‘ఆర్థికంగా బలహీనమైన వర్గాల’ వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (2019) మానవహక్కుల వేదిక (HRF) నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తోంది. ఏ ప్రాతిపదిక మీద రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారో ఆ స్ఫూర్తికే ఇది విరుద్ధం. దీని ఫలితంగా అనాదిగా కుల వివక్షకూ, వెలివేతకూ, సాంఘిక దురన్యాయాలకూ గురవుతూ వస్తున్న కులాల ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ సవరణ సమానత్వం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ ఆదర్శాలను పక్కకు తోసి సమాజంలో కులాధిపత్యాన్ని కుల దురహంకారాన్ని మరింత స్థిరీకరించబోతోంది. ఇక్కడ ‘ఆర్థికంగా బలహీన వర్గాలు’ అంటే అగ్ర కులాలలోని ఆర్థిక బలహీన వర్గాలు మాత్రమేనని కూడా గుర్తించుకోవాలి.
కులాన్ని బట్టే మనుషుల యోగ్యతను నిర్ధారించే దేశం మనది. అలాంటి దేశంలో ఆయా అణగారిన వర్గాల వెనుకబాటుతనానికి కారణం కులమేనన్న వాస్తవాన్ని తోసిపుచ్చి, పేదరికమే దానికి కారణమనే భావనను బిజెపి ప్రభుత్వం ఈ సవరణ ద్వారా నేడు మరొక్కసారి తెరమీదకు తెచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాల వారిపై కులం పేరుమీద అమలయిన, అవుతున్న వివక్ష, అణచివేత విధానాలను నిలువరించడానికి వచ్చినవే రిజర్వేషన్లు. అంబేద్కర్ దృష్టిలో రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం పేదరిక నిర్మూలన కాదు. చట్టమూ, సంప్రదాయమూ తరతరాలుగా సాధికారతను కల్పించి వ్యవస్థీకరించిన కుల వివక్ష నిర్మూలన. ఇప్పుడు దాన్ని సామాజికంగా ఏ వివక్షకూ గురవని ఉన్నత కులాలకు, వర్గాలకు వర్తింపజేయడంతో మొత్తంగా రిజర్వేషన్ విధానమే ఒక ప్రహసనంగా మారిపోయే స్థితి దాపురించింది. సామాజిక న్యాయం అన్న ఆదర్శాన్ని నిష్ఫలం చేసే ఒక అంతిమ ప్రయోజనాన్ని కాంక్షించి మాత్రమే బీజేపీ ఈ పనికి దిగిందనడంలో సందేహం లేదు.
సామాజికంగా, విద్యపరంగా అణగారిన వర్గాల ప్రజలకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే పద్ధతిని సామాజిక, ఆర్థికరంగాల్లో ఆధిపత్యం గడించిన శక్తులు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చాయి. రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు ముందుకు సాగకుండా అడుగడుగునా మోకాలడ్డుతూ వచ్చాయి. కులవ్యవస్థ ఆధిపత్యకులాలకు కల్పించిన గుత్తాధిపత్యాన్ని సామాజిక రిజర్వేషన్లు కొంత మేరకైనా సడలించగలగడమే వారి ఈ వ్యతిరేకతకు కారణం. ‘ఆర్థిక ప్రాతిపదికపైనే రిజర్వేషన్లు కల్పించాలనడమంటే కులాన్ని, అది ఈ దేశంలో పోషించిన భయంకరమైన, మోసపూరితమైన పాత్రను చూడ నిరాకరించడమే అవుతుంది. ఇప్పటికీ కొనసాగుతున్న కుల వివక్ష అణచివేత, అవకాశాల నిరాకరణ అనే వికృత వాస్తవికతను సరిదిద్దేందుకు విముఖుత కూడా అనొచ్చేమో. కులం పేరుతో వారు పొందే ప్రయోజనాలకు ఎవరూ అడ్డుపడ కూడదనే దుగ్ధ, ఆ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వారు పడే తపన, చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
అనాదిగా మనుషులకు సామాజిక వైకల్యాన్ని అంటగట్టిన కులాన్ని పక్కన పెట్టి దాని స్థానంలో ఆర్థిక ప్రమాణాలను రిజర్వేషన్లకు ప్రాతిపదికగా చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది. ఎస్సీ ఎస్టీలు కాని వారికీ, ఓబీసీ యేతరులకూ అవకాశాలు దక్కక పోవడానికి కారణం రిజర్వేషన్లూ కాదు, లేదా వారేదో కుల వివక్షలాంటి సామాజిక దురన్యాయానికి గురికావడమూ కాదు. పిడికెడుమంది ఆర్థిక ప్రయోజనాలను కాపాడే విధానాలను ప్రభుత్వాలు అనుసరించడం వల్ల మాత్రమే ఆ పరిస్థితి దాపురించింది.
