గండికోట రిజర్వాయర్ ముంపు గ్రామాలను పునరావాసం కల్పించకుండా తరిమివేయడం అన్యాయం

గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ రెండవ దశ పేరిట కడప జిల్లాలోని తాళ్ళప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామ ప్రజలకు తగిన నష్ట పరిహారం, సరైన పునరావాసం కల్పించకుండా వారి ఇళ్ళను ముంపుకు గురి చేసి, వారిని బలప్రయోగం ద్వారా గ్రామాల నుండి తరిమేయడానికి ప్రభుత్వ అధికార్లు చేస్తున్న ప్రయత్నాలను మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.  ప్రాజెక్ట్ వల్ల విస్థాపనకుగురయ్యే ఈ గ్రామస్తులకు ‘2013 భూసేకరణ చట్టం’ (భూసేకరణ, పునరావాసప్రక్రియలలో పారదర్శకత, న్యాయమైన నష్టపరిహారహక్కుచట్టం) ప్రకారం ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండా, సరైన పునరావాసం కల్పించకుండా వారిని బలవంతంగా అక్కడ నుండి తరిమేయాలని చూడటం అన్యాయం.  

తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులలో చాలా మందికి నష్ట పరిహారం అందలేదు.  ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం జోగాపురంలో కేటాయించిన 95 ఎకరాల భూమిలో కనీస వసతులు లేవు. గత పది రోజులుగా హడావిడిగా కొన్ని రోడ్లు పోసి, సింగల్ ఫేస్ కరంట్ ఇచ్చి చేతులు దులుపుకుని అక్కడకు పొమ్మంటున్నారు.  పునరావాసం కోసం కేటాయించిన మరో 80 ఎకరాల భూమి స్వాధీన పనే పూర్తి కాలేదు.  బెదిరించి, పోలీసు జులుం ప్రయోగించి ఇళ్ళు కూల్చేసి గ్రామస్తులను నివాసయోగ్యం కాని చోట బలవంతంగా తరలించాలని చూడటం పరమ దుర్మార్గం, అన్యాయం.  తాళ్ళ ప్రొద్దుటూరు ప్రజలపై పోలీసులు ప్రయోగిస్తున్న ఈ బెదరింపు చర్యలను, గ్రామస్థుల అక్రమ విస్థాపనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులకు తగిన నష్ట పరిహారం, దక్కవలసిన పునరావాస ప్యాకేజి అందలేదు.  చట్ట ప్రకారం చేయవలసిన ఏ ఒక్క పనీ చేయకుండా ప్రభుత్వ అధికార్లు ఆ గ్రామ ప్రజల ఇళ్ళ మీద పడి వారిని విపరీతమైన మానసిక వేదనకు, అభద్రతకు, ఎనలేని కష్టాలకు గురి చేస్తున్నారు.  ప్రాజెక్ట్ నిమిత్తంప్రజలను విస్థాపనకు గురిచేయాల్సి వచ్చినా చట్ట బద్దంగా న్యాయ సూత్రాలు పాటించి చేయాలి కాని ఈ విధమైన అక్రమ పద్ధతులలో కాదు. ప్రభుత్వం ముందుగా గ్రామస్థుల పునరావాసం కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుని వారిని అక్కడ నుండి గౌరవప్రదంగా తరలించలే కాని బలప్రయోగం ద్వారా కాదు.  

తాళ్ళ ప్రొద్దుటూరు ప్రజలు చాలా రోజులుగా తమ నిరసన తెలుపుతూ వస్తున్నారు.  ప్రజలతో ప్రజాస్వామిక పద్ధతిలో సంప్రదింపులు జరపకుండా ఈ విధంగా పోలీసు బలప్రయోగం చేయడం, బెదిరించడం తగదు.  తాళ్ళ ప్రొద్దుటూరు ప్రజలకు ఎటువంటి హక్కులు లేవని ప్రభుత్వం అనుకుంటున్నదా అనే అనుమానం కలుగుతుంది.  నివాసాలను ముంపుకు గురి చేయడం, సరైన పునరావాసం కల్పించకుండా బలవంతపు విస్థాపనకు గురిచేయడం ఆ ప్రజల కనీస హక్కుల ఉల్లoఘన అవుతుంది.  ఈ బలవంతపు విస్థాపన ప్రక్రియను ప్రభుత్వం వెంటనే నిలిపేయాలని, తగిన నష్టపరిహారం, పునారవాసం ఏర్పాటు చేసిన తర్వాతే గ్రామస్థుల తరలింపు సంగతి ఆలోచించాలని, సామరస్య పూర్వకంగా ప్రజాస్వామిక పధ్ధతిలో పునరావాస ఏర్పాటు జరగాలని హెచ్.ఆర్.ఎఫ్. ప్రభుత్వాన్ని కోరుతోంది. 

ఈ సందర్భంగా తాళ్ళ ప్రొద్దుటూరు ప్రజలకు సంఘీభావం తెలుపుతున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీని ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.   తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామంలో, జయశ్రీ నివాసం వద్ద ఉన్న పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.  

ప్రభుత్వం ముందుగా ప్రాజెక్ట్ నిర్వాసితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించి, సక్రమమైన పునరావాస ప్యాకేజి అందించిన తరవాతే గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితుల తరలింపు గురించి ఆలోచించాలి.  అప్పటి వరకు తాళ్ళ ప్రొద్దుటూరులో అడుగుపెట్టి వారి గూళ్ళు చెదరగొట్టడానికి వీలు లేదు. 

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
9 సెప్టెంబర్ 2020

Related Posts

Scroll to Top