ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత దాదాపు ఆరేళ్ళ వరకు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (APHRC) కి ఫిర్యాదు పంపాలంటే ఎక్కడకు పంపాలో అర్ధం కాని అయోమయ పరిస్థితి కొనసాగింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌ను ప్రారంభించి, దానికి ఛైర్మన్‌గా ఎం. సీతారామమూర్తి గారిని నియమించడం జరిగింది. మొదట్లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఆయన విశేషంగా స్పందించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రప్రభుత్వంలోని అన్ని శాఖల ఉన్నత అధికారుల నుండి సమాధానం రాబట్టి, ఆ సమాచారాన్ని బాధితులకు చేరవేసి, వారి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. దీనివలన బాధిత ప్రజలకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండ కొంత ఉపశమనం దొరికింది.
అయితే గత కొద్ది నెలలుగా ఫిర్యాదులు నమోదు కావడం లేదు. కోర్టులలో కొనసాగుతున్న సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులను, వ్యక్తిగత ఫిర్యాదులను తిరస్కరిస్తే అర్థం ఉంది గాని హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా స్వీకరించకుండా నిబంధనల పేరుతో తిరస్కరించడం విచారించదగ్గ విషయం. బాధిత ప్రజలు తమ ఫిర్యాదును కోర్టులో ఇచ్చే అఫిడవిట్ రూపంలో తయారుచేసి, మూడు కాపీలను పంపాలని కొత్తగా నిబంధన పెట్టారు. అదే విధంగా బాధిత ప్రజలు ఫిర్యాదుకు అనుబంధంగా ఏవైనా డాక్యుమెంట్లను జతపరిస్తే, స్వీయ ధ్రువీకరణ చేస్తూ సంతకాలు చేసి పంపాలని చెబుతున్నారు. ప్రజలు అర్జీ (వినతిపత్రం) రూపంలో పంపిన ఫిర్యాదును కూడా నమోదు చేయకుండ, తిరస్కరించి వెనకకు పంపడం చాలా అన్యాయం.
గతంలో ప్రజలు తమ ఫిర్యాదును ఏ రూపంలో పంపినా, ఏ అంశాలకు సంబంధించినవి అయినా వాటిని పరిశీలించి, తమ పరిధి కిందకు రానివి అయితే వారు ఆ విషయాన్ని వివరిస్తూ బాధిత ప్రజలకు సమాధానం పంపేవారు. తెల్ల కాగితం మీద అర్జీ రూపంలో ఫిర్యాదు చేస్తే సరిపోదని చాలామందికి తెలియదు. ఇప్పుడు కొత్తగా తమ ఫిర్యాదును అఫిడవిట్ రూపంలో ఇవ్వాలనే నిబంధన పెట్టడం వారికి ఆశనిపాతంగా మారింది. అదే విధంగా ఫిర్యాదుకు డాక్యుమెంట్స్ జతపరచవలసిన అవసరం వస్తే , తమ స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలని చెబుతున్నారు.
బాధిత ప్రజలు ఈ రెండు నిబంధనలను పూర్తిచేసి తమ కేసు నెంబర్ కావాలంటే వారికి న్యాయవాది సహాయం తప్పనిసరి. మెజారిటీ బాధిత ప్రజలు చదువురాని వారు, నిరుపేదలు కావడంతో తమ ఫిర్యాదు నమోదు కావాలంటే, వారు న్యాయవాదిని నియమించుకొనవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఇప్పుడు APHRC కమీషన్ ఛైర్మన్‌ను కలవడానికి వెళ్లిన బాధితులను అక్కడి సిబ్బంది కలవనీయడం లేదు. కొత్త నిబంధనల కారణంగా సామాన్య ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి, అన్యాయానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇదంతా చైర్మన్ గారికి తెలిసే జరుగుతుందా లేక ఫిర్యాదులను తగ్గించడానికి సిబ్బందే ఈ విధంగా చేస్తున్నారా అన్న విషయం తేలాలి.
ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయ సహాయం అందిస్తామని న్యాయస్థానాల్లో ‘న్యాయ సేవాధికార సంస్థ’ ను ఏర్పాటు చేసింది. వాటినుండి ప్రజలకు ఆచరణలో న్యాయ సహాయం ఏ మాత్రం అందుతుందో ప్రజలకు తెలియని విషయం కాదు. సామాన్య ప్రజల హక్కులకు ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ నుండి అందుతున్న కొద్దిపాటి భరోసాను సైతం నిబంధనల పేరుతో అందకుండా చేయడం ఏ విధంగా సమర్థనీయం?
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికైనా కొత్తగా పెట్టిన నిబంధనలను పునఃపరిశీలించి బాధిత ప్రజానీకానికి గతంలో మాదిరిగానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాలని మానవ హక్కుల వేదిక కోరుతున్నది.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
9 నవంబర్ 2022