గమనించాల్సిన మరో విషయమేమిటంటే బిజెపి ప్రభుత్వం 2014 ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టాక ఆర్.ఎస్.ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్, దాని సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎం.ఎం. వైద్య రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ప్రకటించడం, తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి ఎంతో అయిష్టంగా దాన్ని ఉపసంహరించు కోవడం. భారత రాజ్యాంగ మౌలిక విలువల పట్ల ఆర్.ఎస్.ఎస్ – బిజెపి ద్వయానికి బొత్తిగా గౌరవం లేదు. రిజర్వేషన్ల పట్ల వారి విముఖత అందరికీ తెలిసిందే. వివక్షకు గురయిన, గురవుతున్న వారికి విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలలో తగు ప్రాతినిధ్యం కల్పించి సామాజిక హుందాతనాన్నీ గౌరవాన్నీ పెంపొందించే సానుకూల చర్యలనూ, భారత రాజ్యాంగంలో పొందుపరచిన సమానత్వ భావాన్నీ ఎంతమాత్రం అంగీకరించలేని ప్రాపంచిక దృష్టి వారిది. అణగారిన కులాల వారిని పచ్చి పుండులా సలిపే కుల వివక్షను నిర్మూలించే ఉద్దేశంతోనే మన దేశంలో రిజర్వేషన్ల విధానం రూపొందింది. నేడు దాని స్థానంలో ‘ఆర్థిక ప్రాతిపదిక’ను తీసుకురావడంలో ఔచిత్యం లేదని మానవహక్కుల వేదిక భావిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నం వెనుక ‘అందరికీ సమాన అవకాశాలు’ అనే అమూల్యమైన భారత రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని హరించే కుట్ర దాగి ఉంది.
ఈ సవరణ భారత రాజ్యాంగాన్ని వమ్ముచేసే ప్రయత్నమేనని మానవహక్కుల వేదిక భావిస్తోంది. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణంలోని ‘సమాన రక్షణ’ సూత్రాన్ని (Equal Protection Clause) నీరుగార్చే, నిరుపయోగకరంగా మార్చే ప్రయత్నంగా భావిస్తోంది. ఈ సవరణ రాజ్యాంగంలో వివిధ అధికరణలలో పొందుపరచిన సమానత్వ హక్కుల యావత్తు సారాన్నీ, క్రమాన్నీ భంగపరచింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికే తూట్లు పొడిచింది. ఈ దేశంలో సమానత్వ హక్కుకు ముప్పు ప్రధానంగా కుల వ్యవస్థలో పొంచి ఉందని మన రాజ్యాంగ కర్తలు గుర్తించి రాజ్యాంగంలోని 15 నుండి 17 అధికరణాలను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
బాలాజీ కేసు (1963) నుండి అశోక్ కుమార్ ఠాకూర్ కేసు (2008) వరకూ మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కులాన్ని ఒక సామాజిక వాస్తవంగానూ, వెనుకబాటుతనానికి ఒక ప్రధాన ప్రాతిపదికగానూ గుర్తిస్తూ వచ్చారు. ‘ఆర్థికంగా బలహీనమైన వర్గాల’ వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్తగా చేర్చిన 15(6), 16(6) క్లాజులు నిజానికి అన్ని రకాల సామాజిక వివక్షలనూ నిషేధించే 15, 16 అధికరణాల క్రమంలో చేర్చడానికి ఎంతమాత్రం తగనివి. సమాజంలో స్థిరపడిపోయిన సామాజిక పక్షపాత వైఖరులను కూకటివేళ్ళతో పెకిలించే ఉద్దేశంతో ఈ 15, 16 అధికరణాలను రూపొందించారు. కుల వివక్షకు గురవుతున్న వారికి విద్య, ఆర్థిక, రాజకీయరంగాలలో తగు ప్రాతినిధ్యం కల్పించే సానుకూల చర్యలు మాత్రమే వారికి హుందాతనాన్నీ గౌరవాన్నీ తిరిగి కల్పిస్తాయి. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు’ అనే పదం స్థానంలో ‘ఆర్థికంగా బలహీనమైన వర్గాలు’ అనే పదాన్ని సవరణలో ప్రయోగించడం వెనుక పెద్ద కుట్రే దాగివుంది. ఈ పద ప్రయోగాన్ని చాలా ముందుచూపుతో చేశారని అర్థమవుతోంది. కులం, వర్గం అనే విషయాల చుట్టూ న్యాయస్థానాలలో ప్రతిధ్వనించిన చర్చల సారాన్ని మన సమిష్టి జ్ఞాపకాలలోంచి తుడిచిపెట్టే దురాలోచన దీని వెనుక వుంది.
