పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.శేషయ్య గారి మృతికి మానవహక్కుల వేదిక (HRF) సంతాపం ప్రకటిస్తున్నది. కోవిడ్ – 19 బారిన పడిన శేషయ్య తొలుత అనంతపురంలో ప్రాధమిక వైద్యం పొంది తదుపరి చికిత్స కోసం హైదరాబాదుకు వెళ్లారు. చికిత్స పొందుతుండగానే అక్టోబర్ 10 సాయంత్రం 8:30 గంటలకు తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా శేషయ్య ప్రగతిశీల రాజకీయాలలో చురుకుగా పని చేశారు. మొదట వామపక్ష కార్యకర్తగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో (రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అనే పదం తీసేసి పౌరహక్కుల సంఘం అని మాత్రమే ఉంచారు) కార్యకర్తగా పని చేశారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ఆచార్యునిగా పని చేశారు. సంక్షుభిత కాలమైన 1998లో శేషయ్య ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రముఖ కార్యకర్తలైన టి. పురుషోత్తంను 23 నవంబర్ 2000 నాడు హైదరాబాద్‌లోనూ, ఆజం ఆలీను 18 ఫిబ్రవరి 2001 నాడు నల్గొండలోనూ గ్రీన్ టైగర్స్ వగైరా పేర్లు పెట్టుకున్న కిరాయి హంతక ముఠాలు హత్య చేశాయి. ఈ రెండు హత్యలు కూడా పట్టపగలు నడి రోడ్డు మీద చేసినవే. శేషయ్య గారిని కూడా బెదిరింపులకి గురి చేశారు. అలాగే రాయలసీమ టైగర్స్ అని పేరు పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు నవంబర్ 11, 2005న ఆయన ఇంటి మీద దాడి చేసి కారును తగలబెట్టారు. ఈ క్రిమినల్ మూకలని ప్రోత్సహించి వారికి సహాయ సహకారాలు అందించింది రాజ్యమేననడంలో ఎటువంటి సందేహం లేదు.
మృదు స్వభావి అయిన శేషయ్య మానవహక్కుల వేదికలో చాలా మందికి వ్యక్తిగతంగా పరిచయస్తులు. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము.
మానవహక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
11 అక్టోబర్ 2020