జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రీయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు వెంటనే స్పందించే విధంగా నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు స్టేట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనీ డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, 2005 ఆదేశించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రభుత్వం యొక్క స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో అగ్నిమాపక దళం మాత్రమే ఉంది. ప్రకృతి వైపరీత్యం అనగానే మాములుగా మనం అందరం భూకంపాలు, తూఫాన్లు , వరదలు అని మాత్రమే అనుకుంటాము. ఇవి డెక్కన్ ప్రాంతంలో ఉండే తెలంగాణ ప్రాంతానికి చాలా తక్కువ. నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రకారం, వడ గాలులు, కొండ చరియలు విరిగి పడటం, రసాయనాల వల్ల వచ్చే వైపరీత్యాలు , కరువు , అగ్ని ప్రమాదాలు , అడవులలో పుట్టే అగ్ని, వరదలు, పట్టణ ప్రాంతాల్లో వరదలు ఉన్నాయి. అగ్నికి తప్ప ఇంకదేనిని ఎదుర్కోడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధం అవ్వలేదు. గత నాలుగయిదు సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాలలో వస్తున్న వరదలు, ఈ సంవత్సరం తెలంగాణ మునిగిపోయినప్పుడు అందుతున్న అత్యవసర సాయం దీనికి నిదర్శనం.
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలి అన్నది ముఖ్యమైన అంశం. ముందుగానే లోతట్టు ప్రాంతాలను గుర్తించడం, వాటిని అనుసంధానం చేస్తూ అనువైన ప్రదేశాలలో పడవలు, లైఫ్ జాకెట్లు వంటి వాటిని ఉంచడం, వైపరీత్యాలు వచ్చినపుడు ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహనా కల్పించడం , లోతట్టు ప్రాంతాల దగ్గర ఉన్న ఎత్తైన ప్రదేశాలు ఏవి అని ముందే గుర్తించడం ఇలాంటివి నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. అసలు వరద ముంపు ఉన్న ప్రాంతాలలో ముందే సమాచారం అందించినా చాలా ప్రాణ నష్టం తప్పుతుంది. వరద వచ్చే వరకు నిద్రపోయి, వరదలు వచ్చినపుడు హెలికాఫ్టర్ లో మంత్రిగారు పర్యవేక్షించడం మాత్రమే కాదు.
అసలు ముందు తెలంగాణ రాష్ట్రంలో రెస్పాన్స్ ఫోర్స్ లేదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం హైదరాబాద్ ప్రాంతానికి డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుంది. కొన్ని వాహనాలను ఏర్పాటు చేసి, దాన్నే ఒక ఫోర్స్ అంది. ఎండాకాలం చలికాలం లో ఈ ఫోర్స్ రోడ్డు మీద బ్యానర్లను పీకడం వంటి పనులు చేస్తూ ఉంటారు. వర్షాకాలం లో, మరికొన్ని ఆటో వాహనాల్లో నీటిని తోడివేసే మోటార్లను పెట్టి వాటిని మాన్సూన్ ఎమర్జెన్సీ ఫోర్స్ అంటారు.
పోనీ అగ్ని ప్రమాదాలలో తెలంగాణ సంసిద్ధంగా ఉందా అంటే, దాని మీద చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. పెరుగుతున్న జనాభాకి, ఇళ్ల సాంద్రతకు , పెరుగుతున్న బహుళ అంతస్తులకు తగ్గట్టు అగ్ని మాపక దళం పెరిగిందా అంటే లేదు. ఇప్పటికి రాష్ట్రం మొత్తం 605 మండలాలకు గాను 134 అగ్నిమాపక దళాలు మాత్రమే ఉన్నాయి. అంటే మండలానికి ఒక్కటి కూడా లేదు. 20 అంతస్తులు ఆ పైన కడుతున్న అపార్టుమెంటులో అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక దళం వారి పాత వాహనాల నిచ్చెనలు అందుకుంటాయో లేదో తెలియదు.
2022 లో 15వ ఫైనాన్స్ కమిషన్, రాష్ట్రాలలో వైపరిత్యాల కోసం అని కొన్ని నిధులు కేటాయించాలని ప్రతిపాదించి, దానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. వీటిలో 75% కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి. నిధుల మంజూరి అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను సమీకరించుకోవాలి. విపత్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి, స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ని బలోపేతం చెయ్యాలి. ప్రజలకి అవగాహన కల్పించాలి.
ఇక్కడ ప్రకృతి వైపరీత్యం అంటే ఒక ప్రాంతం మొత్తం దెబ్బ తింటేనే అన్న భావన మెండుగా ఉంది. ప్రకృతి వల్ల ఆర్థికంగా దెబ్బ తిన్న వ్యక్తులకు కూడా సహాయం అందాలి. పిడుగులు పడి పశుసంపద చనిపోయినపుడు కూడా దాన్ని ప్రకృతి వైపరీత్యం గానే గుర్తించాలి, రైతుకు తగిన నష్ట పరిహారం ఉండాలి.
ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు, తక్షణ సహాయం ఒక్కటే కాదు, తిరిగి జీవన విధానం అంతకు ముందు తరహాలో ఉండేటట్టు చేయాలి. బ్రిటిష్ కాలం నాటి కరువు కోడ్ లాగా, తక్షణ సహాయం తరువాత చేయవలసిన పనులు ప్రజలకు ఒక హక్కులా ఉండాలి, జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం , ఆస్తి నష్టం, కోల్పోయిన ఉపాధి అవకాశాలు వంటివి అంచనా వేసి, పూర్వస్థితి కి చేరడానికి పధకాలు రచించి ఆచరించాలి కానీ, హెలికాఫ్టర్ మీద నుంచి ఒకసారి పడేసిన పులిహార పొట్లాల లాగా ఉండకూడదు.
ఏమి కాదులే అనుకునే తెలంగాణ మొహం మీద ప్రకృతి ఎడతెగని వర్షాలతో మొహం మీద మొత్తింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం మేలుకోకపోతే , ఇప్పటి దాకా ప్రమాదం జరగలేదు కదా అని మందు తాగి, హెల్మెట్ వేసుకోకుండా ద్విచక్ర వాహనం నడిపే తాగుబోతుకి ప్రభుత్వానికి ఏమి తేడా లేదు అనుకోవాలి.
సంజీవ్
మానవ హక్కుల వేదిక