ఈ సవరణ ప్రవేశపెట్టే ముందు విస్తృత అధ్యయనం చేపట్టవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదు. మానవజాతికి తీవ్రమైన హానిచేసే నేరపూరిత పాత్ర పేదరికానిదన్నది ఎవరూ కాదనలేని కఠోర వాస్తవం. అయితే ‘ఆర్థికంగా బలహీనమైన వర్గాలు’ ఎవరో తేల్చి చెప్పే సహేతుక వర్గీకరణేదీ ఈ సవరణలో కనిపించదు. దాల్మియా (1958), మనేకా గాంధీ (1978) కేసుల్లో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ‘సహేతుక వర్గీకరణ’ (The test of reasonable classification), ‘నిర్దేతుక అధికార వినియోగం’ (The test of arbitrariness) పరీక్షల ముందు ఈ వర్గీకరణ నిలవజాలదు.
ఈ సవరణ ద్వారా ఆందోళనకరమైన మరో అంశం రాజ్యాంగంలోకి వచ్చి చేరింది. ‘ఆర్థికంగా బలహీనమైన సేక్షన్లకు’ 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 15(6), 16 (6) అధికరణాలలోనే పేర్కొని వాటికి రాజ్యాంగ హోదా ఇచ్చేసారు. కానీ ఎస్.సి, ఎస్.టి, ఒ.బి.సిలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలో ఇవ్వాళ్టికీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పటికీ చేర్చలేదు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఎప్పటిలా కోర్టులు పట్టుబడితే ‘ఆర్థికంగా బలహీన వర్గాల’ పది శాతం రిజర్వేషన్లేమో పదిలంగా ఉండి, ఎస్.సి, ఎస్.టి, ఒ.బి.సి లకు ఇచ్చే రిజర్వేషన్ శాతం తగ్గే ప్రమాదముంది.
సవరణ చట్టం ఎందుకు అవసరం అయ్యిందో తెలిపే చారిత్రిక సందర్భాన్ని కానీ, అది పరిష్కరించాలని భావిస్తున్న వివక్ష స్వరూప స్వభావాల గురించి గానీ, అసలు అది వివక్షగా భావిస్తున్న అంశాలు 15, 16 అధికరణాల పరిధిలోకి వస్తాయా రావా అన్న విషయాన్ని గురించి గానీ వివరించడంలో ఆ చట్టం కోసం రాసిన ‘లక్ష్యాల, కారణాల ప్రకటన’ ఘోరంగా విఫలం అయ్యింది. చారిత్రిక నేపథ్యాన్ని వివరించాల్సి వస్తే రాజ్యాంగంలోని 39 అధికరణంలోని ఆదేశిక సూత్రాలను అమల్లోకి తేవడంలో ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో ప్రభుత్వం తనకు తానే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ పని చేయడం ఇష్టం లేకనే వాటి గురించి నిశ్శబ్దాన్ని పాటించింది. పేద ధనిక వర్గాల మధ్య అగాధాన్ని పూడ్చడానికి 72 సంవత్సరాలు ఈ ప్రభుత్వాలకు సరిపోలేదు. భౌతిక వనరులను సమానంగా పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండింది. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. పైపెచ్చు ఆర్థిక వనరులు, సంపద పిడికెడు మంది వద్దే జుగుప్సాకరంగా పోగుబడిపోవడానికి కారణమయ్యాయి. ప్రభుత్వాలు భూసంస్కరణలు జరగకుండా చూసి, ప్రణాళికలను అటకెక్కించి ప్రజలను స్వేచ్చా విపణికి బలిపశువులను చేసాయి. నూతన ఆర్థిక విధానాలు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడి ప్రజలను నిలువెల్లా దోచుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. నిరుద్యోగం యువతను దహిస్తోంది. ఈ సమస్యలన్నిటికీ సరైన పరిష్కారం వెతికే బదులు బీజేపీ ప్రభుత్వం నేడీ సవరణను ప్రజలపై రుద్ది రాజ్యాంగాన్ని వంచించడానికి పూనుకుంది.
‘ఆర్థికంగా బలహీన వర్గాల’ను ఈ సవరణ ఎలా నిర్వచించిందో చూడండి. ఇప్పటికే రిజర్వేషన్ సదుపాయం ఉన్న ఎస్సి, ఎస్.టి, ఒ.బి.సి వర్గాలు ఈ రిజర్వేషన్ కు అనర్హులు. రూ. 8 లక్షల కంటే ఎక్కున వార్షికాదాయం ఉన్నవారు అనర్హులు. అంతే కాదు, ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్, నోటిఫైడ్ మునిసిపాలిటీలో వంద చదరపు గజాల స్థలం, నాన్-నోటిఫైడ్ మునిసిపాలిటీలో రెండు వందల చదరపు గజాల స్ధలం – వీటిలో ఏ ఒక్కటి ఉన్న ఈ రిజర్వేషన్‌కు అనర్హులు. ఇది పేదలను క్రూరంగా అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు.
