కర్ణాటక విద్యాలయాలలో మత వివక్షకూ, హిందుత్వ అసహనానికీ గురవుతున్న ముస్లిం మహిళా విద్యార్ధులకు మానవ హక్కుల వేదిక (HRF) తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని తెలియచేస్తున్నది. హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన ఒక ముస్లిం మహిళా విద్యార్థినిని జై శ్రీరాం అని నినాదాలు ఇచ్చుకుంటూ కాషాయ మూక తరిమిన సన్నివేశం వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉంది. హిజాబ్ వేసుకుంటున్నందుకు విద్యార్థులను వేధించటం, హింసించటం రాజ్యాంగంలోని హక్కుల మీద, స్వేచ్ఛల మీద దాడి చెయ్యటమే. హిందుత్వ శక్తుల అసహ్యమైన రాజకీయాలకి ఇదొక మచ్చుతునక.
ఉడిపిలో ఒక ప్రభుత్వ కళాశాలలో మొదలయిన ఈ ప్రహసనం క్రమంగా షిమోగా, చిక్మగలురు, మాంద్య జిల్లాలలోని ఇతర విద్యాలయాలకు పాకింది. ఇటువంటి హక్కుల హననమే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పుదుచ్చేరిలలో కూడా జరుగుతున్నది. ఈ జాబితా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నది. ఇవన్నీ కూడా ద్వేషంతో నిండిన అప్రజాస్వామిక, రాజ్యంగవిరుద్ధ దాడులు. విద్యాలయాలకు హిజాబ్ ధరించి వెళ్ళటం అనేది వారి వారి వ్యక్తిగత ఇష్టం. అటువంటి వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద వ్యవస్థీకృత ఆంక్షలు విధించటం హిందుత్వ ప్రాజెక్ట్‌ని మరింతగా ముందుకు తీసుకువెళ్లటంలో భాగమే. ఇప్పటికే ఈ హిందుత్వ ప్రాజెక్టులో భారతీయ ముస్లింలు తమ హక్కులను, స్వేచ్ఛలను కోల్పోయిన పరిస్థితి ఉంది.
ముస్లింల హక్కుల హననానికి – ముఖ్యంగా ముస్లిం మహిళల హక్కులపై జరుగుతున్న దాడికి – లభిస్తున్న మద్దతు చాలా కలవరపరుస్తున్న విషయం. ‘బుల్లి బాయి’ యాప్ ద్వారా ముస్లిం మహిళల ‘ఆన్‌లైన్ వేలం’ ఘటన జరిగి ఇంకా నెల కూడా నిండలేదన్న విషయం ఇక్కడ గుర్తుచేసుకోవటం అవసరం.
ముస్లిం మహిళల మీద పెరుగుతున్న ఈ దాడులు, వేధింపులు భారత ప్రజాస్వామ్యం ఏ విధంగా నానాటికి దిగజారుతున్నదో సూచిస్తుంది. ఇటువంటి దాడులు జరుగుతున్న రాష్ర్రాలలోని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులు, విద్యాలయాల పాలకవర్గం రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక భావనలను అమలయ్యేలా చూడాలని మానవహక్కుల వేదిక కోరుతున్నది. ఈ అడ్డూఅదుపూ లేని ముస్లిం ద్వేషాన్ని హిజాబ్ వర్సెస్ కాషాయం అనే తప్పుడు ద్వందంగా మార్చొద్దని మీడియాని మేము కోరుతున్నాము.
వస్త్రధారణ హక్కును మత గ్రంధాల పరిధిలో కోర్టులు వ్యాఖ్యానించటం చాలా ప్రమాదకరమైన పద్ధతిని మానవ హక్కుల వేదిక నమ్ముతున్నది. రాజ్యాంగం ప్రజలందరికీ దఖలు పరిచిన స్వేచ్చా, సమానత్వ హక్కులను కోర్టులు నిలబెడతాయని మేము ఆశిస్తున్నాము.
మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
12 ఫిబ్రవరి 2022