దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో నైట్ విజన్ కెమెరాలతో, ఆడియో రికార్డింగ్ సౌలభ్యం ఉన్న సిసిటివిలు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు డిసెంబర్ 2 న జారీ చేసిన ఉత్తర్వుని మానవహక్కుల వేదిక (HRF) స్వాగతిస్తున్నది. ఈ కెమెరాలు ‘విచారణ గదులను, ప్రవేశ నిర్గమన మార్గాలను, లాకప్ గదులను, కారిడార్లను, లాబీలను, రిసెప్షన్ ప్రాంతాన్ని, ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్ గదులను, డ్యూటీ అధికారి గదులను, పోలీస్ స్టేషన్ కాంపొండ్ను, పోలీస్ స్టేషన్ వెనుక భాగాన్ని బాత్రూం బయట ప్రాంతాన్ని’ కవర్ చెయ్యాలి అని సుప్రీకోర్టు తన ఉత్తర్వులో స్పష్టం చేసింది.
అలాగే కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే విచారణ సంస్థలు – కేంద్ర దర్యాప్తు బృందం (సిబిఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విచారణ అధికారం కలిగిన ఇతర కేంద్ర సంస్థలు సైతం తమ కార్యాలయాలలో సిసిటివి, రికార్దింగ్ పరికరాలు అమర్చాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిల్లో రికార్డ్ అయిన ఆడియో, వీడియో రికార్డులని పద్దెనిమిది నెలలు పాటు సాక్ష్యావసరాల కోసం భద్రపరచాలని కూడా పేర్కొంది.
విస్తృత పరిధి, ప్రయోజనం కలిగిన ఈ మైలురాయి లాంటి ఉత్తర్వుని సరిగ్గా కనుక అమలు చేస్తే కస్టోడియల్ హింసనూ, కస్టడీలో మానవ హక్కుల ఉల్లంఘనలనూ తగ్గించవచ్చు. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఉత్తర్వుని సంపూర్ణంగా అమలు చెయ్యాలని మానవ హక్కుల వేదిక కోరుతున్నది.
కెమెరాలు ఏర్పరచడానికి, వాటి పనితీరు మీద అజమాయిషీ కలిగి ఉండటానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పరచాలి అని కూడా సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఆ పర్యవేక్షణ కమిటీలకు ఈ కెమెరా ఫూటేజిని పరిశీలించే అధికారం కూడా ఉంటుంది అని పేర్కొంది. ముఖ్యంగా, జిల్లా స్థాయి కమిటీలో ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండాలనీ, అలాగే రాష్ట్ర స్థాయి కమిటీలో మహిళా కమిషన్ నుండి ఒకరు సభ్యులుగా ఉండాలనీసుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే ఇప్పటికే చాలామంది నిపుణులు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఈ సిసిటివిలను స్థానిక మేజిస్ట్రేట్ కార్యాలయంలో, ఇతర కార్యాలయాలలో ఇరవై నాలుగు గంటలూ రియల్ టైంలో వీక్షించే, పర్యవేక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టు ఇచ్చి ఉండాల్సింది. అలా ఇచ్చి ఉంటే కనుక ఈ ఫూటేజిని ఎవరూ ఎడిట్ చెయ్యకుండా, ట్యాంపర్ చెయ్యకుండా చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, తరువాత ఎప్పుడో ఫూటేజిని చూడటం కన్నా రియల్ టైంలో, ప్రతి నిమిషం పర్యవేక్షించగలుగుతాం.
కస్టోడియల్ హింస, పోలీసు అధికార దుర్వినియోగం అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. హింస అనేది చట్టప్రకారం నేరం. అయినా కూడా కస్టోడియల్ హింసకి పూర్తి అంగీకారం లభిస్తున్నది. అలాగే విచారణ పద్ధతులు కూడా హింసాత్మకంగా, అత్యంత అమానవీయంగా కొనసాగుతున్నాయి. పోలీసులకి నియమాలు, చట్టాలు అనేవి పట్టవని, అసహాయ అనుమానితుల మీద వారు తీవ్ర హింసని ప్రయోగిస్తారని, అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తారని అందరికీ తెలుసు. ఈ కస్టోడియల్ హింస ఇలా కొనసాగటానికి పోలీసులకి లభిస్తున్న ఈ సమ్మతే ముఖ్య కారణం. సుప్రీంకోర్టు డిసెంబర్ 2 నాడు ఇచ్చిన ఉత్తర్వుని పటిష్టంగా అమలు చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందని మేము ఆశిస్తున్నాము.
పోలీసులు పాల్పడుతున్న కస్టోడియల్ హింసకి అడ్డుకట్ట వేసి, అధికారులు రాజ్యాంగ విలువలకి, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని మానవహక్కుల వేదిక ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్టేట్ సెక్యూరిటీ కమీషన్లను తక్షణం ఏర్పాటు చెయ్యాలనీ, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోలీసు ఫిర్యాదుల సాధికార సంస్థలను ఏర్పాటు చేసి అవి అర్థవంతంగా పని చేసేలా చూడాలని మానవహక్షుల వేదిక డిమాండ్ చేస్తున్నది.
మానవహక్కుల వేదిక
ఆంధ్ర -తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
5 డిసెంబర్ 2020