రిజర్వేషన్లు సహా అటువంటి సానుకూల చర్యల లక్ష్యం పేదరిక నిర్మూలన కానేకాదు. వాటి లక్ష్యం సామాజిక సమానత్వం సాధించడం. ఆర్థికంగా వెనుకబడిన వారి స్థితిగతులు మెరుగు పరచాలని ప్రభుత్వం నిజంగా భావిస్తే పాలకులు భూసంస్కరణలు అమలు చేయాలి, ఉద్యోగావకాశాలు పెంచాలి, సామాజిక భద్రత కల్పించాలి, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి, వారు నిర్లక్ష్యం చేసిన రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను నిక్కచ్చిగా అమలు చేయాలి. అసలు ప్రభుత్వమే నికార్సైన సంక్షేమ రాజ్యంగా అవతరించాలి.
‘ప్రతిభని చంపేస్తున్నారు’ అని గగ్గోలు పెట్టే ఆధిపత్య కులాల వారు ఈ సవరణపై నోరు మెదపలేదు. కనీసం నిరసన కూడా వ్యక్తం చేయలేదు. ‘కోటా’ మాట ఎత్తగానే ఆందోళనలకు దిగే వారు నేడు భయంకర నిశ్శబ్దాన్ని ఆశయించారు. వారి ఆరాటం కేవలం కుల ప్రాతిపదికన ఉండిన రిజర్వేషన్లను వ్యతిరేకించడమే తప్ప మరొకటి కాదు. తమకు అనుకూలంగా కోటా వస్తే వారికి అభ్యంతరం లేదు. కొత్త కోటా వారెవరి ప్రతిభనూ హరించేది కాదేమో!
ఈ సవరణ తీసుకుని వచ్చిన తీరు కూడా ఆందోళనకరంగా ఉంది. భాగస్వామ్య ప్రజాస్వామ్యంలో శాసన బిల్లులపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఒక కనీస అవసరం. పాలనాపరంగా ఆచరణయోగ్యమైన పద్ధతి. అందులోనూ నేడు ప్రభుత్వం తీసుకువచ్చింది ఆషామాషీ చట్టం కాదు, రాజ్యాంగ సవరణకే పూనుకుంది. ప్రజల నుంచి గోప్యంగా ఉంచి ఆగమేఘాల మీద ఈ విధంగా సవరణ తీసుకురావడం శాసన ప్రక్రియనూ, రాజ్యాంగాన్ని కించపరచడమేనని మానవహక్కుల వేదిక భావిస్తోంది.
రాబోయే ఎన్నికలలో లబ్ది పొందడానికి కేంద్రంలోని అధికార పార్టీ ఈ సవరణను ప్రతిపాదిస్తే సాధారణ పరిస్థితులలో ఇటువంటి తిరోగమన చర్యను వ్యతిరేకించే వారు సైతం ఆ ఎన్నికల దృష్ట్యానే మౌనంగా ఉండిపోయినట్టున్నారు. అధికార పార్టీతో భావజాలపరంగా విభేదించే పార్టీలు సైతం ఈ సవరణను వ్యతిరేకించక పోవడం ఆందోళనకర విషయం. అంతే కాదు, ఈ సవరణను అవి సమర్ధించాయి కూడా. ఎన్నికల వేళ అధికార పార్టీ ఇచ్చే ఉత్తుత్తి వాగ్దానం గానో, తాయలం గానో మాత్రమే దీన్ని చూస్తే అసలు విషయం గ్రహించని వాళ్ళమవుతాం. చారిత్రకంగా వెలివేతకు, వివక్షకు గురవుతున్న కులాలకు చేయూతనందించే రాజ్యాంగంలోని ప్రాతినిధ్య సూత్రానికి ఆర్.ఎస్.ఎస్, బి.జె.పిలు మౌలికంగానే వ్యతిరేకం అనేదే ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు విషయం. ఈ ప్రాతినిధ్య సూత్రం ఇష్టం లేకనే ‘ఆర్థిక ప్రాతిపదిక’ వాదాన్ని వారు పదే పదే ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు జరిగిందీ అదే. రాజ్యాంగం పై జరిగిన ఈ దాడిని దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ఖండించాలని మేము కోరుతున్నాము.
మానవహక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
24 జనవరి 2019