కళ్యాణలోవ జలాశయ పరీవాహక ప్రాంతంలో గ్రానైట్  తవ్వకాలు నిలిపివేయాలి

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయితీలోని కళ్యాణలోవ జలాశయం పరీవాహక ప్రాంత రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది. పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న గ్రానైట్ తవ్వకాల వల్ల రిజర్వాయిర్‌, దాని పరిసర ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. చుట్టుపక్కల నివసిస్తున్న రైతులకూ, ఆదివాసులకూ ఈ రిజర్వాయిర్‌ జీవనాధారం. ఈ ప్రాంతంలో జరుగుతున్న గ్రానైట్ తవ్వకాల్ని నిలిపివేయడం, స్థానిక జీవావరణాన్ని మరింత నాశనం కాకుండా రక్షించడం తన రాజ్యాంగ బాధ్యతగా ప్రభుత్వం గుర్తెరగాలి. ఈ అక్రమ తవ్వకాన్ని అనుమతించిన, ప్రోత్సహించిన ప్రభుత్వ అధికార్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఒక సమగ్ర దర్యాప్తును ప్రభుత్వం ఆదేశించాలి.

కళ్యాణలోవ జలాశయానికి నీరిచ్చే వరాహ నదీ పరీవాహక ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలకు కొన్నేళ్ళ క్రితం అనుమతి ఇచ్చారు. ఇందుకోసం రెవెన్యూ, అటవీ, గనుల శాఖ అధికారులు కుమ్మక్కు అయ్యారు. ఈ పరీవాహక ప్రాంతంలో అప్పటికే అనేక క్వారీలు ఉన్నాయన్న ప్రాథమిక సత్యాన్ని ఈ అధికార్లు తొక్కి ఉంచారు. ఈ ప్రాంతం షెడ్యూల్‌ ప్రాంతం అయినా కూడా పెసా (Panchayats (Extension to Scheduled Areas) Act), అటవీ హక్కుల చట్టాలను (Forest Rights Act) ఉల్లంఘిస్తూ మైనింగ్ అనుమతి ఇచ్చేశారు. పర్యావరణపరంగా ఎంతో సుసంపన్నమయిన ఈ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులను రక్షించాల్సింది పోయి విచక్షణారహితంగా మైనింగ్‌కు అనుమతులు ఇచ్చేశారు. ఫలితంగా జలాశయంలోకి వచ్చే నీళ్ళు తగ్గిపోయాయి. అటవీ వనరులకు పుట్టినిల్లుగా పేరొందిన ఆ ప్రాంతమంతా కాలుష్యం బారిన పడింది.

జలాశయం కమాండ్‌ ఏరియాకి చెందిన రైతులూ, క్వారీలకు సమీపంలో నివసిస్తున్న ఆదివాసులూ పదేపదే ఈ అక్రమ తవ్వకాల విషయాన్ని వాటి పర్యవసానాలను అధికార్ల దృష్టికి తీసుకువచ్చారు. గనులను మూసివేయాలనీ, ఈ ప్రాంతం మొత్తాన్నీ గని తవ్వకాలు నిషేధించిన ప్రాంతం (no-mining zone) గా ప్రకటించాలనీ వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వాటిని పెడచెవిని పెట్టింది. పరీవాహక ప్రాంతంలో విచ్చలవిడి మైనింగ్‌ జరుగుతూనే ఉంది.

ఈ జలాశయ నిర్వాహకులూ, పరిరక్షకులూ అయిన నీటిపారుదల శాఖ ఈ ఏడాది జూన్‌ 26న జిల్లా కలెక్టరుకు ఒక నివేదిక ఇచ్చింది. గనుల తవ్వకం ప్రారంభానికి ముందు ఎవరూ తమను సంప్రదించడం గానీ, నిరభ్యంతర పత్రాన్ని తీసుకోవడం కానీ జరగలేదని పేర్కొంది. తాము ఎవరికీ అనుమతులు మంజూరు చేయకపోవడానికి కారణం రిజర్వాయిర్‌ పరీవాహక ప్రాంతంలోనే గ్రానైట్ గనులు ఉండటమేనని చెప్పింది. జలాశయపు సహజ నీటిప్రవాహ మార్గాలకు గనుల వల్ల అవరోధం ఏర్పడుతోందనీ, ఫలితంగా నీటి నిల్వలు తగ్గి పోయాయనీ పేర్కొంది. రైతులకు నీటి మీద ఉండే హక్కుకు విఘాతం కలుగుతోందనీ అన్నది. గనుల తవ్వకం వల్లా, గ్రానైట్‌ను తీసుకు వెళ్ళే వాహనాల వల్లా జలాశయం గట్టు బలహీనం అయి జలాశయపు ఉనికి, దానిమీద ఆధారపడ్డ వ్యవసాయ భూములు ప్రమాదంలో పడ్డాయని నీటిపారుదల శాఖ ప్రకటన వివరించింది. జిల్లా కలెక్టరుకు ఇచ్చిన నివేదికలో ఈ జలాశయ పరీవాహక ప్రాంతంలో అన్ని క్వారీ అనుమతులను రద్దు చేయాలని ఆ శాఖ కోరింది.

ప్రభుత్వం ఈ నివేదికను ఎందుకు పట్టించుకోలేదో, ఎందుకు గనుల తవ్వకాలను రద్దు చేయలేదో మాకు అర్ధం కాకుండా ఉంది. తమ ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను స్థానిక రెవెన్యూ, మైనింగ్‌ అధికార్లు కొనసాగిస్తున్నారని మాకు తెలిసింది. గనుల తవ్వకం ఇంకా కొనసాగడానికి తమకు చేతనైన అన్ని పద్ధతుల్లోనూ కృషి చేస్తున్నారని తెలిసింది.

ఈ విషయంలో జాయింట్‌ కలెక్టరు నేతృత్వంలో ఒక సమగ్ర దర్యాప్తును ఆదేశించాలని మానవహక్కుల వేదిక జిల్లా కలెక్టరును కోరుతోంది. కళ్యాణలోవ పరీవాహక ప్రాంతంలో గ్రానైట్ మైనింగ్‌ ఒక పెద్ద కుంభకోణమనీ, అందుకు బాధ్యులైన మైనింగ్‌ కాంట్రాక్టర్లు సహా ప్రభుత్వ అధికార్లు అందరిపైనా చర్యలు తీసుకోవాలనీ మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది.

మానవహక్కుల  వేదిక
ఆంధ్రప్రదేశ్‌
17 జులై 2019

Related Posts

Scroll to Top