కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసిఐఎల్) గనికి చెందిన టెయిలింగ్ పాండ్ కట్ట శుక్రవారం నాడు తెగిపోయి ఆ పాండ్‌లోని వ్యర్థాలు బయటకి పొంగుకొచ్చాయి. యురేనియంని శుద్ధి చేసేటప్పుడు విడుదలయ్యే వ్యర్థాలని టెయిలింగ్ పాండ్‌లో బురద రూపంలో భద్రపరుస్తారు. ఈ టెయిలింగ్స్‌లో డజనుకి పైగా అణుధార్శ్మిక పదార్ధాలు ఉంటాయి. అవన్నీ అత్యంత కలుషితమైనవి. అలాగే భూగర్భ జలాలకూ, నీటి వనరులకూ, వ్యవసాయానికీ, పాడికీ, మనుషులకూ అత్యంత ప్రమాదకరమైనవి.
కె.కె కొట్టాల గ్రామానికి, ఎర్రవంక వాగుకి సమీపాన ఈ పాండ్ ఉంటుంది. సెప్టెంబర్ 2-3 మధ్యరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ కట్ట తెగింది. మబ్బుచింతలపల్లి, తుమ్మలపల్లి, భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి, కె.కె.కొట్టాలకి చెందిన ప్రజలు తమ ప్రాంతందాకా ఈ కాలుష్యం వ్యాప్తి చెందుతుందేమోనన్న భయంలో బ్రతుకుతున్నారు. టెయిలింగ్ పాండ్‌తో ఇటువంటి సమస్య ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. ఇదే సంవత్సరం జూన్ 9న కురిసిన వర్షాలకి కూడా ఈ పాండ్ కట్ట తెగి పొంగి, టెయిలింగ్స్ కాలుష్యం పరిసరాలలో వ్యాప్తి చెందింది. దగ్గరలో ఉన్న అరటి తోటలు, ఇతర పంటలు వీటి బురద కింద ఆరు అడుగుల లోతులో మునిగిపోయాయి. రైతులు భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. అటువంటి వర్షం పడుతుందని మేము ఊహించలేదు అని యుసిఐఎల్ అప్పుడు చెప్పిన సాకు!
యురేనియం తవ్వకాల కారణంగా జరిగే పర్యావరణ, ఆరోగ్యపరమైన నష్టాల గురించి మానవహక్కుల వేదిక, పర్యావరణ సంస్థలు, ఇతరులు తరచుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. యురేనియం తవ్వకం, శుద్ధి కారణంగా గాలి, మట్టి, నీటి వనరులు, భూగర్భజలాలు భారీగా కలుషితం కావడం ఖాయమని ఎంతో కాలంగా మేము చెబుతూనే ఉన్నాము. ఆ పరిసర ప్రాంతాలలోని గ్రామస్తులు ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. కె.కె. కొట్టాల దగ్గర టెయిలింగ్ పాండ్‌లో యుసిఐఎల్ అణుధార్మిక వ్యర్థాలని ఎంత నిర్లక్ష్యపూరితంగా నిల్వ చేస్తున్నదన్న విషయాన్ని మేము ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము. సరైన కట్ట లేకపోవడం, కట్టకి లైనింగ్ లేకపోవడం కారణంగా అందులో ఉన్న అణుధార్మిక వ్యర్థాలు భూగర్భ జలాలలో ఇంకుతున్నాయని, లీక్ అవుతున్నాయని మేము అనేక సార్లు తెలియచేశాము. ఈ పాండ్ నుండి వ్యర్థాలు లీక్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏవీ సంతృప్తికర రీతిలో యుసిఐఎల్ తీసుకోలేదు. నియమాల ప్రకారం భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండటానికి యురేనియం పాండ్లని బంకమన్నుతో, లీకులకి అవకాశం లేని రీతిలో లైనింగ్ చెయ్యాలి. అయితే కె.కె. కొట్టాల దగ్గరలో ఉన్న పాండ్‌కు ఇవేమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే లైనింగ్ లేని పాండ్‌లో యుసిఐఎల్ అణుధార్మిక వ్యర్థాలను నిల్వ చేస్తోంది.
పైపెచ్చు ఈ ప్రశ్నలని దాటవెయ్యడం, ప్రతిదానిని రహస్యంగా ఉంచడం యుసిఐఎల్ తన విధిగా పెట్టుకున్నది. ఈ లీక్ వల్ల ప్రమాదం పెద్దగా లేదు అని చెప్పడమో లేదా పర్యావరణానికీ, ప్రజలకూ, పాడిపశువులకీ, ప్రజల జీవనోపాధులకూ దీని వల్ల ఎటువంటి నష్టం వుండదని బుకాయించడమో చేస్తోంది. మొన్న జరిగిన లీకు గురించి కూడా ఇది చాలా చిన్న విషయమని, పర్యవసానాలు ఏమీ ఉండవని చెప్పి తప్పించుకున్నది. అయితే స్థానికులతో మేము మాట్లాడినప్పుడు వారు భయపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. కట్ట సరిగ్గా లేకపోవటం, దాని మీద పర్యవేక్షణ ఏ మాత్రం లేకపోవటమే వారి భయానికి కారణం. తెగిన కట్టను ఫోటో, వీడియో తీద్దామని ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
యుసిఐఎల్ చేస్తున్న ఈ క్రిమినల్ కార్యకలాపాలు అడ్డుకోవటానికి నియంత్రణ సంస్థలు చేస్తున్నది శూన్యం. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖలు గానీ అణు విద్యుత్తు విభాగం, అణు విద్యుత్తు నియంత్రణ సంస్థ లాంటి సంస్థలు గానీ యుసిఐఎల్ ఇస్తున్న ప్రకటనలు నిజమా కాదా అని పరిశీలించడం గానీ, యురేనియం తవ్వకాల వల్ల ప్రబలిన అణుధార్మికతను పట్టించుకున్నది గానీ లేదు. ఇంకా చెప్పాలంటే పరిసరాల మీద టెయిలింగ్ పాండ్ ప్రభావం గురించి విచారణ చెయ్యటానికి ఒక సందర్భంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల బృందం యుసిఐఎల్ వారితో కుమ్మక్కై వారి ప్రమాదకరమైన ఉల్లంఘనలను, నియమాల అతిక్రమణను తొక్కిపెటింది.
భద్రతా నియమాలకి సంబంధించి యుసిఐఎల్ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన వారికి పరిహారం అందచెయ్యాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది. యుసిఐఎల్ వారి రక్షణ పరికరాలు, పనితీరుపై ఒక సమగ్రమైన విచారణ జరపాలి. యుసిఐఎల్ తరుచుగా నియమాలను ఉల్లంఘించటం, వాటి గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని తుమ్మలపల్లిలో యుసిఐఎల్ కార్యకలాపాలని తక్షణమే నిలిపివెయ్యాలని, విస్తరణకి ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని కూడా మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
4 సెప్టెంబర్ 2021