలో చాలా అలజడికి దారి తీసింది. చాలామంది ప్రజలు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని, కొట్టి చంపాలని డిమాండ్‌ చేయడం మొదలు పెట్లారు. కోర్టు విచారణ అనే ఒక చట్టబద్ధ  ప్రక్రియలో న్యాయాన్యాయాలు తేలవలసి ఉండగా, వారిని చంపడం ద్వారా పోలీసులే తీర్పు ఇచ్చేశారు. ఆత్మరక్షణార్థం చంపినట్లు కట్లుకథ అల్లారు.

న్యాయ సూత్రాలను, ప్రక్రియలను పక్కకు పెట్టి పోలీసులు చేస్తున్న ఇటువంటి హత్యలకు మద్దతు ఇవ్వడం వల్ల అంతిమంగా నష్టపోయేది దుర్బల పరిస్థితుల్లో ఉన్న సమూహాలే. చట్టబద్ధ ప్రక్రియలను విస్మరించి నేరస్తులనుకున్న వారిని కాల్చి చంపడం వలన బాధితులకో, సమాజానికో న్యాయం జరుగుతుందనుకోవడం లేదా భద్రత చేకూరుతుందనుకోవడం భ్రమే అవుతుంది. న్యాయవ్యవస్థ జోక్యం లేకుండా పోలీసులకు తమకు కిట్టని వారిని హత్య చేసే అధికారాలు కట్టబెడితే అది ఎటువంటి దారుణ పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించమని ప్రజలను కోరుతున్నాం. ఎంతటి ఘోరమైన నేరంలోనయినా నిందితులను చంపే అధికారం పోలీసులకు కట్టబెట్టడంవల్ల అది పోలీసులలో జవాబుదారీ తనంలేని ఒక సంస్కృతి బలపడటానికి కారణమవుతుంది. అంతేకానీ బాధితులకు ఒరిగేది ఏమీ ఉండదు.

‘ప్రజల మనోభావాలను’ అడ్డం పెట్టుకుని వారిని సంతృప్తి పరచడానికి పోలీసులు చేస్తున్న హత్యలు ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తాయి. హీనాతిహీనమైన లైంగిక అత్యాచారం, హత్య కేసులలో నిందితులను ఈ విధంగా కాల్చేస్తే స్త్రీలకు నిజంగా భద్రత కలుగుతుందా అన్నది మా ప్రశ్న? స్త్రీలకు ఇంటా బైటా, విద్య సంస్థల్లో, పని ప్రదేశాల్లో, సమాజమంతటా భద్రత కల్పించాలంటే అందుకు సుదీర్ఘ సాంస్కృతిక పోరాటం అవసరం. ఆవైపుగా అటు ప్రభుత్వం గానీ, ఇటు సమాజంగానీ తీసుకుంటున్న చర్యలేవీ పెద్దగా కనపడవు.

నిందితులను తుదముట్టించే ఈ సంస్కృతిని సమాజం సమర్థించడం, పండగ చేసుకోవడం అమానుషం. దిశ హత్య ఎంత దుర్మార్గమయిందో, హేయమైనదో చట్టబాహ్య పద్ధతుల్లో పోలీసులు నిందితులను నిర్మూలించడం కూడా అంతే  దుర్మార్గమైంది, హేయమైనది. దీనిని మేము ఖండిస్తున్నాం.

మానవహక్కుల  వేదిక
తెలంగాణ
06 డిసెంబర్‌ 2019

Related Posts

Scroll to Top