ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్హాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి. కాలక్రమంలో వల్లించడం అనే మాటలో చిత్తశుద్ది లోపం వచ్చి చేరింది కాని నిజానికి అది మంచి మాటే. ఏ విషయమైనా అవసరమున్నంతవరకు మళ్ళీ మళ్ళీ చెపుతూ ఉంటేనే కదా మన కర్తవ్యమేమిటో మనం
మరిచిపోకుండా ఉండగలిగేది. ఆ పనే మాకు సాధ్యమైన మేరకు ఈ బులెటిన్లో చేశాం. ఎప్పటిలాగే ప్రస్తుత పరిణామాల మీద కొన్ని వ్యాసాలు, మా నిజనిర్ధారణ బృందం రిపోర్టులు ఇందులో ఉన్నాయి. అయితే మా పనితీరు ఎక్కువగా కనబడేది మాత్రం ప్రకటనలలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో జరిగిన అనేక హక్కుల ఉల్లంఘనల మీద ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చిన పత్రికా ప్రకటనలను చదివితే గత మూడేళ్ళలో ఆ రెండు ప్రభుత్వాల పనితీరు కొంతవరకు అర్థమవుతుంది.