భూసేకరణ బిల్లుకు అన్యాయమైన సవరణలు – ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్వాకం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘భూసేకరణ, పునరావాస ప్రక్రియలలో పారదర్శకత, న్యాయమైన నష్ట పరిహార హక్కు చట్టం – 2013’ను సవరిస్తూ నవంబర్‌ 29, 2017న శాసనసభలో ఒక దుర్మార్గమైన బిల్లును ప్రవేశపెట్టింది.

ఎన్నో ప్రజా ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఈ చట్టం తొలిసారి పునరావాసాన్ని ఒక హక్కుగా గుర్తించిన సంగతి మనకు తెలుసు. పరిశ్రమల కోసం, ఇతర ప్రాజెక్టుల కోసం భూమినీ, జీవనోపాధినీ కోల్పోతున్న అభివృద్ధి నిర్వాసితులకు ఈ చట్టం ఒక భరోసాని కల్పించింది. అటువంటి చట్టం అమలే కాలేదు, ఇంతలోనే సవరణకు పూనుకొని దాని గొంతు నులిమే పనికి రాష్ట్ర ప్రభుత్వం దిగడం అమానుషం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధానిని నిర్మించుకోవాలన్నా, సత్వర అభివృద్ధి సాధించాలన్నా ఈ చట్టం ప్రతిబంధకంగా మారిందని సాకు చూపుతూ, అందులో నిర్వాసిత ప్రజలకు అండగా నిలిచిన కొన్ని కీలకమైన అంశాలను ప్రభుత్వం సవరించాలని చూస్తోంది.

వాటిలో ముఖ్యమైనవి :

  1. 2013 చట్టంలోని రెండవ, మూడవ అధ్యాయాలకు సవరణ తలపెట్టింది. సామాజిక ప్రభావ అంచనా (Social Impact Assessment – SIA) నుండి విదేశాంగశాఖ, గ్రామీణ మౌలిక వసతుల ప్రాజెక్టులనేగాక పారిశ్రామిక కారిడార్‌, ప్రైవేటు  పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ ప్రాజెక్టులను కూడా మినహాయించాలని ప్రతిపాదిస్తోంది.
  2. ఆహార భద్రత రీత్యా బహుళ పంటలు పండే భూములను సేకరించరాదన్న నియమం 2013 చట్టంలోని మూడవ అధ్యాయంలో ఉంది. పైన పేర్కొన్న ప్రాజెక్టుల విషయంలో ఆ నియమాన్ని వర్తింప చేయరాదని ప్రతిపాదిస్తోంది.
  3. సంబంధిత భూ యజమానుల నుండి సమ్మతి పత్రాలు తీసుకుని కలెక్టర్‌ అవార్డును ప్రకటించేలా సవరణ చేస్తోంది. అంతేకాదు, అవార్డు ప్రకటించాక అయిదు సంవత్సరాల వరకే దాని కాల పరిమితి ఉంటుందని 2013 చట్టం చెబుతుంది. అయితే ఏదైనా కోర్టు వ్యాజ్యం వల్లగాని, లేదా ఏదైనా కారణం చేత నగదు కోర్టులో చెల్లించినప్పుడు గాని దానికి పట్టే సదరు కాలాన్ని గణనలోకి తీసుకోకూడదని సవరణలో పెట్టింది.

భూసేకరణ చట్టం – 2013కు వెన్నెముకగా నిలిచిన ఈ రక్షణలను తొలగిస్తే ప్రజలకూ, మన ఆహార భద్రతకూ అపారమైన నష్టం జరుగుతుంది. నిర్వాసిత ప్రజల, ప్రాజెక్టు ప్రభావిత ప్రజల జీవించే హక్కు ప్రశ్నార్థకం అవుతుంది. సవరణ బిల్లు కేవలం రాజధాని ప్రాంతంలో మోసపూరితంగా సాగుతున్న ల్యాండ్‌ పూలింగ్‌నూ, కోస్తా తీరంలో గుట్టుగా సాగుతున్న అన్యాయపు భూసేకరణనూ చట్టబద్ధం చేసే ప్రయత్నంలో భాగమే. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది.

మానవహక్కుల  వేదిక, ఆంధ్రప్రదేశ్‌

25 డిసెంబరు 2017

Related Posts

Scroll to Top